26, సెప్టెంబర్ 2024, గురువారం

కృష్ణాష్టకము - 8 Hymns of Sri Krishna


కృష్ణాష్టకం అంటే శ్రీ కృష్ణుని స్తుతి చేస్తూ చదివే ఎనిమిది శ్లోకాలు అన్నమాట. ఈ శ్లోకాలు కృష్ణుని యొక్క జీవితం లోని కొన్ని సంగతులను, అద్భుత కృత్యాలను తెలుపుతూ కీర్తించే కీర్తనల వంటివి. 

శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం లోకానికంతటికీ గురువు. మనందరి మంచికోసము ఆయన అవతారమెత్తి రాక్షసులని చంపి, దుష్టులను దండించి, మన మేలు కోరుతూ భగవద్ గీత ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు. చావు, పుట్టుకలంటే ఏమిటి, మనిషి పుట్టుక ఉద్దేశ్యం ఏమిటి, మనిషి ఏ విధంగా ఈ సంసార సాగరాన్ని దాటాలి, మొదలైన విషయాలన్నింటిని గీతోపదేశము ద్వారా తెలియజేశారు. అంతేకాక ఎవరైతే పూర్తిగా నన్ను నమ్ముకుని నా శరణు కోరుతారో వారికి తప్పకుండా విజయము, మోక్షము ప్రసాదిస్తాను అని మహాభారతంలో అర్జునికి చెపుతూ మనకి తెలియజేసెను . 

అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ మనము ఈ కృష్ణాష్టకాన్ని ప్రతి రోజూ పూజ సమయంలో చదువుకోవచ్చును. 


కృష్ణాష్టకము 

వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || (1)

తాత్పర్యము :-

వసుదేవుని కొడుకు, దేవకీదేవికి అత్యంత ఆనందాన్ని కలిగించే ఓ దేవా! కంసచాణూరులను చంపి లోకాన్ని రక్షించిన ఓ జగద్గురువైన కృష్ణా, నీకు దాసోహములు. 


అతసీపుష్ప సంకాశమ్ హార నూపుర శోభితమ్ 
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || (2)

తాత్పర్యము :-

అతసీపుష్పము అంటే అవిసె పువ్వు. ఆ పూలు నీలం రంగులో కానీ, లేత నీలం రంగులో కానీ ఉంటాయి. అటువంటి శరీరచ్చాయ (వంటి రంగు) కలిగిన కృష్ణుడు కంఠంలో హారము, కాళ్ళకి గజ్జెలతో వెలిగిపోతూ, చేతులకి రత్న కంకణములు కూడా ధరించి ఉండే ఓ జగద్గురువైన కృష్ణా, నీకు దాసోహములు. 


కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ 
విలసత్ కుండల ధరమ్  కృష్ణం వందే జగద్గురుమ్ || (3)

తాత్పర్యము :-

మెలితిరిగిన ముంగురుల జుట్టు కలిగి, పూర్ణ చంద్రుని బోలిన ముఖము కలిగి, విలాసకరమైన కుండలములు (చెవులకి వేలాడే ఆభరణములు) ధరించిన ఓ కృష్ణా ! జగద్గురువైన నీకు దాసోహములు.   


మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ 
బర్హి పించ్ఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || (4)

తాత్పర్యము :-

మందార పుష్పముల గంధము యొక్క సువాసనలు మరియు అందమైన చిరునవ్వులను  వెదజల్లుతూ, నాలుగు భుజములు కలిగి, నెమలిపింఛాన్ని తలకొప్పు లో ధరించిన ఓ కృష్ణా , జగద్గురువైన నీకు దాసోహములు.    


ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షమ్ నీలజీమూత సన్నిభమ్ 
యాదవానామ్ శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || (5)

తాత్పర్యము :-

విశాలంగా వికసించిన పద్మముల రేకుల వంటి కన్నులను కలిగి, నీలి మేఘముల లాంటి ప్రకాశము కలిగి (నీల జీమూతము అంటే నీలి మేఘమయినా కావచ్చును లేదా నీలిరంగులో ఉండే ఇంద్రుడైనా కావచ్చును), యాదవులందరికీ శిరోరత్నమైన ఓ కృష్ణా , జగద్గురువైన నీకు దాసోహములు.  



రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం 
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (6)

తాత్పర్యము :-

రుక్మిణీదేవితో కేళి సలుపుతూ పట్టుబట్టలు దాల్చి మంచి అందంతో ప్రకాశిస్తూ ఎనలేని తులసీగంధముల సువాసనలు వెదజల్లే ఓ జగద్గురువైన కృష్ణా ! నీకు దాసోహములు.  


గోపికానాం కుఛ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం 
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (7)

తాత్పర్యము :-

గోపికాస్త్రీలు వెదజల్లిన కుంకుమలతో శోభిల్లే కుచ ద్వందముల వక్షము కలిగి , శ్రీ లక్ష్మీదేవి, భూదేవులతో (మహా +ఇక్ష్వాసం= మహా భూమండలము లేదా భూదేవి ) కూడిన ఓ కృష్ణా జగద్గురువైన నీకు దాసోహములు. 


శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం 
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (8)

తాత్పర్యము :-

శ్రీవత్స చిహ్నము కలిగి నీ విశాల వక్షస్థలము (మహా ఉర + అస్కమ్ = నీ యొక్క పెద్ద విశాలమైన ఉరము లేదా వక్షం అనైనా అనవచ్చును ) వనమాలలతో (అనేక విధములైన పూలు, ఆకులతో తయారైన మాలలు) అలంకరింపబడి, శంఖము చక్రములతో శోభిల్లెడి ఓ జగద్గురువైన కృష్ణా ! నీకు దాసోహములు. 
 

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ య: ప:టేత్ 
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ (9)

తాత్పర్యము :- 

ఈ కృష్ణాష్టకము పుణ్యప్రదమైనది . దీనిని ఎవరైతే ప్రాతః కాలంలో చదువుతారో అటువంటి వారికి కోటి జన్మములలో చేసిన పాపములు కూడ ఇది స్మరించినంత మాత్రంలోనే తొలగిపోతాయి/నశించి పోతాయి).  

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

విష్ణు పూజ స్తోత్రములు - Vishnu Pooja Hymns

 


మనం ఇంట్లో ప్రతి రోజూ పూజ చేసుకునేటప్పుడు కాస్త క్లుప్తంగా చేసుకుంటాము మన వీలుని బట్టి. అటువంటప్పుడు ఒకటి, రెండు వినాయకుని శ్లోకాలు, లక్ష్మీదేవి శ్లోకాలు, విష్ణు శ్లోకాలు, అలాగే శివపార్వతి స్తుతి, శ్రీ రాముని స్తుతి, శ్రీ కృష్ణ స్తుతి మన వీలుని బట్టి, పద్ధతులని బట్టి చదువుకుని దేవునికి ఆరగింపు పెట్టేస్తే చాలు. 

నేను ఇలాగే చేస్తుంటాను రోజూ. ముందుగా తల్లితండ్రులని, గురువులు/ఆచార్యులని స్మరించి, శుక్లాంబర ధరమ్ చదువుకుని , కేశవనామాలు చదువుతాను. 

ఆ తర్వాత ఈ క్రింద ఇవ్వబడిన మూడు విష్ణు స్తోత్రాలు చదువుతాను.

విష్ణు స్తోత్రములు 

శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభం, సురేశం 
విశ్వాకారం, గగన సదృశమ్, మేఘవర్ణం, శుభాంగమ్ 
లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృద్యానగమ్యం 
వందే విష్ణుం, భవ భయ హరమ్, సర్వలోకైక నాథమ్ || (1)

తాత్పర్యము :-

మూర్తీభవించిన ప్రశాంతత తో శేషు సర్పము పై పవ్వళించిన పద్మనాభా (పద్మమునే నాభిగా కల విష్ణు మూర్తి ) ! దేవతల అధిపతి , సమస్త విశ్వమూ తన ఆకారంగా కలిగి, ఆకాశము పోలిక కలిగి, మేఘముల రంగు, అందమైన శుభప్రదమైన శరీరముతో, లక్ష్మీదేవితో కూడి, కమలముల వంటి కన్నులు కలిగి, యోగుల హృదయానికి కూడ అంతు చిక్కనటువంటి (అర్థము కానటువంటి) ఓ సమస్త లోకములకు ఏకైక ఏలికవై ఉండి అందరి భయములను తొలగిస్తూ ఉండే విష్ణుమూర్తీ ! మీకివే నా వందనములు. 


మేఘ శ్యామం, పీత కౌసేయ వాసం,
శ్రీ వత్సాంకం, కౌస్తుభోద్భాసితాంగం,
పుణ్యోపేతం, పుండరీకాయతాక్షం,
విష్ణుం వందే సర్వ లోకైక నాథం ॥ (2)

తాత్పర్యము :-

మేఘము వంటి చిక్కటి రంగు కలిగి, బంగారు పట్టుపంచె,కండువా దాల్చి, శ్రీవత్స చిహ్నము కలిగి, కౌస్తుభ మణి ప్రకాశం వెదజల్లుతూ, పవిత్రతో ఉట్టిపడుతూ, పుండరీకముల వంటి కనులు కలిగి ఉండెడి ఓ అన్ని లోకాలకూ ఏకైక నాథుడవైన విష్ణు మూర్తీ, నీకు వందనములు.


స శంఖః చక్రం, స కిరీట కుండలం,
స పీతవస్త్రం, సరసీ రుహేక్షణం,
సహార వక్షస్థల శోభి కౌస్తుభం,
నమామి విష్ణుం, శిరసా చతుర్భుజమ్ || (3)

తాత్పర్యము :-

శంఖము, చక్రము, కిరీటము, కుండలములు, పట్టు వస్త్రములు దాల్చి, తామర పువ్వులవంటి కనులు కలిగి, హారముతో కూడిన వక్షస్థలం కౌస్తుభమణి తో శోభించు చుండెడి ఓ విష్ణుమూర్తీ, నాలుగు భజములు కలిగిన నీకు నా శిరస్సు వంచి నమస్కరించు చున్నాను. 

ఈ స్తోత్రాలు చదివి మీరు పూజ ముగించేసుకోవచ్చును. ధూపం, దీపం, చూపించి నైవేద్యం పెట్టేసుకోవచ్చును. 

ఇంకా సమయం ఉన్నవాళ్లు శ్రీ రామ కీర్తన, శ్రీ కృష్ణ స్తుతి, శివపార్వతుల స్తుతి  తృప్తిగా చేసుకుని అప్పుడు నైవేద్యం పెట్టుకోవచ్చును.  మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి. నేను ఇవన్నీ చదివి, హనుమాన్ చాలీసా కూడా చదువుతుంటాను ప్రతిరోజూ. ఇవన్నీ చదివితే కాని నాకు తృప్తిగా ఉండదు మరి. కానీ సమయం ఉన్నవాళ్లే ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. మనస్సు వేరే వైపు పెట్టుకుని చేసుకోకుండా.         
  
  

18, సెప్టెంబర్ 2024, బుధవారం

కేశవ నామాలు - 24 నామాలతో విష్ణు పూజ - Vishnu Worship 24 Names


కేశవ నామాలు అనేవి మహా విష్ణువు నామాలు. ఇవి పూజ మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క పేరు చదువుతూ కుంకుమ లేదా పువ్వులతో లక్ష్మీనారాయణులని అర్చిస్తూ చేస్తారు. 

ఈ నామాలని రెండు విధములుగా ఉపయోగించడం జరుగుతుంది. 

ఈ పూజా విధానంలో మొత్తం 24 నామాలు ఉన్నాయి. 



సంధ్యా వందనము సందర్భంలో మొదటి 12 నామాలని మాత్రము చదువుతాము. అంటే గాయత్రి మంత్ర జపము చేసే ముందు ఆచమనం అవీ చేశాక విష్ణు యొక్క మొదటి 12 కేశవా నామాలని ఉఛ్ఛరించి ఆ తర్వాత సూర్యునికి నమస్కరించడము, గాయత్రీ దేవిని ఆహ్వానించడము జరుగుతాయి. ఇది కేశవ నామాల మొదటి ప్రయోజనము. 

రెండో ప్రయోజనము ఏమిటంటే విష్ణు పూజ చెయ్యడము. మొత్తం 24 నామాలని పలుకుతూ ప్రతీ నామానికి కాస్త కుంకుమ లేదా ఒక పుష్పం దేవునికి సమర్పించడం జరుగుతున్నది. విష్ణువుని స్మరిస్తూ కుంకుమ, పుష్పాలు లేక పోయినా వట్టినే ఈ 24 నామాలు జపించినా చాలు. మన హృదయం లోని భక్తే ప్రధానము. 

కేశవ నామాలు జపించాక "శాంతాకారం భుజగశయనం ... " చదువుకుని అప్పుడు లక్ష్మీదేవి స్తోత్రాలు కూడా చదువుకోవాలి.  

24 కేశవనామాలు 

  1. ఓం కేశవాయ నమః 
  2. ఓం నారాయణాయ నమః 
  3. ఓం మాధవాయ నమః 
  4. ఓం గోవిందాయ నమః 
  5. ఓం విష్ణవే నమః 
  6. ఓం మధుసూదనాయ నమః 
  7. ఓం త్రివిక్రమాయ నమః 
  8. ఓం వామనాయ నమః 
  9. ఓం శ్రీధరాయ నమః 
  10. ఓం హృషీకేశాయ నమః 
  11. ఓం పద్మనాభాయ నమః 
  12. ఓం దామోదరాయ నమః 
  13. ఓం సంకర్షణాయ నమః 
  14. ఓం వాసుదేవాయ నమః 
  15. ఓం ప్రద్యుమ్నాయ నమః 
  16. ఓం అనిరుద్హాయ నమః 
  17. రోజూ ఓం పురుషోత్తమాయ నమః 
  18. ఓం అధోక్షజాయ నమః 
  19. ఓం నారసింహాయ నమః 
  20. ఓం అచ్యుతాయ నమః 
  21. ఓం జనార్దనాయ నమః 
  22. ఓం ఉపేంద్రాయ నమః 
  23. ఓం హరయే నమః 
  24. ఓం కృష్ణాయ నమః 
ఈ 24 నామాలని నేను రోజూ పూజ చేసుకునేటప్పుడు ముందుగా మాతృ వందనం , ఆచార్య వందనం చదువుకున్నాక ఉచ్చరిస్తూంటాను. ఆయా తర్వాత శాంతాకారం మొదలయినవి చదువుకుంటాను.