కృష్ణాష్టకం అంటే శ్రీ కృష్ణుని స్తుతి చేస్తూ చదివే ఎనిమిది శ్లోకాలు అన్నమాట. ఈ శ్లోకాలు కృష్ణుని యొక్క జీవితం లోని కొన్ని సంగతులను, అద్భుత కృత్యాలను తెలుపుతూ కీర్తించే కీర్తనల వంటివి.
శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం లోకానికంతటికీ గురువు. మనందరి మంచికోసము ఆయన అవతారమెత్తి రాక్షసులని చంపి, దుష్టులను దండించి, మన మేలు కోరుతూ భగవద్ గీత ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు. చావు, పుట్టుకలంటే ఏమిటి, మనిషి పుట్టుక ఉద్దేశ్యం ఏమిటి, మనిషి ఏ విధంగా ఈ సంసార సాగరాన్ని దాటాలి, మొదలైన విషయాలన్నింటిని గీతోపదేశము ద్వారా తెలియజేశారు. అంతేకాక ఎవరైతే పూర్తిగా నన్ను నమ్ముకుని నా శరణు కోరుతారో వారికి తప్పకుండా విజయము, మోక్షము ప్రసాదిస్తాను అని మహాభారతంలో అర్జునికి చెపుతూ మనకి తెలియజేసెను .
అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ మనము ఈ కృష్ణాష్టకాన్ని ప్రతి రోజూ పూజ సమయంలో చదువుకోవచ్చును.
కృష్ణాష్టకము
వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || (1)
తాత్పర్యము :-
వసుదేవుని కొడుకు, దేవకీదేవికి అత్యంత ఆనందాన్ని కలిగించే ఓ దేవా! కంసచాణూరులను చంపి లోకాన్ని రక్షించిన ఓ జగద్గురువైన కృష్ణా, నీకు దాసోహములు.
అతసీపుష్ప సంకాశమ్ హార నూపుర శోభితమ్
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || (2)
తాత్పర్యము :-
అతసీపుష్పము అంటే అవిసె పువ్వు. ఆ పూలు నీలం రంగులో కానీ, లేత నీలం రంగులో కానీ ఉంటాయి. అటువంటి శరీరచ్చాయ (వంటి రంగు) కలిగిన కృష్ణుడు కంఠంలో హారము, కాళ్ళకి గజ్జెలతో వెలిగిపోతూ, చేతులకి రత్న కంకణములు కూడా ధరించి ఉండే ఓ జగద్గురువైన కృష్ణా, నీకు దాసోహములు.
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్
విలసత్ కుండల ధరమ్ కృష్ణం వందే జగద్గురుమ్ || (3)
తాత్పర్యము :-
మెలితిరిగిన ముంగురుల జుట్టు కలిగి, పూర్ణ చంద్రుని బోలిన ముఖము కలిగి, విలాసకరమైన కుండలములు (చెవులకి వేలాడే ఆభరణములు) ధరించిన ఓ కృష్ణా ! జగద్గురువైన నీకు దాసోహములు.
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
బర్హి పించ్ఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || (4)
తాత్పర్యము :-
మందార పుష్పముల గంధము యొక్క సువాసనలు మరియు అందమైన చిరునవ్వులను వెదజల్లుతూ, నాలుగు భుజములు కలిగి, నెమలిపింఛాన్ని తలకొప్పు లో ధరించిన ఓ కృష్ణా , జగద్గురువైన నీకు దాసోహములు.
ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షమ్ నీలజీమూత సన్నిభమ్
యాదవానామ్ శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || (5)
తాత్పర్యము :-
విశాలంగా వికసించిన పద్మముల రేకుల వంటి కన్నులను కలిగి, నీలి మేఘముల లాంటి ప్రకాశము కలిగి (నీల జీమూతము అంటే నీలి మేఘమయినా కావచ్చును లేదా నీలిరంగులో ఉండే ఇంద్రుడైనా కావచ్చును), యాదవులందరికీ శిరోరత్నమైన ఓ కృష్ణా , జగద్గురువైన నీకు దాసోహములు.
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (6)
తాత్పర్యము :-
రుక్మిణీదేవితో కేళి సలుపుతూ పట్టుబట్టలు దాల్చి మంచి అందంతో ప్రకాశిస్తూ ఎనలేని తులసీగంధముల సువాసనలు వెదజల్లే ఓ జగద్గురువైన కృష్ణా ! నీకు దాసోహములు.
గోపికానాం కుఛ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (7)
తాత్పర్యము :-
గోపికాస్త్రీలు వెదజల్లిన కుంకుమలతో శోభిల్లే కుచ ద్వందముల వక్షము కలిగి , శ్రీ లక్ష్మీదేవి, భూదేవులతో (మహా +ఇక్ష్వాసం= మహా భూమండలము లేదా భూదేవి ) కూడిన ఓ కృష్ణా జగద్గురువైన నీకు దాసోహములు.
శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ (8)
తాత్పర్యము :-
శ్రీవత్స చిహ్నము కలిగి నీ విశాల వక్షస్థలము (మహా ఉర + అస్కమ్ = నీ యొక్క పెద్ద విశాలమైన ఉరము లేదా వక్షం అనైనా అనవచ్చును ) వనమాలలతో (అనేక విధములైన పూలు, ఆకులతో తయారైన మాలలు) అలంకరింపబడి, శంఖము చక్రములతో శోభిల్లెడి ఓ జగద్గురువైన కృష్ణా ! నీకు దాసోహములు.
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ య: ప:టేత్
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ (9)
తాత్పర్యము :-
ఈ కృష్ణాష్టకము పుణ్యప్రదమైనది . దీనిని ఎవరైతే ప్రాతః కాలంలో చదువుతారో అటువంటి వారికి కోటి జన్మములలో చేసిన పాపములు కూడ ఇది స్మరించినంత మాత్రంలోనే తొలగిపోతాయి/నశించి పోతాయి).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి