20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

విష్ణు పూజ స్తోత్రములు - Vishnu Pooja Hymns

 


మనం ఇంట్లో ప్రతి రోజూ పూజ చేసుకునేటప్పుడు కాస్త క్లుప్తంగా చేసుకుంటాము మన వీలుని బట్టి. అటువంటప్పుడు ఒకటి, రెండు వినాయకుని శ్లోకాలు, లక్ష్మీదేవి శ్లోకాలు, విష్ణు శ్లోకాలు, అలాగే శివపార్వతి స్తుతి, శ్రీ రాముని స్తుతి, శ్రీ కృష్ణ స్తుతి మన వీలుని బట్టి, పద్ధతులని బట్టి చదువుకుని దేవునికి ఆరగింపు పెట్టేస్తే చాలు. 

నేను ఇలాగే చేస్తుంటాను రోజూ. ముందుగా తల్లితండ్రులని, గురువులు/ఆచార్యులని స్మరించి, శుక్లాంబర ధరమ్ చదువుకుని , కేశవనామాలు చదువుతాను. 

ఆ తర్వాత ఈ క్రింద ఇవ్వబడిన మూడు విష్ణు స్తోత్రాలు చదువుతాను.

విష్ణు స్తోత్రములు 

శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభం, సురేశం 
విశ్వాకారం, గగన సదృశమ్, మేఘవర్ణం, శుభాంగమ్ 
లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృద్యానగమ్యం 
వందే విష్ణుం, భవ భయ హరమ్, సర్వలోకైక నాథమ్ || (1)

తాత్పర్యము :-

మూర్తీభవించిన ప్రశాంతత తో శేషు సర్పము పై పవ్వళించిన పద్మనాభా (పద్మమునే నాభిగా కల విష్ణు మూర్తి ) ! దేవతల అధిపతి , సమస్త విశ్వమూ తన ఆకారంగా కలిగి, ఆకాశము పోలిక కలిగి, మేఘముల రంగు, అందమైన శుభప్రదమైన శరీరముతో, లక్ష్మీదేవితో కూడి, కమలముల వంటి కన్నులు కలిగి, యోగుల హృదయానికి కూడ అంతు చిక్కనటువంటి (అర్థము కానటువంటి) ఓ సమస్త లోకములకు ఏకైక ఏలికవై ఉండి అందరి భయములను తొలగిస్తూ ఉండే విష్ణుమూర్తీ ! మీకివే నా వందనములు. 


మేఘ శ్యామం, పీత కౌసేయ వాసం,
శ్రీ వత్సాంకం, కౌస్తుభోద్భాసితాంగం,
పుణ్యోపేతం, పుండరీకాయతాక్షం,
విష్ణుం వందే సర్వ లోకైక నాథం ॥ (2)

తాత్పర్యము :-

మేఘము వంటి చిక్కటి రంగు కలిగి, బంగారు పట్టుపంచె,కండువా దాల్చి, శ్రీవత్స చిహ్నము కలిగి, కౌస్తుభ మణి ప్రకాశం వెదజల్లుతూ, పవిత్రతో ఉట్టిపడుతూ, పుండరీకముల వంటి కనులు కలిగి ఉండెడి ఓ అన్ని లోకాలకూ ఏకైక నాథుడవైన విష్ణు మూర్తీ, నీకు వందనములు.


స శంఖః చక్రం, స కిరీట కుండలం,
స పీతవస్త్రం, సరసీ రుహేక్షణం,
సహార వక్షస్థల శోభి కౌస్తుభం,
నమామి విష్ణుం, శిరసా చతుర్భుజమ్ || (3)

తాత్పర్యము :-

శంఖము, చక్రము, కిరీటము, కుండలములు, పట్టు వస్త్రములు దాల్చి, తామర పువ్వులవంటి కనులు కలిగి, హారముతో కూడిన వక్షస్థలం కౌస్తుభమణి తో శోభించు చుండెడి ఓ విష్ణుమూర్తీ, నాలుగు భజములు కలిగిన నీకు నా శిరస్సు వంచి నమస్కరించు చున్నాను. 

ఈ స్తోత్రాలు చదివి మీరు పూజ ముగించేసుకోవచ్చును. ధూపం, దీపం, చూపించి నైవేద్యం పెట్టేసుకోవచ్చును. 

ఇంకా సమయం ఉన్నవాళ్లు శ్రీ రామ కీర్తన, శ్రీ కృష్ణ స్తుతి, శివపార్వతుల స్తుతి  తృప్తిగా చేసుకుని అప్పుడు నైవేద్యం పెట్టుకోవచ్చును.  మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి. నేను ఇవన్నీ చదివి, హనుమాన్ చాలీసా కూడా చదువుతుంటాను ప్రతిరోజూ. ఇవన్నీ చదివితే కాని నాకు తృప్తిగా ఉండదు మరి. కానీ సమయం ఉన్నవాళ్లే ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. మనస్సు వేరే వైపు పెట్టుకుని చేసుకోకుండా.         
  
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి