మనము పొద్దుట నిద్ర నుండి లేస్తూ భగవంతుడి పేరు తలుచుకుంటూ లేస్తే ఆ రోజంతా మంచిగా ఉంటుందని చెబుతూంటారు. లేస్తూనే ఓం నమశ్శివాయ అనో, ఓం నమో నారాయణాయ అనో, లేదా నమో లక్ష్మీమాత అంటూనో, గౌరీమాత అంటూనో , మీకిష్టమైన దేవుణ్ణి తలుచుకుంటూ లేవచ్చును.
![]() |
My Mother's Painting |
ఆ పిమ్మట ముందుగా అమ్మ ముఖము చూసి, కాల్యకృత్యములు నిర్వహించడము మొదలిడ వచ్చును. లేదా తల్లితండ్రుల ఫోటో అయినా చూసుకోవచ్చును.
నిత్యకృత్యాలు చేసుకునేటప్పుడు చదవటానికి వీలుగా కూడా మన పెద్దలు కొన్ని శ్లోకాలను తయారుచేశారు. ఈ విధంగా ప్రతీ పనీ కూడా దేవుణ్ణి తలుచుకుంటూ చేస్తున్నట్లుగా అవుతుంది. వీటివల్ల మనస్సుకి ఎంతో ప్రశాంతతగా , హాయిగా ఉంటుంది. చీకుచింతలు, చికాకులు ఉండవు.
ఇప్పుడు నేను కొన్ని శ్లోకములను వివరిస్తున్నాను.
ఉదయం లేవగానే
అరచేతులు కళ్ళకు అద్దుకుంటూ :
నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే
సహస్ర పాదాక్షి శిరోరు బాహవే
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటి యుగధారిణే నమః ||
అర్థము :-
మహావిష్ణువు (శ్రీమన్నారాయణుడు) ని తలుచుకుంటున్నాము పక్కమీద లేచి కూర్చుని ఆయన విశ్వరూపాన్ని ఊహించుకుంటూ. ఆయన ఎలా ఉన్నారంటే అంతులేని ఆకారంలో ఉన్నారు. వెయ్యి రూపాలతో కనిపిస్తున్నారు. వెయ్యి అన్నది ఒట్టినే ఎనలేని (అంటే లెక్క పెట్టలేనన్ని) అనే అర్థములో వాడుతున్నాము ఇక్కడ. లెక్క లేనన్ని పాదములు, కనులు, శిరస్సులు, మొండెములు, బాహువులతో ఉన్నారు. అనంతములైన పేర్లు ఉన్నవి ఆయనకు. శాశ్వతముగా (ఆది, అంతములు లేనివారు) ఉండే పురుషుడు ఆయన. పురుషుడు అన్నది కూడ మన ఊహ మాత్రమే. పరమాత్మ అనుకోవాలి. అటువంటి పరమాత్ముడు, అనంతకోటి యుగములను ధరించువాడు అయిన ఆ పరంధాముడికి నమస్సులు సమర్పించుకుంటున్నాము.
ఇంకొక శ్లోకము కూడా చదువుకోవచ్చును. (పై శ్లోకము చదువుకో లేక పొతే దీన్నే చదువుకో వచ్చును.)
కరాగ్రే వసతి లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ,
కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనమ్ ||
కర మూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనమ్ ||
అర్థము :-
అరచేతులలో దేవీ దేవతలను చూసుకుంటూ స్మరిస్తున్నాము.
అరచేయి ముందు భాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీ దేవి, చిట్టచివర గౌరీ దేవి నివసించునట్టి చేతి దర్శనము వేకువ ఝామున చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆ దేవీదేవతలకు నమస్కరించుకోవడము జరుగుతోంది.
ఇదే విధముగా పడక నుండి లేచి భూమి మీద కాలు పెట్టునప్పుడు భూదేవి, లక్ష్మీదేవులను స్మరించుకుంటూ కాలు మోపుతున్నాను, క్షమించుమంటూ నిలబడాలి.
స్నానము చేయునప్పుడు
గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిమ్ కురు ||
అర్థము :-
పైన ఏడు పుణ్యనదుల పేర్లు పేర్కొనబడ్డాయి. గంగ, యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు నది, కావేరీ నదులను స్మరించుకుంటూ - ఓ నదీదేవతలారా, మీ యొక్క పవిత్ర జలములను నాకు ప్రసాదించండి స్నానానికి అని వేడుకుంటున్నాము.
ఈ విధంగా శ్లోకము చదువుకుని స్నానం చేస్తే ఆ నదులలో స్నానము చేసిన ఫలితము దక్కుతుంది.
బొట్టు పెట్టుకునేటప్పుడు
కుంకుమం శోభనం దివ్యమ్
సర్వదా మంగళప్రదమ్
ధారణేన అస్య శుభప్రదమ్
సౌభాగ్యదాం శాంతిదాం సదామమ ||
అర్థము :-
నేను ధరించే ఈ కుంకుమ బొట్టు/తిలకము దివ్యమైనది, నాకు శోభను, తేజస్సును ప్రసాదించేది. అన్నివేళలా నాకు మంగళప్రదమైనది (అంటే పవిత్రత కలిగించేది). ఇది ధరిస్తే శుభాన్ని, మంచిని సూచించేది. సర్వదా నాకు భాగ్యమును, శాంతిని ప్రసాదించునది,
దీర్గాయుష్షు నిచ్చేది. అటువంటి తిలకమును నేను ధరిస్తున్నాను.
భోజనానికి కూర్చున్నప్పుడు
అన్నపూర్ణే సదాపూర్ణే
శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం
భిక్షామ్ దేహిచ పార్వతి ||
అర్థము :-
మనము భోజనము చేసేది జ్ఞాన సముపార్జన, కర్తవ్య పాలనముల కోసం కావాల్సిన బలము, శక్తి కలిగించుకోవడానికి మాత్రమే అని తెలుసుకోవాలి.
అన్నానికి అధిదేవత అన్నపూర్ణాదేవి. ఆమెను వేడుకుంటున్నాము ఇక్కడ.
ఓ అన్నపూర్ణాదేవీ, శంకరుని ప్రాణేశ్వరీ! నిత్యమూ పూర్ణముగా ఉంటూ, నేను జ్ఞానమునూ, వైరాగ్యమునూ సాధించుకుంటూ ఉండటం కోసము భిక్షను ప్రసాదించు తల్లీ.
ఇక్కడ వైరాగ్యము అంటే పూర్తిగా పనులన్నీ త్యజించడము కాదు. మనము చేసే పనులన్నీ కూడా ఆసక్తి, కోరికలు లేకుండా చేసుకోవాలని అర్థము. ప్రతీ పనీ ఇతరుల మంచి కోసము, ప్రపంచానికి మంచి జరగాలని చేస్తూండాలి.
ఆ పిమ్మట "అన్నం పరబ్రహ్మం" అనుకుని ఆ పరమాత్మకు నమస్కరించి నోట్లో రెండు మెతుకులు పెట్టుకుని తినడం మొదలెట్టాలి.
భోజనము పూర్తి అయ్యాక
అమృతోపస్తరణ మసి ||
అర్థము :-
తినడము అయ్యాక లేచే ముందు కొన్ని నీటి చుక్కలను తిన్న విస్తరి లేదా కంచము చుట్టూ జల్లుతూ "అమృతోపస్తరణమసి" అని అనుకోవాలి. అపస్తరణము అంటే అంతటా వ్యాప్తి చెందటం. జల్లిన ఆ నీటి చుక్కలు అమృతముగా పని చేస్తూ తిన్న తిండిని అమృతముగా చేసి ఆరోగ్యము, ఆయుస్సు పెంచుగాక అని భగవంతుని వేడుకుంటున్నాము.
పని మీద బయటికి వెళ్లునప్పుడు
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః
నిర్విఘ్నమ్ కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
అర్థము :-
ఓ విఘ్నేశ్వరా! వంపులు తిరిగిన తుండము, విశాలమైన శరీరము పొందినవాడవు, కోటి సూర్యుల తేజస్సు కలిగినవాడవు అయినట్టి నీవు మా అన్ని పనులలో, అన్ని సమయములందునూ ఎటువంటి విఘ్నములూ ఏర్పడకుండా కాపాడుతూ ఉండు దైవమా.
ఆందోళన, భయము పోగొట్టుకోడానికి
శ్రీ రామ స్తోత్రమ్:
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||
అర్థము :-
ఆపదలను తొలగించుచు, సంపదలను, శుభములను ప్రసాదించునటువంటి లోకులకు ప్రియమైనటువంటి శ్రీ రామచంద్రునికి పదేపదే నమస్కరిస్తున్నాను అని చదువుతూ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడైన ఆ శ్రీరాముని స్మరించుకోవాలి.
ఆంజనేయ స్తోత్రమ్:
శ్రీ ఆంజనేయం, ప్రసన్నఆంజనేయం, ప్రభాదివ్య కాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, భజేహం పవిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం, భజేహం భజేహం ||
క్లిష్టమైన పనులు చేసేటప్పుడు
ఆంజనేయుని తలుచుకుంటూ-
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ
అర్థము :-
హరిసత్తమ అని ఆంజనేయుని ఉద్దేశించి అడుగుతున్నాము. అతను హరిభక్తుడు, మంచి శ్రేష్ఠ స్వభావము కలవాడు.
ఓ ఆంజనేయా ! నువ్వు కార్యములు సాధించడములో మంచి నేర్పరివి, సఫలత్వమునకు నువ్వే ప్రమాణము. దయచేసి నా పనులలో అడ్డంకులను, బాధలను తొలగించుచు పని విజయవంతము అయ్యేట్లా చెయ్యవా? ఈ విధముగా లంకలో సీతాదేవి ఆంజనేయుడిని అడిగింది, ఆంజనేయస్వామి లంకను దాటి, రాక్షసులను వధించి, లంకను దహించిన తరువాత.
కాబట్టి మనము కూడా ఇలా అడిగితె ఆయన పలుకుతాడు.
ప్రయాణము చేసేటప్పుడు
యత్ర యోగేశ్వర కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతి మమః ||
అర్థము :-
ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్బాణములు ధరించిన పార్థుడు (అర్జునుడు) ఉంటారో, అక్కడ తప్పనిసరిగా శ్రేయస్సు, విజయము ఉంటాయని నమ్మకము (ఇది సంజయుడు ధృతరాష్రునికి చెప్పాడు). మనము కూడా ఈ నమ్మకము పెట్టుకుని దైవాన్ని స్మరించుకుంటూ ప్రయాణము మొదలుపెడితే అది సఫలము అవుతుంది.
రాత్రి పడుకునే ముందు
రామస్కంధం, హనూమంతం, వైనతేయం, వృకోదరమ్
శయనే యస్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి ||
అర్థము :-
పడుకునేటప్పుడు శ్రీ రాముని, హనుమంతుడిని, గరుత్మంతుడిని, భీముడిని స్మరిస్తూ పడుకుంటే దుఃస్వప్నములు రాకుండా ఉంటాయని ప్రతీతి.
నేను పడుకునేటప్పుడు శ్రీమన్నారాయణుని తలుచుకుంటూ పడుకుంటాను.
"ఓం నమో నారాయణాయ" అని. అలాగే లక్ష్మీమాతను, శ్రీ రాముని, శ్రీ కృష్ణుని తలచుకోవడము కూడా చేస్తూంటాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి