20, నవంబర్ 2018, మంగళవారం

వినాయక పూజ | Vinayaka Pooja స్తోత్రములు

వినాయక పూజ చేయుటకు అనువైన కొన్ని సులభమైన శ్లోకములు, స్తోత్రములు ఇక్కడ ఇవ్వబడినవి. 

ఇవి మనము చిన్నప్పటినుండి వింటున్నవే.
వినాయకునికి  గణేశుడు, విఘ్నేశ్వరుడు అని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాడుకలో.  

వినాయకుడు విఘ్న దేవత అని అన్ని పురాణాలు చెపుతున్నాయి. ఏ పని అయినా ఆరంభించే ముందు విఘ్నేశ్వరుని తలుచుకుని, స్తుతించి అప్పుడు ఆ పని చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.

  వినాయకుడు అన్ని సమస్యలను అరికట్టి కార్యము విజయవంతం చేస్తాడు. అందుకనే పూజలు కూడ వినాయక స్తుతి తోనే మొదలు పెట్టడము పరిపాటి.


శుక్లామ్బరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 


భావార్థము:

తెల్లని బట్టలు ధరించి, చంద్రుని కాంతి వలె శరీర వర్ణము కలిగి, నాలుగు భుజములతో ఎల్లప్పుడూ ఉల్లాసమైన వదనముతో ఉండు, అన్ని విఘ్నములనుండి రక్షించు ఓ విఘ్నేశ్వరా నిన్నే నేను పూజించెదను. 


తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ 
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ | 
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ||  

భావార్ధము:
విఘ్నేశ్వరుడు తొండము, ఒక దంతము, విశాలమైన బొజ్జ,ఎడమ చేతిలో బాగుగా చప్పుడు చేసే గజ్జెలు పట్టుకుని, ఒక కొండ చిన్న గుజ్జు రూపములో ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అతను చదువులన్నింటికీ అది దేవత. అటువంటి పార్వతీ పుత్రుడు మఱియును గణములన్నింటికీ అధిపతి అయిన ఓ గణేశ్వరా నీకు మ్రొక్కుచున్నాను స్వామీ, దయ చేసి నాకు విఘ్నములు, ఆపదలు లేకుండా కాపాడు తండ్రీ.



ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః | ఓం శ్రీ వినాయకాయ నమః | ఓం శ్రీ ఏకదంతాయ నమః | 
ఓం శ్రీ గజాననాయ నమః | ఓం శ్రీ గణేశాయ నమః || 


ప్రతిరోజూ మన పూజ పైన చెప్పబడిన శ్లోకాలు స్తోత్రాలతో మొదలు పెట్టవచ్చును. ఆ తరువాత గురు స్తుతి చేసి మిగతా పూజ చేసుకోవాలి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి