28, నవంబర్ 2025, శుక్రవారం

శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి - Lord Venkateswara Ashtottara Shatanaamaavali


శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అంటే తిరుపతి వేంకటేశ్వరుని 108 నామాలు అన్నమాట. సాధారణముగా మనలో చాలామంది ప్రత్యేకముగా శనివారము రోజున ఆ ఏడుకొండల స్వామిని  108 పేర్లతో కొలుచుచూ, కుంకుమ, పువ్వులు సమర్పించుకుంటూ పూజించుకుంటాము. 

తెల్లవారు ఝామున సుప్రభాతము మొత్తము 4 అధ్యాయములూ రాగయుక్తముగా చదువుకోవడమూ, సాయంత్రము కుంకుమ పువ్వులతో 108 నామాలు చదవడమూ చేసుకోవచ్చును. 

ఇప్పుడు 108 నామాలు తెలుపుతున్నాను. ఇవి నా వద్ద ఉన్న ఒక వైష్ణవ పూజా పుస్తకము ప్రకారము తెలియజేస్తున్నాను.   



  వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

  1. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః 
  2. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః 
  3. ఓం శ్రీ లక్ష్మీపతయే నమః 
  4. ఓం అనామయాయ నమః (వ్యాధులు లేనివాడు)
  5. ఓం అమృతాంశాయ నమః 
  6. ఓం జగద్వంద్యాయ నమః 
  7. ఓం గోవిందాయ నమః 
  8. ఓం శాశ్వతాయ నమః 
  9. ఓం ప్రభవే నమః (ప్రకాశము, లేదా జ్యోతిర్మయి)
  10. ఓం శేషాద్రి నిలయాయ నమః 
  11. ఓం దేవాయ నమః 
  12. ఓం కేశవాయ నమః (సుందరమైన, పొడవైన జటలు కలవాడు)
  13. ఓం మధుసూదనాయ నమః 
  14. ఓం అమృతాయ నమః 
  15. ఓం మాధవాయ నమః 
  16. ఓం కృష్ణాయ నమః 
  17. ఓం శ్రీహరయే నమః 
  18. ఓం జ్ఞానపంజరాయ నమః 
  19. ఓం శ్రీవత్సవక్షసే నమః 
  20. ఓం సర్వేశాయ నమః 
  21. ఓం గోపాలాయ నమః 
  22. ఓం పురుషోత్తమాయ నమః 
  23. ఓం గోపీశ్వరాయ నమః 
  24. ఓం పరంజ్యోతిషే నమః (అపారమైన జ్యోతిర్మయుడు)
  25. ఓం వైకుంఠపతయే నమః 
  26. ఓం అవ్యయాయ నమః (తరుగుదల లేనివాడు)
  27. ఓం సుధాతనవే నమః (అమృతదేహుడు, తానే అమృతము)
  28. ఓం యాదవేంద్రాయ నమః 
  29. నిత్యయౌవన రూపవతే నమః 
  30. ఓం చతుర్వేదాత్మకాయ నమః
  31. ఓం విష్ణవే నమః 
  32. ఓం అచ్యుతాయ నమః 
  33. ఓం పద్మినీప్రియాయ నమః
  34. ఓం ధరాపతయే నమః 
  35. ఓం సురపతయే నమః 
  36. ఓం నిర్మలాయ నమః 
  37. ఓం దేవపూజితాయ నమః 
  38. ఓం చతుర్భుజాయ నమః 
  39. ఓం చక్రధరాయ నమః 
  40. ఓం త్రిధామ్నే నమః (ముల్లోకవాసి)
  41. ఓం త్రిగుణాశ్రయాయ నమః (సత్త్వ, రజస్, తమోగుణములు)
  42. ఓం నిర్వికల్పాయ నమః (ద్వంద్వములు కాని సందేహములు కాని లేనివాడు)
  43. ఓం నిష్కళంకాయ నమః 
  44. ఓం నిరాతంకాయ నమః (ఆతంకము, భయములు లేనివాడు)
  45. ఓం నిరంజనాయ నమః (దేనియందు ఆసక్తి లేనివాడు)
  46. ఓం నిరాభాసాయ నమః (ఉనికి లేనివాడు, కనబడని వాడు)
  47. ఓం నిత్యతృప్తాయ నమః 
  48. ఓం నిరుపద్రవాయ నమః 
  49. ఓం నిర్గుణాయ నమః 
  50. ఓం గదాధరాయ నమః 
  51. ఓం శార్ఙ్గ పాణయే నమః 
  52. ఓం నందకినే నమః 
  53. ఓం శంఖ ధారకాయ నమః 
  54. ఓం అనేకమూర్తయే నమః 
  55. ఓం అవ్యక్తాయ నమః (కనబడని వాడు)
  56. ఓం కటి హస్తాయ నమః (ఒక చేయి నడుముపై ఉంచుకొనువాడు)
  57. ఓం వరప్రదాయ నమః 
  58. ఓం అనేకాత్మనే నమః 
  59. ఓం దీన బంధవే నమః 
  60. ఓం ఆర్తలోక అభయప్రదాయ నమః 
  61. ఓం ఆకాశరాజ వరదాయ నమః 
  62. ఓం యోగి హృత్పద్మ మందిరాయ నమః 
  63. ఓం దామోదరాయ నమః 
  64. ఓం జగత్ పాలాయ నమః 
  65. ఓం పాపఘ్నాయ నమః (పాపములను నశింపజేయువాడు)
  66. ఓం భక్తవత్సలాయ నమః 
  67. ఓం త్రివిక్రమాయ నమః (మూడు అడుగులతో ముల్లోకములనూ ఆక్రమించిన వాడు)
  68. ఓం శింశుమారాయ నమః (సప్త లోకములను ఆవరించి తేలు ఆకారములో ఉన్న విష్ణువు)
  69. ఓం జటామకుట శోభితాయ నమః (జటలను, వాటికి ఆభరణముగా ఒక కిరీటమును, అలంకరించుకున్నవాడు) 
  70. ఓం శంఖ మధ్యోల్లసన్ మంజుకింకిణ్యాధ్య కరండకాయ నమః (శంఖముల లోపలి నుండి తీయబడిన ముత్యములతో తయారైన హారము ధరించువాడు) 
  71. ఓం నీలమేఘశ్యామ తనవే నమః 
  72. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః 
  73. ఓం జగద్వ్యాపినే నమః 
  74. ఓం జగత్ కర్త్రే నమః 
  75. ఓం జగత్ సాక్షిణే నమః    
  76. ఓం జగత్పతయే నమః 
  77. ఓం చింతితార్థ ప్రదాయకాయ నమః (కోరుకున్న వరము లొసగువాడు)
  78. ఓం జిష్ణవే నమః (గెలుపొందు వాడు, పరాక్రమము వ్యాప్తి చెందినవాడు)
  79. ఓం దాశార్హాయ నమః (దాశార్హ వంశజుడు, దశరథ వంశజుడు) 
  80. ఓం దశరూపవతే నమః (పది రూపములు ధరించినవాడు)
  81. ఓం దేవకీనందనాయ నమః 
  82. ఓం శౌర్యే నమః 
  83. ఓం హయగ్రీవాయ నమః 
  84. ఓం జనార్దనాయ నమః 
  85. ఓం కన్యాశ్రవణ తాడ్యాయ నమః    
  86. ఓం పీతాంబర ధరాయ నమః 
  87. ఓం అనఘాయ నమః 
  88. ఓం వనమాలినే నమః 
  89. ఓం పద్మనాభాయ నమః 
  90. ఓం మృగయాసక్త మానసాయ నమః 
  91. ఓం అశ్వారూఢాయ నమః 
  92. ఓం ఖడ్గ ధారినే నమః 
  93. ఓం ధనార్జన సముత్సుకాయ నమః 
  94. ఓం ఘనసార లసన్మధ్య కస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః 
  95. ఓం సచ్చిదానంద రూపాయ నమః 
  96. ఓం జగన్మంగళ దాయకాయ నమః 
  97. ఓం యజ్ఞరూపాయ నమః 
  98. ఓం యజ్ఞభోక్త్రే నమః 
  99. ఓం చిన్మయాయ నమః 
  100. ఓం పరమేశ్వరాయ నమః 
  101. ఓం పరమార్థ ప్రదాయ నమః 
  102. ఓం శాంతాయ నమః 
  103. ఓం శ్రీమతే నమః 
  104. ఓం దోర్దండ విక్రమాయ నమః 
  105. ఓం పరాత్పరాయ నమః 
  106. ఓం పరబ్రహ్మణే నమః 
  107. ఓం శ్రీవిభవే నమః 
  108. ఓం జగదీశ్వరాయ నమః          

26, నవంబర్ 2025, బుధవారం

సూర్యాష్టకము - Worship of Sun God


సూర్యాష్టకము అంటే సూర్యుని పూజ చేసుకోడానికి చదివే ఎనిమిది శ్లోకాలు. సూర్యుని ఉపాసించే వారు ప్రతిరోజూ ఈ అష్టకము చదువుతూ సూర్య నమస్కారములు చేసుకోవచ్చును. ముఖ్యముగా ప్రతీ ఆదివారము నాడు ఉదయము, సాయంత్రము వీటిని చదివి (లేదా చదువుతూ) సూర్యుని ఉపాసించిన ఎడల మంచి లాభము అని చెబుతూ ఉంటారు మన పెద్దలు. 



సూర్యుడు ఈ భూమిపై జీవనానికి నాంది. సూర్యుని కిరణములు, వెలుగు లేనిదే జీవనము ఉండదు. మన ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా మంచిది. అందుకనే ఉదయము లేవగానే సూర్యుని ఎండ పడే చోట కొన్ని నిమిషాలు నిలబడటమో, కూర్చోడమో చేయాలి. మన పెద్దలే కాక, డాక్టర్లు కూడా ఇదే విషయము చెప్తారు. 

అలా సూర్యుని ఎదురుగా నిలబడి కాని, కూర్చుని కాని మనము శ్రద్ధతో ఈ సూర్యాష్టకము చదువుకుందాము. ఈ విధముగా కొంతసేపు మనకు సూర్యుని వెలుగు, కిరణాలు సోకుతూంటాయి. మన ఆరోగ్యము బలిష్టమౌతుంది. 

సూర్యాష్టకం శ్లోకాలు   


ముందుగా శ్రీ సూర్యనారాయణ స్తుతి 


ధ్యేయ స్సదా సవితృమండల మధ్యవర్తీ 
నారాయణ సరసిజాసన సన్నివిష్ఠహ  
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ 
హారీ హిరణ్మయ వపుహు ధృత శంఖ చక్రహః || 

అర్థము:
దృష్ఠి ఎల్లప్పుడూ సూర్యమండలము మధ్యలో నెలకొని ఉన్న పద్మము నందు ఆసీనుడై ఉన్న, మరియు భుజము నందు కేయూరములు (కడియములు), చెవులకు మకర కుండలములు (మొసలి ఆకారము కలిగిన కర్ణాభరణము), కిరీటము, హారములు, శంఖ చక్రములు ధరించి, బంగారు వన్నెల దేహకాంతితో విరాజమానమై ఉన్న ఆ మహావిష్ణువును ధ్యానించెదము.

ఇప్పుడు అష్టకము   


ఆదిదేవ నమస్తుభ్యం 
ప్రసీద మమ భాస్కరః |  
దివాకర నమస్తుభ్యం 
ప్రభాకర నమోస్తుతే || (1)

అర్థము:
ఆదిదేవుడవైన నీకు వందనములు. ఓ భాస్కరా నన్ను దయచూడు. దివాకరుడా వందనములు, ప్రభాకరుడవైన నీకు నమస్సులు సమర్పించుకుంటున్నాను.
 
భాస్కరుడు = తేజస్సు, కిరణములు ప్రసారించువాడు 
దివాకరుడు = దినము అంటే పగలు ఇచ్చేవాడు
ప్రభాకరుడు = వెలుగు, జ్యోతిని ఇచ్చేవాడు 
 

సప్తాశ్వ రథమారూఢం 
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మధరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (2)

అర్థము:
ఏడు గుఱ్ఱములు కల రథములో ప్రయాణము చేయువాడు, ప్రచండుడు అంటే అత్యంత తేజస్సు, ఉష్ణముతో భీకరముగా ఉండువాడు, కశ్యప మహర్షి తనయుడు, తెల్లని పద్మము దాల్చినవాడు, అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నా వందనములు. 

 
లోహితం రథమారూఢం 
సర్వలోక పితామహం 
మహాపాప హరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (3)

అర్థము:
ఎరుపు వన్నెలతో దేదీప్యమానంగా వెలిగిపోయే రథమునందు ప్రయాణము చేయువాడు, సకల లోకములకు పితామహుడు, మహాపాపములను కూడా పోగెట్టేవాడు అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నావందనములు. 


త్రైగుణ్యం చ మహాశూరం 
బ్రహ్మ విష్ణు మహేశ్వరం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (4)

అర్థము: 
త్రిగుణములందు గొప్పవాడవు, బ్రహ్మ, విష్ణువు, శివుడి తో సమానమైన వాడవు, మహాపాపములను కూడా పోగెట్టేవాడు అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నావందనములు.


బృంహితం తేజసాం పుంజం 
వాయురాకాశ మేవచ 
ప్రియంచ సర్వలోకానాం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (5)

అర్థము:
పుష్టికరమైన, తేజస్సుతో నిండిన కిరణములను వాయురాకాశములందు ప్రసరింపజేస్తూ, అంతటా వ్యాపించి ఉంటూ, సకల లోకములకు ప్రియుడవైన ఓ సూర్యనారాయణా, నీకు వందనములు సమర్పించుకుంటున్నాను. 


బంధూక పుష్ప సంకాశం 
హారకుండల భూషితం 
ఏకచక్ర ధరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (6)

అర్థము:
బంధూక పుష్పము అన్న పూవు చిక్కటి ఎరుపు, రక్తము రంగులో ఉంటుంది. అటువంటి దేహ వర్ణము కలిగి, హారములు, కుండలములు (చెవికి ఆభరణము) మున్నగు ఆభూషణములతో
అలంకరింపబడిన వాడును, ఒంటి చక్రము (అంటే విష్ణు చక్రము) ధరించిన వాడును అయిన ఓ సూర్యనారాయణా, నీకివే నా వందనములు.  


తం సూర్యం లోకకర్తారం 
మహాతేజ ప్రదీపనం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (7)

అర్థము:
ఓ సూర్యనారాయణా! ఈ లోకమునకు సృష్టి కర్తవు, యజమానివి నీవే. మహా తేజస్సుతో ప్రకాశిస్తూ, పాపములను హరించే నీకు ఇవే నా వందనములు. 
 

తం సూర్యం జగతాం నాథం 
జ్ఞాన ప్రాకాశ్య మోక్షదం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (8)

అర్థము: 
ఓ సూర్యనారాయణా! ఈ సకల జగత్తుకు తండ్రివి అయి ఉండి, జ్ఞానము, ప్రకాశము, మోక్షములను అందించువాడవు నువ్వు. మహా పాపములను తొలగించి మాకు కూడా మోక్షమును ప్రసాదించు ఓ దేవా. నీకివే నా వందనములు.  

ఫల శ్రుతిః 

సూర్యాష్టకం పఠే న్నిత్యం 
గ్రహపీడా ప్రణాశనమ్ 
అపుత్రో లభతే పుత్రం 
దరిద్రో ధనవాన్ బనేత్ || 

అర్థము:
ఈ సూర్యాష్టకమును ఎవరయితే ప్రతిరోజూ చదువుకుంటారో అట్టి వారికి గ్రహపీడలు ఉండవు, అవన్నీ తొలగిపోతాయి. పుత్రుడు లేని వారికి పుత్రుడు లభిస్తాడు. దరిద్రులకు ధనము దొరికి ధనవంతులు అవుతారు. 


స్త్రీ తైల మధు మాంసాని 
యే త్యజంతి రవేర్ దినే 
న వ్యాధి శోక దారిద్య్రం 
సూర్య లోకం చ గచ్ఛతి ||

అర్థము:
ఆదివారము రోజున ఈ సూర్యాష్టకమును నియమము తప్పక చదువుతూ, స్త్రీ భోగము, తాగుడు, మాంసము మున్నగువాటిని దూరముగా పెట్టినవారికి వ్యాధులు కానీ, శోకము కాని (అంటే దుఃఖము), దరిద్రత వంటివి ఉండవు. వీరంతా కూడ అంత్యకాలములో సూర్యలోకానికే జేరుకుంటారు.  


ఓం తత్ సత్ || ఇది ముమ్మాటికీ నిజము. 
  
ఇతి సూర్యాష్టకమ్ సంపూర్ణం ||   
     

22, నవంబర్ 2025, శనివారం

ఆంజనేయ కార్యసిధ్ధి మంత్రము - Hanuman Karyasiddhi Mantra

 


ఆంజనేయ కార్యసిధ్ధి మంత్రము అన్నది రామాయణము నందు సుందరాకాండ ముగింపు ఘట్టములో ప్రస్తావించబడినది. దీన్ని సీతాదేవి ప్రస్తావించింది. 

ఆంజనేయుడు రాముని ఆజ్ఞ మేరకు సీతాదేవి కోసమని వెదుకుతూ, సముద్రము దాటి లంకకు వెళ్ళాడు. లంక అంతటా గాలించి, ఆ ప్రయత్నములో అనేక మంది రాక్షసులను హతమార్చి, అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి జేరుకుంటాడు. 


ఆమెకు నమ్మకము కలిగించడానికి రాముని యొక్క గుణగానము, అతని అవయవ సౌష్టవము సీతాదేవికి వల్లెవేస్తాడు. ఆ విధముగా సీతాదేవి పెట్టిన పరీక్షలు అన్నింట్లో ఉత్తీర్ణుడై, ఆమెకు నమ్మకము కలిగిస్తాడు. రాముని క్షేమము చెప్పి, ముద్రికను చూపించి, త్వరలోనే మేమందరము వచ్చి నిన్ను విడిపించుకుని తీసుకెళ్తామని ఓదార్చి, తిరుగు ప్రయాణము కట్టే ముందు, కాస్త రావణాసురుడి ఆట పట్టించి వెళ్తానని చెప్పి ఆవిడ ఆజ్ఞ పొందుతాడు. 

అశోకవనము అంతా  చిందరవందర చేసేసి, రాక్షసుల చేతిలో బంధింపబడినట్లుగా నాటకమాడి, రావణాసురుడి దగ్గరకు జేరుతాడు. అతనికి శిక్షగా తోకకు నిప్పంటించి లంకా నగరమంతా తిప్పుతుంటే అన్ని రహస్యాలు ఆరా తీస్తూ ఆనందంగా తిరుగుతాడు. ఆ తర్వాత ఒక్కసారిగా బంధము విడిపించుకుని పైకి ఎగిరి తన తోకకి ఉన్న మంటలతో భవనాలన్నీ కూలిపోయేలా మంటలు అంటించి, సముద్రపు నీటిలో మునిగి మంటని ఆర్పేసుకుని, భయపడుతూ మళ్ళీ సీతాదేవి దర్శనము చేసుకుని, ఆవిడ క్షేయంగానే ఉందని సాంత్వన చెందుతాడు. 

అప్పుడు సీతాదేవి అతని ఘనకార్యములన్నిటినీ తిలకించింది కనుక ధైర్యము చెంది, తనను తప్పకుండా అతని సాయముతో శ్రీరాముడు విడిపించుకుంటాడని నమ్మకము పొందుతుంది. ఈ సందర్భము లోనే సీతాదేవి ఈ కార్యసాధన మంత్రమును ప్రస్తావించింది. 

ఆంజనేయా నీవు అన్నింటికీ సమర్ధుడివే అని అంటుంది. ఇదే మాటను ఈ క్రింది శ్లోకములో అంటుంది. 

ఆంజనేయ కార్యసాధన మంత్రము     

త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ | 
హనుమన్ యత్నామాస్థాయ దుఃఖక్షయ కరోభవ ||   

అర్థము:
ఓ హరిసత్తమా ! గొప్ప కార్యములను కూడా సులభముగా నిర్వహించుటలో నీకు నీవే సాటివి. కార్యసాధనకు నువ్వే సజీవ ప్రమాణము. (ఎందుకంటే అవలీలగా సముద్రాన్ని దాటి వచ్చి, దుర్భరమైన లంకలోకి యుక్తితో ప్రవేశించడమే కాకుండా అక్కడి రాక్షసులను గజగజ వణికించి, భయభీతులను చేసి పరిమార్చి, ధైర్యముగా రావణాసురుడి సభలో జేరి హితవు మాటలు చెప్పి, ఆ పిమ్మట లంకా దహనము కూడా చేయగలిగాడు). అందుకే అతడు అసాధ్య కార్యములను సాధ్యము చెయ్యడానికి అతడే సాటి, ప్రమాణము అయ్యాడు. 

కొంచము ప్రయత్నము చేసి నా దుఃఖమును కూడ పోగొట్టుమా హనుమా! ఈ మాట చెప్పడములో సీతాదేవి ఉద్దేశ్యము ఏమిటంటే శ్రీరామునికి ఎలాగో అల్లాగ నచ్చచెప్పి రావణునితో యుద్ధానికి పురికొల్పాలి. అలా ఎగదోలితే కానీ రాముడు యుద్ధము చెయ్యడు, రావణుడు చావడు. రావణుడు ఛస్తే కాని సీతకు ముక్తి దొరకదు. అందుకని హనుమంతుని సీతాదేవి అంతగా వేడుకోవాల్సి వస్తోంది. ఇక్కడ రాముడి ప్రతిష్ట కూడ ఆవిడ కాపాడ దలుచుకుంటోంది అని మనము గ్రహించాలి. 

ఈ విధముగా సీతాదేవి అంతటి గొప్ప ఆవిడకే హనుమంతుడు దిక్కు అయ్యాడు. స్వయంగా లక్ష్మీదేవి అయిన ఆమెయే ఆంజనేయుని ప్రార్ధించగా లేనిది మనము ఎక్కడో ఊహించండి. ఎంతగా ఆయనను పూజించినా తక్కువే అవుతుంది. 

కాబట్టి మనమందరమూ కూడా మన కష్టాలను గట్టెక్కించమని ఆయనను వేడుకుంటూ ఉందాము. 

ఈ మంత్రమును 3 సార్లు కానీ, 11 సార్లు కానీ మనము తోచినప్పుడల్లా చదువుకుంటూ ఆయనను తలుచుకోవచ్చును.        

20, నవంబర్ 2025, గురువారం

ఆంజనేయ ద్వాదశ నామావళి Anjaneya dwadasha naamaavali


ఆంజనేయస్వామి పూజ చేసేటప్పుడు ఆయనను ద్వాదశ నామాలతో (అంటే 12 పేర్లతో) కీర్తిస్తూ పూజించడము పరిపాటి. 

ఆంజనేయస్వామి అంజనాదేవి కుమారుడు. తండ్రి పేరు కేసరి. చాలా కాలము వరకు పిల్లలు లేకపోవుట చేత ఇద్దరూ కలసి శివపరమాత్మను, సూర్యుని ఉపాసన చేస్తారు. శివుడు తాండవం చేస్తూంటే రజస్ఖలనము జరిగిందని, అది సముద్రములో పడితే తట్టుకోలేక సముద్రుడు (వరుణుడు) దాన్ని సూర్యుడికి అప్పగించాడనీ, అప్పుడు సూర్యుడు దాన్ని వాయుదేవునికి ఇచ్చి అంజనాదేవి గర్భములోకి జేర్చమని చెప్పాడని ప్రతీతి. ఆ విధముగా ఆంజనేయుడు పుట్టాడు. అందుచేత ఆంజనేయుడు చాలా శక్తిమంతుడు, యుక్తిమంతుడు, దైవీక గుణములు కలవాడు అయ్యాడు. 


 

ఈ ద్వాదశనామాలు అతని ఘనకార్యములను వెల్లడిస్తున్నాయి. రామాయణములో శ్రీరాముని అత్యంత ప్రియభక్తుడు, సన్నిహితుడు ఆంజనేయస్వామి. ఇద్దరూ కలవటం వల్లనే రాముడు లంకకు జేరి రావణాసురుడిని చంపగలిగెను. సీతాదేవి ఎక్కడుందో ఆంజనేయుని ద్వారానే కనుక్కోగలిగారు. మొత్తము రామాయణములో అతనిది ఒక ముఖ్య పాత్ర. అటువంటి ఆ మహాభక్తుడైన ఆ ఆంజనేయుని ఈ పన్నెండు నామాలతో ఘనముగా కీర్తించడము జరిగింది. 

ఈ ద్వాదశ నామాలను ఒక రాగములో కీర్తిస్తూ చదువుకోవాలి. 

ఆంజనేయస్వామి ద్వాదశ నామావళి  

హనూమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః 
రామేష్ఠ ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః 
ఉదధిక్రమణ శ్చైవ సీతాశోక వినాశకః 
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవశ్శ దర్పహా || (1)

ద్వాదశైతాని నామాని కపీన్ద్రశ్చ మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః | 
తస్య మృత్యుహ్ భయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్ |  
తస్య మృత్యుహ్ భయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్ || (2)

బుధ్ధిర్ బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా 
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ ||  

శ్రీరామ జయరామ జయజయ రామ 
జయరామ జానకిరామ 
శ్రీరామ జయరామ జయజయ రామ|| 

ఓం తత్సత్ | లోకాః సమస్తా సుఖినో భవంతు || 

అర్థములు:

మొదటి శ్లోకములో ఆయన ద్వాదశ నామాలు, రెండవ శ్లోకములో ఆ నామకీర్తన చెయ్యడము వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు చెప్పబడినవి.  

12 పేర్లు ఈ విధముగా చెప్పబడినవి:-
 
  1. హనుమా ( ఆంజనేయుని దవుడలు వజ్రాయుధముతో గాయము చెంది వంకరగా అయిపోయినవి. అందుకని హనూమన్ అన్న పేరు వచ్చింది) హను అంటే దవుడ, మాన్ అంటే వంకరపోయినవి.
  2. అంజనాదేవి కుమారుడు (సూనుః అంటే కుమారుడా అని అర్థము)
  3. వాయుపుత్రుడు 
  4. మహాబలుడు 
  5. రామునికి ప్రీతిపాత్రుడు 
  6. అర్జునుడి స్నేహితుడు (అర్జుని రథానికి కట్టిన జెండాలో తను ఉన్నాడు)
  7. పింగాక్షుడు అంటే గోధుమరంగు కన్నులవాడు 
  8. అమిత అంటే ఎల్లలు లేని, అవధులు లేని పరాక్రమ వంతుడు. 
  9. ఉదధి అంటే సముద్రము, క్రమణము అంటే దాటుట. సముద్రము దాటినవాడు. 
  10. సీతాశోకమును పోగొట్టినవాడు 
  11. లక్ష్మణుడికి ప్రాణము తీసుకొచ్చినవాడు 
  12. దశగ్రీవుడు అంటే 10 తలలు కలవాడు. అట్టి రావణాసురుని గర్వభంగము చేశాడు. 
 ఇలా పన్నెండు పేర్లలో మొత్తము రామాయణము లోని ఆంజనేయుని పాత్ర వర్ణించబడినది. అందుకని ఈ శ్లోకము చాలా శక్తివంతమైనది.

ఫలశ్రుతి 

కపీన్ద్రుని అంటే ఆంజనేయుని పన్నెండు నామాలను ఎవరైతే చదువుతారో వారికి ఈ క్రింద చెప్పబడిన విధములుగా ఫలితములు దక్కుతాయి. హనుమంతుని మహాన్ ఆత్మ అంటే గొప్పదైన, దైవీక ఆత్మ అని పేర్కొనడము జరిగింది.
  •  స్వాపకాలము అంటే రాత్రి పూట అని కానీ, తెల్లవారు ఝామునే కానీ ప్రతీ రోజూ చదివే వారికి, మరియు యాత్రలు, ప్రయాణములు చేయునప్పుడు చదివిన వారికీ కూడ మృత్యువు భయము ఉండదు. ఎల్లా వేళలా అన్ని చోట్లా విజయమే చేకూరుతుంది. 
  • హనుమంతుని స్మరణ చేసే వారికి బుద్ధి వికాసము, బలము, యశస్సు, ధైర్యము పెంపొందును. 
  • ఎటువంటి భయములు ఉండవు. రోగాలు కూడ ఉండవు. అజాడ్యము అంటే సోమరితనము ఉండదు. వాక్కు పటుత్వము పెరుగును. 
ఓం తత్ సత్ అంటే ఇది నిజము. కాబట్టి మనము ఈ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే మంచి జరుగుతుంది అని నాకు కూడ నమ్మకము ఉంది.