22, నవంబర్ 2025, శనివారం

ఆంజనేయ కార్యసిధ్ధి మంత్రము - Hanuman Karyasiddhi Mantra

 


ఆంజనేయ కార్యసిధ్ధి మంత్రము అన్నది రామాయణము నందు సుందరాకాండ ముగింపు ఘట్టములో ప్రస్తావించబడినది. దీన్ని సీతాదేవి ప్రస్తావించింది. 

ఆంజనేయుడు రాముని ఆజ్ఞ మేరకు సీతాదేవి కోసమని వెదుకుతూ, సముద్రము దాటి లంకకు వెళ్ళాడు. లంక అంతటా గాలించి, ఆ ప్రయత్నములో అనేక మంది రాక్షసులను హతమార్చి, అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి జేరుకుంటాడు. 


ఆమెకు నమ్మకము కలిగించడానికి రాముని యొక్క గుణగానము, అతని అవయవ సౌష్టవము సీతాదేవికి వల్లెవేస్తాడు. ఆ విధముగా సీతాదేవి పెట్టిన పరీక్షలు అన్నింట్లో ఉత్తీర్ణుడై, ఆమెకు నమ్మకము కలిగిస్తాడు. రాముని క్షేమము చెప్పి, ముద్రికను చూపించి, త్వరలోనే మేమందరము వచ్చి నిన్ను విడిపించుకుని తీసుకెళ్తామని ఓదార్చి, తిరుగు ప్రయాణము కట్టే ముందు, కాస్త రావణాసురుడి ఆట పట్టించి వెళ్తానని చెప్పి ఆవిడ ఆజ్ఞ పొందుతాడు. 

అశోకవనము అంతా  చిందరవందర చేసేసి, రాక్షసుల చేతిలో బంధింపబడినట్లుగా నాటకమాడి, రావణాసురుడి దగ్గరకు జేరుతాడు. అతనికి శిక్షగా తోకకు నిప్పంటించి లంకా నగరమంతా తిప్పుతుంటే అన్ని రహస్యాలు ఆరా తీస్తూ ఆనందంగా తిరుగుతాడు. ఆ తర్వాత ఒక్కసారిగా బంధము విడిపించుకుని పైకి ఎగిరి తన తోకకి ఉన్న మంటలతో భవనాలన్నీ కూలిపోయేలా మంటలు అంటించి, సముద్రపు నీటిలో మునిగి మంటని ఆర్పేసుకుని, భయపడుతూ మళ్ళీ సీతాదేవి దర్శనము చేసుకుని, ఆవిడ క్షేయంగానే ఉందని సాంత్వన చెందుతాడు. 

అప్పుడు సీతాదేవి అతని ఘనకార్యములన్నిటినీ తిలకించింది కనుక ధైర్యము చెంది, తనను తప్పకుండా అతని సాయముతో శ్రీరాముడు విడిపించుకుంటాడని నమ్మకము పొందుతుంది. ఈ సందర్భము లోనే సీతాదేవి ఈ కార్యసాధన మంత్రమును ప్రస్తావించింది. 

ఆంజనేయా నీవు అన్నింటికీ సమర్ధుడివే అని అంటుంది. ఇదే మాటను ఈ క్రింది శ్లోకములో అంటుంది. 

ఆంజనేయ కార్యసాధన మంత్రము     

త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ | 
హనుమన్ యత్నామాస్థాయ దుఃఖక్షయ కరోభవ ||   

అర్థము:
ఓ హరిసత్తమా ! గొప్ప కార్యములను కూడా సులభముగా నిర్వహించుటలో నీకు నీవే సాటివి. కార్యసాధనకు నువ్వే సజీవ ప్రమాణము. (ఎందుకంటే అవలీలగా సముద్రాన్ని దాటి వచ్చి, దుర్భరమైన లంకలోకి యుక్తితో ప్రవేశించడమే కాకుండా అక్కడి రాక్షసులను గజగజ వణికించి, భయభీతులను చేసి పరిమార్చి, ధైర్యముగా రావణాసురుడి సభలో జేరి హితవు మాటలు చెప్పి, ఆ పిమ్మట లంకా దహనము కూడా చేయగలిగాడు). అందుకే అతడు అసాధ్య కార్యములను సాధ్యము చెయ్యడానికి అతడే సాటి, ప్రమాణము అయ్యాడు. 

కొంచము ప్రయత్నము చేసి నా దుఃఖమును కూడ పోగొట్టుమా హనుమా! ఈ మాట చెప్పడములో సీతాదేవి ఉద్దేశ్యము ఏమిటంటే శ్రీరామునికి ఎలాగో అల్లాగ నచ్చచెప్పి రావణునితో యుద్ధానికి పురికొల్పాలి. అలా ఎగదోలితే కానీ రాముడు యుద్ధము చెయ్యడు, రావణుడు చావడు. రావణుడు ఛస్తే కాని సీతకు ముక్తి దొరకదు. అందుకని హనుమంతుని సీతాదేవి అంతగా వేడుకోవాల్సి వస్తోంది. ఇక్కడ రాముడి ప్రతిష్ట కూడ ఆవిడ కాపాడ దలుచుకుంటోంది అని మనము గ్రహించాలి. 

ఈ విధముగా సీతాదేవి అంతటి గొప్ప ఆవిడకే హనుమంతుడు దిక్కు అయ్యాడు. స్వయంగా లక్ష్మీదేవి అయిన ఆమెయే ఆంజనేయుని ప్రార్ధించగా లేనిది మనము ఎక్కడో ఊహించండి. ఎంతగా ఆయనను పూజించినా తక్కువే అవుతుంది. 

కాబట్టి మనమందరమూ కూడా మన కష్టాలను గట్టెక్కించమని ఆయనను వేడుకుంటూ ఉందాము. 

ఈ మంత్రమును 3 సార్లు కానీ, 11 సార్లు కానీ మనము తోచినప్పుడల్లా చదువుకుంటూ ఆయనను తలుచుకోవచ్చును.        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి