26, నవంబర్ 2025, బుధవారం

సూర్యాష్టకము - Worship of Sun God


సూర్యాష్టకము అంటే సూర్యుని పూజ చేసుకోడానికి చదివే ఎనిమిది శ్లోకాలు. సూర్యుని ఉపాసించే వారు ప్రతిరోజూ ఈ అష్టకము చదువుతూ సూర్య నమస్కారములు చేసుకోవచ్చును. ముఖ్యముగా ప్రతీ ఆదివారము నాడు ఉదయము, సాయంత్రము వీటిని చదివి (లేదా చదువుతూ) సూర్యుని ఉపాసించిన ఎడల మంచి లాభము అని చెబుతూ ఉంటారు మన పెద్దలు. 



సూర్యుడు ఈ భూమిపై జీవనానికి నాంది. సూర్యుని కిరణములు, వెలుగు లేనిదే జీవనము ఉండదు. మన ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా మంచిది. అందుకనే ఉదయము లేవగానే సూర్యుని ఎండ పడే చోట కొన్ని నిమిషాలు నిలబడటమో, కూర్చోడమో చేయాలి. మన పెద్దలే కాక, డాక్టర్లు కూడా ఇదే విషయము చెప్తారు. 

అలా సూర్యుని ఎదురుగా నిలబడి కాని, కూర్చుని కాని మనము శ్రద్ధతో ఈ సూర్యాష్టకము చదువుకుందాము. ఈ విధముగా కొంతసేపు మనకు సూర్యుని వెలుగు, కిరణాలు సోకుతూంటాయి. మన ఆరోగ్యము బలిష్టమౌతుంది. 

సూర్యాష్టకం శ్లోకాలు   


ముందుగా శ్రీ సూర్యనారాయణ స్తుతి 


ధ్యేయ స్సదా సవితృమండల మధ్యవర్తీ 
నారాయణ సరసిజాసన సన్నివిష్ఠహ  
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ 
హారీ హిరణ్మయ వపుహు ధృత శంఖ చక్రహః || 

అర్థము:
దృష్ఠి ఎల్లప్పుడూ సూర్యమండలము మధ్యలో నెలకొని ఉన్న పద్మము నందు ఆసీనుడై ఉన్న, మరియు భుజము నందు కేయూరములు (కడియములు), చెవులకు మకర కుండలములు (మొసలి ఆకారము కలిగిన కర్ణాభరణము), కిరీటము, హారములు, శంఖ చక్రములు ధరించి, బంగారు వన్నెల దేహకాంతితో విరాజమానమై ఉన్న ఆ మహావిష్ణువును ధ్యానించెదము.

ఇప్పుడు అష్టకము   


ఆదిదేవ నమస్తుభ్యం 
ప్రసీద మమ భాస్కరః |  
దివాకర నమస్తుభ్యం 
ప్రభాకర నమోస్తుతే || (1)

అర్థము:
ఆదిదేవుడవైన నీకు వందనములు. ఓ భాస్కరా నన్ను దయచూడు. దివాకరుడా వందనములు, ప్రభాకరుడవైన నీకు నమస్సులు సమర్పించుకుంటున్నాను.
 
భాస్కరుడు = తేజస్సు, కిరణములు ప్రసారించువాడు 
దివాకరుడు = దినము అంటే పగలు ఇచ్చేవాడు
ప్రభాకరుడు = వెలుగు, జ్యోతిని ఇచ్చేవాడు 
 

సప్తాశ్వ రథమారూఢం 
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మధరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (2)

అర్థము:
ఏడు గుఱ్ఱములు కల రథములో ప్రయాణము చేయువాడు, ప్రచండుడు అంటే అత్యంత తేజస్సు, ఉష్ణముతో భీకరముగా ఉండువాడు, కశ్యప మహర్షి తనయుడు, తెల్లని పద్మము దాల్చినవాడు, అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నా వందనములు. 

 
లోహితం రథమారూఢం 
సర్వలోక పితామహం 
మహాపాప హరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (3)

అర్థము:
ఎరుపు వన్నెలతో దేదీప్యమానంగా వెలిగిపోయే రథమునందు ప్రయాణము చేయువాడు, సకల లోకములకు పితామహుడు, మహాపాపములను కూడా పోగెట్టేవాడు అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నావందనములు. 


త్రైగుణ్యం చ మహాశూరం 
బ్రహ్మ విష్ణు మహేశ్వరం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (4)

అర్థము: 
త్రిగుణములందు గొప్పవాడవు, బ్రహ్మ, విష్ణువు, శివుడి తో సమానమైన వాడవు, మహాపాపములను కూడా పోగెట్టేవాడు అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నావందనములు.


బృంహితం తేజసాం పుంజం 
వాయురాకాశ మేవచ 
ప్రియంచ సర్వలోకానాం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (5)

అర్థము:
పుష్టికరమైన, తేజస్సుతో నిండిన కిరణములను వాయురాకాశములందు ప్రసరింపజేస్తూ, అంతటా వ్యాపించి ఉంటూ, సకల లోకములకు ప్రియుడవైన ఓ సూర్యనారాయణా, నీకు వందనములు సమర్పించుకుంటున్నాను. 


బంధూక పుష్ప సంకాశం 
హారకుండల భూషితం 
ఏకచక్ర ధరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (6)

అర్థము:
బంధూక పుష్పము అన్న పూవు చిక్కటి ఎరుపు, రక్తము రంగులో ఉంటుంది. అటువంటి దేహ వర్ణము కలిగి, హారములు, కుండలములు (చెవికి ఆభరణము) మున్నగు ఆభూషణములతో
అలంకరింపబడిన వాడును, ఒంటి చక్రము (అంటే విష్ణు చక్రము) ధరించిన వాడును అయిన ఓ సూర్యనారాయణా, నీకివే నా వందనములు.  


తం సూర్యం లోకకర్తారం 
మహాతేజ ప్రదీపనం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (7)

అర్థము:
ఓ సూర్యనారాయణా! ఈ లోకమునకు సృష్టి కర్తవు, యజమానివి నీవే. మహా తేజస్సుతో ప్రకాశిస్తూ, పాపములను హరించే నీకు ఇవే నా వందనములు. 
 

తం సూర్యం జగతాం నాథం 
జ్ఞాన ప్రాకాశ్య మోక్షదం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (8)

అర్థము: 
ఓ సూర్యనారాయణా! ఈ సకల జగత్తుకు తండ్రివి అయి ఉండి, జ్ఞానము, ప్రకాశము, మోక్షములను అందించువాడవు నువ్వు. మహా పాపములను తొలగించి మాకు కూడా మోక్షమును ప్రసాదించు ఓ దేవా. నీకివే నా వందనములు.  

ఫల శ్రుతిః 

సూర్యాష్టకం పఠే న్నిత్యం 
గ్రహపీడా ప్రణాశనమ్ 
అపుత్రో లభతే పుత్రం 
దరిద్రో ధనవాన్ బనేత్ || 

అర్థము:
ఈ సూర్యాష్టకమును ఎవరయితే ప్రతిరోజూ చదువుకుంటారో అట్టి వారికి గ్రహపీడలు ఉండవు, అవన్నీ తొలగిపోతాయి. పుత్రుడు లేని వారికి పుత్రుడు లభిస్తాడు. దరిద్రులకు ధనము దొరికి ధనవంతులు అవుతారు. 


స్త్రీ తైల మధు మాంసాని 
యే త్యజంతి రవేర్ దినే 
న వ్యాధి శోక దారిద్య్రం 
సూర్య లోకం చ గచ్ఛతి ||

అర్థము:
ఆదివారము రోజున ఈ సూర్యాష్టకమును నియమము తప్పక చదువుతూ, స్త్రీ భోగము, తాగుడు, మాంసము మున్నగువాటిని దూరముగా పెట్టినవారికి వ్యాధులు కానీ, శోకము కాని (అంటే దుఃఖము), దరిద్రత వంటివి ఉండవు. వీరంతా కూడ అంత్యకాలములో సూర్యలోకానికే జేరుకుంటారు.  


ఓం తత్ సత్ || ఇది ముమ్మాటికీ నిజము. 
  
ఇతి సూర్యాష్టకమ్ సంపూర్ణం ||   
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి