17, డిసెంబర్ 2025, బుధవారం

తిరుప్పావై - పాశురము 03 - "ఓంగి ఉలగళంద" - Tiruppavai - Paasuram 03


"ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి"

తిరుప్పావై మూడవ పాశురములో గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతము ఆచరిస్తే కలిగే లాభము, ఫలితములను వివరిస్తోంది. ప్రపంచమంతటా కూడా వర్షములు పడి పంటచేలతోను, పశు సంపదతోను, ఐశ్వర్యముతోను అందరూ సుఖంగా ఉంటారని చెబుతోంది. 




తిరుప్పావై - పాశురము 03   

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు శాత్తి నీరాడినాల్
తీంగిన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయిదు 
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ 
పూంగు వళై ప్పోదిల్ ప్పొఱివణ్ణు కణ్ పడుప్ప 
త్తెంగా దే పుక్కిరందు శీత్తములై పత్తి 
వాంగ క్కుడం నిరైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్ 
నీంగాద శెల్వమ్ నిరైందే లో రెమ్బావాయ్ ||    

అర్థము:

పెద్దగా పెరిగి ప్రపంచాన్ని కొలిచిన ఆ ఉత్తముడైన పరమాత్మను పొగడుతూ కీర్తించి, మనము దృఢమైన భక్తి విశ్వాసములతో ఈ వ్రతాన్ని పాటిస్తే:

ఈ ప్రపంచమంతటా కూడ ఎటువంటి ఇబ్బంది కలుగని విధముగా నెలకు మూడు వర్షములు కురియును. పంట చేలు ఏపుగా పెరిగి నాట్యము చేస్తాయి. 

ఆ చేల మధ్యలందునూ, నీటి కాలువ లందునూ చేపలు ఎగిరెగిరి గంతులు వేస్తూండును. తుమ్మెదలు అందామైన రెక్కలతో అంతటా విహరిస్తూ తేనెలు తాగి మత్తులో మునుగుతూంటాయి. 

బాగా బలిష్టమైన పశువులు పెద్ద పెద్ద బిందెల నిండా పాలు నింపేస్తూంటాయి. 

ఈ విధంగా అంతటా సుభిక్షం, ఐశ్వర్యములతో మునిగి తేలుతుంటారు అంతా. 

కాబట్టి పదండి ఈ వ్రతము చేద్దాము.       
        

16, డిసెంబర్ 2025, మంగళవారం

తిరుప్పావై - పాశురము 02 - వైయత్తు వాఙవీర్ గాళ్- Tiruppavai - Paasuram 02


తిరుప్పావై - పాశురము 2 - "వైయత్తు వాఙవీర్గాళ్"

ఈ రెండవ పాశురములో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని చెయ్యడానికి నియమాలని చెబుతోంది. 

వ్రతము చేసేటప్పుడు మనము శుచిగా, నిష్కల్మషముగా ఉండాలి. భోగములను పక్కకి నెట్టెయ్యాలి. మితముగా భోజనము, మితముగా నిద్ర పాటించాలి. ఆడంబరములగు బట్టలు కానీ, ఆభరణములు కానీ, అలంకరణ సామాగ్రులను కాని వాడకూడదు. అవన్నీ ఆ భగవంతునికే పరిమితము చెయ్యాలి. 


ఇప్పుడు పాశురము తెలియజేస్తున్నాను.  


వైయత్తు వాఙవీర్ గాళ్ ! నాముమ్ నమ్బావైక్కు 
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పార్కడలుళ్ 
పైయత్తు యిన్ఱ పరమనడి పాడి 
నెయ్యుణ్ణోమ్, పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి 
మైయెట్టుళుదోం మలరిట్టు నా ముడియోమ్ 
శెయ్యోదన శెయ్యోమ్ తీక్కుఱళై శెన్రోదోమ్
అయ్యముమ్ పిచ్చెయుమ్ ఆందనైయుమ్ కై కాట్టి 
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దే లో రెమ్బావాయ్ || 

అర్థము:

ఓ, భూమిపై(దుఃఖములు, సంఘర్షణలతో నిండి ఉన్న ఈ ప్రపంచములో పుట్టినప్పటికీ) సుఖాలు అనుభవిస్తున్నగోపికా మణులారా! మనము ఇప్పుడు చేయబోయే ఈ వ్రతము ఎలా ఆచరించాలో వినండి, చెబుతున్నాను. 

పాలకడలి యందు శయనించే ఆ పరమాత్ముడిని కీర్తించాలి. భోగ పదార్థములైన నెయ్యి, పాలు తాగకుందుము.

తెల్లవారు ఝామునే స్నానము చేద్దాము. 

కాటుక పెట్టుకోము. పువ్వులు, దండలు ధరించము. 

చెయ్యకూడని పనులు చెయ్యము. పెద్దలు చెప్పిన విధముగా మంచిగా మసలుకుందాము. తీక్కురళ్ అంటే తిరువళ్ళువరు చెప్పిన పధ్ధతి ప్రకారము అని కూడా అర్థము. అంటే సత్య, ధర్మ నిష్ఠలతో నడచుకొనుట. 

పెద్దవారలను గౌరవిస్తూ, భిక్షులకు చేతనైనంత, తగినంత సాయము చేస్తూ గడుపుదాము.

ఇలా శాశ్వతమగు ఆత్మ సుఖాన్ని, మోక్షాన్ని అందించే ఈ వ్రతమును ఆచరించుదము.               

  

15, డిసెంబర్ 2025, సోమవారం

తిరుప్పావై - పాశురము 01 - మార్గళి త్తింగళ్- Tiruppavai - Paasuram 01


తిరుప్పావై వ్రతము చేయువారు రోజుకొక పాశురము చొప్పున మొత్తం 30 రోజులలో 30 పాశురములు చదువుతూ శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథస్వామి రూపములలో ఆ శ్రీమన్నారాయణుని భక్తితో పూజిస్తూ, పొంగలి వండి ఆరగింపు పెడుతూ, పూజ చేసుకోవాలి. 

ఆ పాశురాలనే నేను తెలుగు భాషలో అర్థములతో సహా రోజూ ఒక పోస్టు చొప్పున మొత్తము 30 పోస్టులలో తెలియజేస్తున్నాను.


 

ఒకటవ పాశురము - "మార్గళి త్తింగళ్" 

మార్గళి త్తింగళ్ మదినిఁరైంద నన్నాళాల్  
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై యీర్ !
శీర్ మల్ గుమ్ ఆయ్ ప్పాడి శెల్వ చ్చిఱు మీర్ గాళ్!
కూర్వేల్ కొళున్దొళన్ నందగోపన్ కుమరన్
ఏఱార్ న్ద కణ్ణి యశోధై ఇళం శింగం  
కార్మేని చెంగణ్ కదిర్ మదియంబోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై తరువాన్ 
పారోర్ పుగళ్ పడిం దేలోర్ ఎమ్బావాయ్ || 

అర్థము:

మార్గళి మాసము నిండు వెన్నెల హృదయమంతా నింపుకున్న శుభదినములలో స్నానం చేయుదాము పదండి. ఇక్కడ స్నానము అంటే వ్రతము గావించుట కోసమై స్నానము చెయ్యడము. ఇలా వ్రతము చేసే మక్కువతో రాదలచిన వారందరూ పదండి స్నానము చేద్దాము. 

ఓ సంపదలతో తులతూగు ఆయ్ ప్పాడి (నందుని ఊరు పేరు) లో నివసించు భాగ్యము పొందిన గోప బాలికలారా! పదండి శ్రీ కృష్ణుని ధ్యానము చేద్దాము. 

ఈ విధముగా నిష్ఠతో వ్రతము చేసిన యెడల:

పదునైన బల్లెము ధరించి బల పరాక్రమము లతో తన ప్రజలను కాపాడుకునే నందగోపుని కుమారుడూ, అందమైన, విప్పారిన కన్నులు కలిగిన యశోదమ్మ యొక్క సింహ కిశోరుడైన వాడునూ, నల్లని వాడు, ఎర్రని తామరల వంటి కనులవాడునూ, తేజోవంతమైన కిరణముల ప్రసరింప జేయు మోము కలవాడునూ, అయినటువంటి శ్రీమన్నారాయణుడు, ప్రపంచమంతటా మన కీర్తి వ్యాపించే విధముగా, మనకు బహుమతులను అందజేయును. 

పఱై ఇస్తాడు అంటే మామూలు అర్థము వాద్యము ఇస్తాడని. కాని గోదాదేవి చెప్పే పఱై మోక్షముతో సమానమైన బహుమానము ఇస్తాడని భావించాలి. 

అలాగే స్నానము చేయడము అంటే భక్తిలో ములిగి పవిత్రులు అవడము అని తెలుసుకోవాలి. 

భక్తితో ఆ యశోదమ్మ ముద్దుల కొడుకుని సేవించి జన్మ తరించుకోవడానికి, ముక్తిని పొందటానికి అందరూ పదండి అని ఆండాళ్ మాత మనకి చెబుతోంది.             
   

10, డిసెంబర్ 2025, బుధవారం

అష్టలక్ష్మీ పూజా శ్లోకములు - Goddess Lakshmi Puja Hymns


అష్టలక్ష్మీ పూజ అంటే లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో కొలుచుట. 

శ్రీమహావిష్ణువు లాగానే లక్ష్మీదేవి కూడ ఎన్నో అవతారాలు దాల్చింది అని పురాణాలు చెప్తాయి. ఆ అవతారములలో ముఖ్యమైన కొన్ని రూపాలని మనము ఎదో ఒక సందర్భములో తలుచుకుంటూనే ఉంటాము. 

ఆ రూపాలని స్మరించుకుంటూ పూజించుకోవడానికి వీలుగా ఈ అష్టలక్ష్మీ స్తుతిని మన పెద్దలు సృష్టించారు. 

వారిలో ఒకరు శ్రీదత్త పీఠాధీశ్వరులైన శ్రీ సచ్చిదానంద యతివరులు.  

ఆ పూజా శ్లోకాలనే నేను ఇక్కడ అర్థములతో సహా తెలియబరచు చున్నాను.   




రథమధ్యా మశ్వపూర్వామ్ గజనాథ ప్రభోదినీమ్
సామ్రాజ్య దాయినీం దేవీమ్ గజలక్ష్మీమ్ నమామ్యహమ్ || (1)

అర్థము:

రథము నందు గుర్రములు, ఏనుగులు ముందుగా ఉండి రాజఠీవిని ఎలాగైతే ఒలికిస్తాయో, అలాగే మాలోని ఉన్నతత్వమును పైకి లేపి సామ్రాజ్యత్వాన్ని  ప్రసాదించు దేవీ, ఓ గజలక్ష్మీ, నీకు నా వందనములు.

  
ధనమగ్ని ర్ధనం వాయుః ధనం భూతాని పంచచ 
ప్రభూతైశ్వర్య సంధాత్రీమ్ ధనలక్ష్మీమ్ నమామ్యహమ్ || (2)

అర్థము:
ధనమే అగ్ని, ధనమే వాయువు, ధనమే పంచభూతములుగా అన్నింటినీ సమన్వయ పరుస్తూ,  మాకు సకల సంపదలను కూడగట్టుచుండు ఓ ధనలక్ష్మీ, నీకు నా వందనములు.  


పృథ్వీగర్భ సముద్రిన్న నానావ్రీహి స్వరూపిణీం
పశుసంపత్ స్వరూపాంచ ధాన్యలక్ష్మీమ్ నమామ్యహమ్ || (3)

అర్థము:
భూ గర్భములో, సముద్రములో, సకల ధాన్యముల స్వరూపములు, పశుసంపదల స్వరూపములు, అన్నీ నీవై ఉండే ఓ ధాన్యలక్ష్మీ, నీకివే నా వందనములు.   


నమాత్సర్యం, నచ క్రోధో, నభీతి ర్నచ భేదధీహ్  
యద్ భక్తానాం వినీతానాం ధైర్యలక్ష్మీమ్ నమామ్యహమ్ || (4)

అర్థము:

ఈర్ష్యాసూయలు, కోపము, పిరికితనము, భేదభావముల వంటి లోపములను తొలగిస్తూ, సజ్జనులైన భక్తులకు ధైర్యము నొసగు ఓ ధైర్యలక్ష్మీ, నీకు నా వందనములు.    


పుత్ర పౌత్ర స్వరూపేణ పశుభృత్యాత్మనా స్వయం 
సంభవంతీంచ సంతానలక్ష్మీమ్ దేవీమ్ నమామ్యహమ్ || (5)

అర్థము:

పుత్రులు, పౌత్రులు (కొడుకు కూతుళ్లు, మనుమళ్ళు మనవరాళ్లు) ద్వారా సంతాన రూపములో ఉంటూ, పశువులు మొదలగు అన్ని జీవులలోను నీవే నెలవై ఉంటూండే ఓ సంతానలక్ష్మీ, నీకు నా వందనములు.    


నానావిజ్ఞాన సంధాత్రీమ్ బుధ్ధిశుద్ధి ప్రదాయినీం 
అమృతత్వ ప్రదాత్రీమ్ చ విద్యాలక్ష్మీమ్ నమామ్యహమ్ || (6)

అర్థము:

సకల విద్యలను పెంపొందింప జేస్తూ, బుధ్ధి పవిత్రతలను ఒసగుచూ, అమృతత్వమును ప్రసాదించు ఓ విద్యాలక్ష్మీ, నీకు నా వందనములు. 


నిత్యసౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మీ దదాతియా 
ప్రసన్నాం స్త్రైణ సులభామ్ ఆదిలక్ష్మీమ్ నమామ్యహమ్ || (7)

అర్థము:

నిత్య సౌభాగ్యాన్ని, మాంగళ్యాన్ని, సుశీలత్వమును, వరలక్ష్మివిగా ప్రసాదిస్తూ మాపై కరుణ జూపుము. స్త్రీలకు అందుబాటులో ఉంటూ ఆదుకునే ఓ ఆదిలక్ష్మీ, నీకు మా వందనములు.    


సర్వశక్తి స్వరూపామ్ చ సర్వసిధ్ధి ప్రదాయినీం 
సర్వేశ్వరీం శ్రీ విజయలక్ష్మీమ్ దేవీమ్ నమామ్యహమ్ || (8)

అర్థము:

అన్ని శక్తులూ నీవే అయి ఉండి, సకల సిధ్ధులూ, కౌశలములను ప్రసాదించు ఓ సర్వేశ్వరీ, విజయలక్ష్మీ, నీకు మా వందనములు.  


అష్ఠలక్ష్మీ సమాహార స్వరూపామ్ తాం హరిప్రియాం 
మోక్షలక్ష్మీమ్ మహాలక్ష్మీమ్ సర్వలక్ష్మీమ్ నమామ్యహమ్ || (9)

అర్థము:

అష్టలక్ష్ముల సమన్వయత గా ఉండే నీవు హరిప్రియవు (శ్రీహరి కి ప్రియురాలవు), మోక్షమును ప్రసాదించు దానవు. నీవు సర్వలక్ష్మివి, మహాలక్ష్మివి. ఓ సర్వలక్ష్మీ నీకు మా వందనములు.  


దారిద్య దుఖః హరణం సమృధ్ధి రపి సంపదాం 
సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మీ స్తుతేర్ భవత్ || (10)

అర్థము:
 
ఈ అష్టలక్ష్మీ స్తుతి చేసినవారికి దరిద్రత, దుఃఖములు తొలగిపోయి, అన్ని సంపదలు కలుగుతాయి. అట్టివారు సచ్చిదానంద పరిపూర్ణులు అవుతారు. సత్ అంటే నిజము, చిత్ అంటే జ్ఞానము. సచ్చిదానందము అంటే వారి భ్రమలు, సందేహములు తీరిపోయి, జ్ఞానవంతులై, సత్ప్రవర్తనతో నడుచుకుంటూ, సుఖఃసంతోషములతో ఆనందమయ జీవితము పొందుతారు.   


ఇతి శ్రీ గణపతి సచ్చిదానంద యతివర విరచిత అష్ఠ లక్ష్మీ స్తుతి సంపూర్ణమ్ ||   

ఈ అష్టలక్ష్మీ స్తుతిని శ్రీదత్త పీఠాధీశ్వరులైన శ్రీ సచ్చిదానంద యతివరులు ప్రస్తుతించారు.               

 

5, డిసెంబర్ 2025, శుక్రవారం

శ్రీ లక్ష్మీ అష్టకమ్ - Lakshmi Worship With 8 Hymns



శ్రీ మహాలక్ష్మీ అష్టకమ్:  

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే || (1)

నమస్తే గురుడారూఢే కోలాసుర భయంకరి 
సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (2)

అర్థము:
ఒక అడవిపంది ఆకారములో ఉన్న రాక్షసుడు దేవతల మీది కోపముతో ప్రజలందరినీ హింసించుచుండగా, అంతా కలిసి లక్ష్మీదేవిని ప్రార్ధిస్తారు. ఆమె ఆ రాక్షసుని చంపి అతని కోరిక ప్రకారము ఆ ఊరికి కోలాపురం అని పేరు పెట్టి, అక్కడే తను అంబాబాయి పేరుతొ వెలిసింది. అదే మహారాష్ట్ర లోని ఇప్పటి కోల్హాపూర్ నగరము. అట్టి మహాలక్ష్మికి నా వందనములు.     

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ఠ భయంకరి 
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (3)

సిద్ధిబుధ్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని 
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (4)

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి 
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే || (5)

స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే 
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే || (6)

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి 
పరమేశ్వరి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే || (7)

శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే 
జగత్ స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే || (8)

ఫలశ్రుతి 


మహాలక్ష్మ్యష్టకమ్ స్తోత్రమ్ యః పఠేత్ భక్తిమాన్నరః 
సర్వసిధ్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || 

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ 
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్  
మహాలక్ష్మీర్ భవేన్నిత్యం ప్రసన్నా, వరదా, శుభా ||  


28, నవంబర్ 2025, శుక్రవారం

శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి - Lord Venkateswara Ashtottara Shatanaamaavali


శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అంటే తిరుపతి వేంకటేశ్వరుని 108 నామాలు అన్నమాట. సాధారణముగా మనలో చాలామంది ప్రత్యేకముగా శనివారము రోజున ఆ ఏడుకొండల స్వామిని  108 పేర్లతో కొలుచుచూ, కుంకుమ, పువ్వులు సమర్పించుకుంటూ పూజించుకుంటాము. 

తెల్లవారు ఝామున సుప్రభాతము మొత్తము 4 అధ్యాయములూ రాగయుక్తముగా చదువుకోవడమూ, సాయంత్రము కుంకుమ పువ్వులతో 108 నామాలు చదవడమూ చేసుకోవచ్చును. 

ఇప్పుడు 108 నామాలు తెలుపుతున్నాను. ఇవి నా వద్ద ఉన్న ఒక వైష్ణవ పూజా పుస్తకము ప్రకారము తెలియజేస్తున్నాను.   



  వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి

  1. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః 
  2. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః 
  3. ఓం శ్రీ లక్ష్మీపతయే నమః 
  4. ఓం అనామయాయ నమః (వ్యాధులు లేనివాడు)
  5. ఓం అమృతాంశాయ నమః 
  6. ఓం జగద్వంద్యాయ నమః 
  7. ఓం గోవిందాయ నమః 
  8. ఓం శాశ్వతాయ నమః 
  9. ఓం ప్రభవే నమః (ప్రకాశము, లేదా జ్యోతిర్మయి)
  10. ఓం శేషాద్రి నిలయాయ నమః 
  11. ఓం దేవాయ నమః 
  12. ఓం కేశవాయ నమః (సుందరమైన, పొడవైన జటలు కలవాడు)
  13. ఓం మధుసూదనాయ నమః 
  14. ఓం అమృతాయ నమః 
  15. ఓం మాధవాయ నమః 
  16. ఓం కృష్ణాయ నమః 
  17. ఓం శ్రీహరయే నమః 
  18. ఓం జ్ఞానపంజరాయ నమః 
  19. ఓం శ్రీవత్సవక్షసే నమః 
  20. ఓం సర్వేశాయ నమః 
  21. ఓం గోపాలాయ నమః 
  22. ఓం పురుషోత్తమాయ నమః 
  23. ఓం గోపీశ్వరాయ నమః 
  24. ఓం పరంజ్యోతిషే నమః (అపారమైన జ్యోతిర్మయుడు)
  25. ఓం వైకుంఠపతయే నమః 
  26. ఓం అవ్యయాయ నమః (తరుగుదల లేనివాడు)
  27. ఓం సుధాతనవే నమః (అమృతదేహుడు, తానే అమృతము)
  28. ఓం యాదవేంద్రాయ నమః 
  29. నిత్యయౌవన రూపవతే నమః 
  30. ఓం చతుర్వేదాత్మకాయ నమః
  31. ఓం విష్ణవే నమః 
  32. ఓం అచ్యుతాయ నమః 
  33. ఓం పద్మినీప్రియాయ నమః
  34. ఓం ధరాపతయే నమః 
  35. ఓం సురపతయే నమః 
  36. ఓం నిర్మలాయ నమః 
  37. ఓం దేవపూజితాయ నమః 
  38. ఓం చతుర్భుజాయ నమః 
  39. ఓం చక్రధరాయ నమః 
  40. ఓం త్రిధామ్నే నమః (ముల్లోకవాసి)
  41. ఓం త్రిగుణాశ్రయాయ నమః (సత్త్వ, రజస్, తమోగుణములు)
  42. ఓం నిర్వికల్పాయ నమః (ద్వంద్వములు కాని సందేహములు కాని లేనివాడు)
  43. ఓం నిష్కళంకాయ నమః 
  44. ఓం నిరాతంకాయ నమః (ఆతంకము, భయములు లేనివాడు)
  45. ఓం నిరంజనాయ నమః (దేనియందు ఆసక్తి లేనివాడు)
  46. ఓం నిరాభాసాయ నమః (ఉనికి లేనివాడు, కనబడని వాడు)
  47. ఓం నిత్యతృప్తాయ నమః 
  48. ఓం నిరుపద్రవాయ నమః 
  49. ఓం నిర్గుణాయ నమః 
  50. ఓం గదాధరాయ నమః 
  51. ఓం శార్ఙ్గ పాణయే నమః 
  52. ఓం నందకినే నమః 
  53. ఓం శంఖ ధారకాయ నమః 
  54. ఓం అనేకమూర్తయే నమః 
  55. ఓం అవ్యక్తాయ నమః (కనబడని వాడు)
  56. ఓం కటి హస్తాయ నమః (ఒక చేయి నడుముపై ఉంచుకొనువాడు)
  57. ఓం వరప్రదాయ నమః 
  58. ఓం అనేకాత్మనే నమః 
  59. ఓం దీన బంధవే నమః 
  60. ఓం ఆర్తలోక అభయప్రదాయ నమః 
  61. ఓం ఆకాశరాజ వరదాయ నమః 
  62. ఓం యోగి హృత్పద్మ మందిరాయ నమః 
  63. ఓం దామోదరాయ నమః 
  64. ఓం జగత్ పాలాయ నమః 
  65. ఓం పాపఘ్నాయ నమః (పాపములను నశింపజేయువాడు)
  66. ఓం భక్తవత్సలాయ నమః 
  67. ఓం త్రివిక్రమాయ నమః (మూడు అడుగులతో ముల్లోకములనూ ఆక్రమించిన వాడు)
  68. ఓం శింశుమారాయ నమః (సప్త లోకములను ఆవరించి తేలు ఆకారములో ఉన్న విష్ణువు)
  69. ఓం జటామకుట శోభితాయ నమః (జటలను, వాటికి ఆభరణముగా ఒక కిరీటమును, అలంకరించుకున్నవాడు) 
  70. ఓం శంఖ మధ్యోల్లసన్ మంజుకింకిణ్యాధ్య కరండకాయ నమః (శంఖముల లోపలి నుండి తీయబడిన ముత్యములతో తయారైన హారము ధరించువాడు) 
  71. ఓం నీలమేఘశ్యామ తనవే నమః 
  72. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః 
  73. ఓం జగద్వ్యాపినే నమః 
  74. ఓం జగత్ కర్త్రే నమః 
  75. ఓం జగత్ సాక్షిణే నమః    
  76. ఓం జగత్పతయే నమః 
  77. ఓం చింతితార్థ ప్రదాయకాయ నమః (కోరుకున్న వరము లొసగువాడు)
  78. ఓం జిష్ణవే నమః (గెలుపొందు వాడు, పరాక్రమము వ్యాప్తి చెందినవాడు)
  79. ఓం దాశార్హాయ నమః (దాశార్హ వంశజుడు, దశరథ వంశజుడు) 
  80. ఓం దశరూపవతే నమః (పది రూపములు ధరించినవాడు)
  81. ఓం దేవకీనందనాయ నమః 
  82. ఓం శౌర్యే నమః 
  83. ఓం హయగ్రీవాయ నమః 
  84. ఓం జనార్దనాయ నమః 
  85. ఓం కన్యాశ్రవణ తాడ్యాయ నమః    
  86. ఓం పీతాంబర ధరాయ నమః 
  87. ఓం అనఘాయ నమః 
  88. ఓం వనమాలినే నమః 
  89. ఓం పద్మనాభాయ నమః 
  90. ఓం మృగయాసక్త మానసాయ నమః 
  91. ఓం అశ్వారూఢాయ నమః 
  92. ఓం ఖడ్గ ధారినే నమః 
  93. ఓం ధనార్జన సముత్సుకాయ నమః 
  94. ఓం ఘనసార లసన్మధ్య కస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః 
  95. ఓం సచ్చిదానంద రూపాయ నమః 
  96. ఓం జగన్మంగళ దాయకాయ నమః 
  97. ఓం యజ్ఞరూపాయ నమః 
  98. ఓం యజ్ఞభోక్త్రే నమః 
  99. ఓం చిన్మయాయ నమః 
  100. ఓం పరమేశ్వరాయ నమః 
  101. ఓం పరమార్థ ప్రదాయ నమః 
  102. ఓం శాంతాయ నమః 
  103. ఓం శ్రీమతే నమః 
  104. ఓం దోర్దండ విక్రమాయ నమః 
  105. ఓం పరాత్పరాయ నమః 
  106. ఓం పరబ్రహ్మణే నమః 
  107. ఓం శ్రీవిభవే నమః 
  108. ఓం జగదీశ్వరాయ నమః          

26, నవంబర్ 2025, బుధవారం

సూర్యాష్టకము - Worship of Sun God


సూర్యాష్టకము అంటే సూర్యుని పూజ చేసుకోడానికి చదివే ఎనిమిది శ్లోకాలు. సూర్యుని ఉపాసించే వారు ప్రతిరోజూ ఈ అష్టకము చదువుతూ సూర్య నమస్కారములు చేసుకోవచ్చును. ముఖ్యముగా ప్రతీ ఆదివారము నాడు ఉదయము, సాయంత్రము వీటిని చదివి (లేదా చదువుతూ) సూర్యుని ఉపాసించిన ఎడల మంచి లాభము అని చెబుతూ ఉంటారు మన పెద్దలు. 



సూర్యుడు ఈ భూమిపై జీవనానికి నాంది. సూర్యుని కిరణములు, వెలుగు లేనిదే జీవనము ఉండదు. మన ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా మంచిది. అందుకనే ఉదయము లేవగానే సూర్యుని ఎండ పడే చోట కొన్ని నిమిషాలు నిలబడటమో, కూర్చోడమో చేయాలి. మన పెద్దలే కాక, డాక్టర్లు కూడా ఇదే విషయము చెప్తారు. 

అలా సూర్యుని ఎదురుగా నిలబడి కాని, కూర్చుని కాని మనము శ్రద్ధతో ఈ సూర్యాష్టకము చదువుకుందాము. ఈ విధముగా కొంతసేపు మనకు సూర్యుని వెలుగు, కిరణాలు సోకుతూంటాయి. మన ఆరోగ్యము బలిష్టమౌతుంది. 

సూర్యాష్టకం శ్లోకాలు   


ముందుగా శ్రీ సూర్యనారాయణ స్తుతి 


ధ్యేయ స్సదా సవితృమండల మధ్యవర్తీ 
నారాయణ సరసిజాసన సన్నివిష్ఠహ  
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ 
హారీ హిరణ్మయ వపుహు ధృత శంఖ చక్రహః || 

అర్థము:
దృష్ఠి ఎల్లప్పుడూ సూర్యమండలము మధ్యలో నెలకొని ఉన్న పద్మము నందు ఆసీనుడై ఉన్న, మరియు భుజము నందు కేయూరములు (కడియములు), చెవులకు మకర కుండలములు (మొసలి ఆకారము కలిగిన కర్ణాభరణము), కిరీటము, హారములు, శంఖ చక్రములు ధరించి, బంగారు వన్నెల దేహకాంతితో విరాజమానమై ఉన్న ఆ మహావిష్ణువును ధ్యానించెదము.

ఇప్పుడు అష్టకము   


ఆదిదేవ నమస్తుభ్యం 
ప్రసీద మమ భాస్కరః |  
దివాకర నమస్తుభ్యం 
ప్రభాకర నమోస్తుతే || (1)

అర్థము:
ఆదిదేవుడవైన నీకు వందనములు. ఓ భాస్కరా నన్ను దయచూడు. దివాకరుడా వందనములు, ప్రభాకరుడవైన నీకు నమస్సులు సమర్పించుకుంటున్నాను.
 
భాస్కరుడు = తేజస్సు, కిరణములు ప్రసారించువాడు 
దివాకరుడు = దినము అంటే పగలు ఇచ్చేవాడు
ప్రభాకరుడు = వెలుగు, జ్యోతిని ఇచ్చేవాడు 
 

సప్తాశ్వ రథమారూఢం 
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మధరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (2)

అర్థము:
ఏడు గుఱ్ఱములు కల రథములో ప్రయాణము చేయువాడు, ప్రచండుడు అంటే అత్యంత తేజస్సు, ఉష్ణముతో భీకరముగా ఉండువాడు, కశ్యప మహర్షి తనయుడు, తెల్లని పద్మము దాల్చినవాడు, అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నా వందనములు. 

 
లోహితం రథమారూఢం 
సర్వలోక పితామహం 
మహాపాప హరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (3)

అర్థము:
ఎరుపు వన్నెలతో దేదీప్యమానంగా వెలిగిపోయే రథమునందు ప్రయాణము చేయువాడు, సకల లోకములకు పితామహుడు, మహాపాపములను కూడా పోగెట్టేవాడు అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నావందనములు. 


త్రైగుణ్యం చ మహాశూరం 
బ్రహ్మ విష్ణు మహేశ్వరం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (4)

అర్థము: 
త్రిగుణములందు గొప్పవాడవు, బ్రహ్మ, విష్ణువు, శివుడి తో సమానమైన వాడవు, మహాపాపములను కూడా పోగెట్టేవాడు అయినటువంటి ఓ సూర్యనారాయణా, నీకు నావందనములు.


బృంహితం తేజసాం పుంజం 
వాయురాకాశ మేవచ 
ప్రియంచ సర్వలోకానాం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (5)

అర్థము:
పుష్టికరమైన, తేజస్సుతో నిండిన కిరణములను వాయురాకాశములందు ప్రసరింపజేస్తూ, అంతటా వ్యాపించి ఉంటూ, సకల లోకములకు ప్రియుడవైన ఓ సూర్యనారాయణా, నీకు వందనములు సమర్పించుకుంటున్నాను. 


బంధూక పుష్ప సంకాశం 
హారకుండల భూషితం 
ఏకచక్ర ధరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (6)

అర్థము:
బంధూక పుష్పము అన్న పూవు చిక్కటి ఎరుపు, రక్తము రంగులో ఉంటుంది. అటువంటి దేహ వర్ణము కలిగి, హారములు, కుండలములు (చెవికి ఆభరణము) మున్నగు ఆభూషణములతో
అలంకరింపబడిన వాడును, ఒంటి చక్రము (అంటే విష్ణు చక్రము) ధరించిన వాడును అయిన ఓ సూర్యనారాయణా, నీకివే నా వందనములు.  


తం సూర్యం లోకకర్తారం 
మహాతేజ ప్రదీపనం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (7)

అర్థము:
ఓ సూర్యనారాయణా! ఈ లోకమునకు సృష్టి కర్తవు, యజమానివి నీవే. మహా తేజస్సుతో ప్రకాశిస్తూ, పాపములను హరించే నీకు ఇవే నా వందనములు. 
 

తం సూర్యం జగతాం నాథం 
జ్ఞాన ప్రాకాశ్య మోక్షదం 
మహాపాప హరం దేవం 
తం సూర్యం ప్రణమామ్యహమ్ || (8)

అర్థము: 
ఓ సూర్యనారాయణా! ఈ సకల జగత్తుకు తండ్రివి అయి ఉండి, జ్ఞానము, ప్రకాశము, మోక్షములను అందించువాడవు నువ్వు. మహా పాపములను తొలగించి మాకు కూడా మోక్షమును ప్రసాదించు ఓ దేవా. నీకివే నా వందనములు.  

ఫల శ్రుతిః 

సూర్యాష్టకం పఠే న్నిత్యం 
గ్రహపీడా ప్రణాశనమ్ 
అపుత్రో లభతే పుత్రం 
దరిద్రో ధనవాన్ బనేత్ || 

అర్థము:
ఈ సూర్యాష్టకమును ఎవరయితే ప్రతిరోజూ చదువుకుంటారో అట్టి వారికి గ్రహపీడలు ఉండవు, అవన్నీ తొలగిపోతాయి. పుత్రుడు లేని వారికి పుత్రుడు లభిస్తాడు. దరిద్రులకు ధనము దొరికి ధనవంతులు అవుతారు. 


స్త్రీ తైల మధు మాంసాని 
యే త్యజంతి రవేర్ దినే 
న వ్యాధి శోక దారిద్య్రం 
సూర్య లోకం చ గచ్ఛతి ||

అర్థము:
ఆదివారము రోజున ఈ సూర్యాష్టకమును నియమము తప్పక చదువుతూ, స్త్రీ భోగము, తాగుడు, మాంసము మున్నగువాటిని దూరముగా పెట్టినవారికి వ్యాధులు కానీ, శోకము కాని (అంటే దుఃఖము), దరిద్రత వంటివి ఉండవు. వీరంతా కూడ అంత్యకాలములో సూర్యలోకానికే జేరుకుంటారు.  


ఓం తత్ సత్ || ఇది ముమ్మాటికీ నిజము. 
  
ఇతి సూర్యాష్టకమ్ సంపూర్ణం ||   
     

22, నవంబర్ 2025, శనివారం

ఆంజనేయ కార్యసిధ్ధి మంత్రము - Hanuman Karyasiddhi Mantra

 


ఆంజనేయ కార్యసిధ్ధి మంత్రము అన్నది రామాయణము నందు సుందరాకాండ ముగింపు ఘట్టములో ప్రస్తావించబడినది. దీన్ని సీతాదేవి ప్రస్తావించింది. 

ఆంజనేయుడు రాముని ఆజ్ఞ మేరకు సీతాదేవి కోసమని వెదుకుతూ, సముద్రము దాటి లంకకు వెళ్ళాడు. లంక అంతటా గాలించి, ఆ ప్రయత్నములో అనేక మంది రాక్షసులను హతమార్చి, అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి జేరుకుంటాడు. 


ఆమెకు నమ్మకము కలిగించడానికి రాముని యొక్క గుణగానము, అతని అవయవ సౌష్టవము సీతాదేవికి వల్లెవేస్తాడు. ఆ విధముగా సీతాదేవి పెట్టిన పరీక్షలు అన్నింట్లో ఉత్తీర్ణుడై, ఆమెకు నమ్మకము కలిగిస్తాడు. రాముని క్షేమము చెప్పి, ముద్రికను చూపించి, త్వరలోనే మేమందరము వచ్చి నిన్ను విడిపించుకుని తీసుకెళ్తామని ఓదార్చి, తిరుగు ప్రయాణము కట్టే ముందు, కాస్త రావణాసురుడి ఆట పట్టించి వెళ్తానని చెప్పి ఆవిడ ఆజ్ఞ పొందుతాడు. 

అశోకవనము అంతా  చిందరవందర చేసేసి, రాక్షసుల చేతిలో బంధింపబడినట్లుగా నాటకమాడి, రావణాసురుడి దగ్గరకు జేరుతాడు. అతనికి శిక్షగా తోకకు నిప్పంటించి లంకా నగరమంతా తిప్పుతుంటే అన్ని రహస్యాలు ఆరా తీస్తూ ఆనందంగా తిరుగుతాడు. ఆ తర్వాత ఒక్కసారిగా బంధము విడిపించుకుని పైకి ఎగిరి తన తోకకి ఉన్న మంటలతో భవనాలన్నీ కూలిపోయేలా మంటలు అంటించి, సముద్రపు నీటిలో మునిగి మంటని ఆర్పేసుకుని, భయపడుతూ మళ్ళీ సీతాదేవి దర్శనము చేసుకుని, ఆవిడ క్షేయంగానే ఉందని సాంత్వన చెందుతాడు. 

అప్పుడు సీతాదేవి అతని ఘనకార్యములన్నిటినీ తిలకించింది కనుక ధైర్యము చెంది, తనను తప్పకుండా అతని సాయముతో శ్రీరాముడు విడిపించుకుంటాడని నమ్మకము పొందుతుంది. ఈ సందర్భము లోనే సీతాదేవి ఈ కార్యసాధన మంత్రమును ప్రస్తావించింది. 

ఆంజనేయా నీవు అన్నింటికీ సమర్ధుడివే అని అంటుంది. ఇదే మాటను ఈ క్రింది శ్లోకములో అంటుంది. 

ఆంజనేయ కార్యసాధన మంత్రము     

త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ | 
హనుమన్ యత్నామాస్థాయ దుఃఖక్షయ కరోభవ ||   

అర్థము:
ఓ హరిసత్తమా ! గొప్ప కార్యములను కూడా సులభముగా నిర్వహించుటలో నీకు నీవే సాటివి. కార్యసాధనకు నువ్వే సజీవ ప్రమాణము. (ఎందుకంటే అవలీలగా సముద్రాన్ని దాటి వచ్చి, దుర్భరమైన లంకలోకి యుక్తితో ప్రవేశించడమే కాకుండా అక్కడి రాక్షసులను గజగజ వణికించి, భయభీతులను చేసి పరిమార్చి, ధైర్యముగా రావణాసురుడి సభలో జేరి హితవు మాటలు చెప్పి, ఆ పిమ్మట లంకా దహనము కూడా చేయగలిగాడు). అందుకే అతడు అసాధ్య కార్యములను సాధ్యము చెయ్యడానికి అతడే సాటి, ప్రమాణము అయ్యాడు. 

కొంచము ప్రయత్నము చేసి నా దుఃఖమును కూడ పోగొట్టుమా హనుమా! ఈ మాట చెప్పడములో సీతాదేవి ఉద్దేశ్యము ఏమిటంటే శ్రీరామునికి ఎలాగో అల్లాగ నచ్చచెప్పి రావణునితో యుద్ధానికి పురికొల్పాలి. అలా ఎగదోలితే కానీ రాముడు యుద్ధము చెయ్యడు, రావణుడు చావడు. రావణుడు ఛస్తే కాని సీతకు ముక్తి దొరకదు. అందుకని హనుమంతుని సీతాదేవి అంతగా వేడుకోవాల్సి వస్తోంది. ఇక్కడ రాముడి ప్రతిష్ట కూడ ఆవిడ కాపాడ దలుచుకుంటోంది అని మనము గ్రహించాలి. 

ఈ విధముగా సీతాదేవి అంతటి గొప్ప ఆవిడకే హనుమంతుడు దిక్కు అయ్యాడు. స్వయంగా లక్ష్మీదేవి అయిన ఆమెయే ఆంజనేయుని ప్రార్ధించగా లేనిది మనము ఎక్కడో ఊహించండి. ఎంతగా ఆయనను పూజించినా తక్కువే అవుతుంది. 

కాబట్టి మనమందరమూ కూడా మన కష్టాలను గట్టెక్కించమని ఆయనను వేడుకుంటూ ఉందాము. 

ఈ మంత్రమును 3 సార్లు కానీ, 11 సార్లు కానీ మనము తోచినప్పుడల్లా చదువుకుంటూ ఆయనను తలుచుకోవచ్చును.        

20, నవంబర్ 2025, గురువారం

ఆంజనేయ ద్వాదశ నామావళి Anjaneya dwadasha naamaavali


ఆంజనేయస్వామి పూజ చేసేటప్పుడు ఆయనను ద్వాదశ నామాలతో (అంటే 12 పేర్లతో) కీర్తిస్తూ పూజించడము పరిపాటి. 

ఆంజనేయస్వామి అంజనాదేవి కుమారుడు. తండ్రి పేరు కేసరి. చాలా కాలము వరకు పిల్లలు లేకపోవుట చేత ఇద్దరూ కలసి శివపరమాత్మను, సూర్యుని ఉపాసన చేస్తారు. శివుడు తాండవం చేస్తూంటే రజస్ఖలనము జరిగిందని, అది సముద్రములో పడితే తట్టుకోలేక సముద్రుడు (వరుణుడు) దాన్ని సూర్యుడికి అప్పగించాడనీ, అప్పుడు సూర్యుడు దాన్ని వాయుదేవునికి ఇచ్చి అంజనాదేవి గర్భములోకి జేర్చమని చెప్పాడని ప్రతీతి. ఆ విధముగా ఆంజనేయుడు పుట్టాడు. అందుచేత ఆంజనేయుడు చాలా శక్తిమంతుడు, యుక్తిమంతుడు, దైవీక గుణములు కలవాడు అయ్యాడు. 


 

ఈ ద్వాదశనామాలు అతని ఘనకార్యములను వెల్లడిస్తున్నాయి. రామాయణములో శ్రీరాముని అత్యంత ప్రియభక్తుడు, సన్నిహితుడు ఆంజనేయస్వామి. ఇద్దరూ కలవటం వల్లనే రాముడు లంకకు జేరి రావణాసురుడిని చంపగలిగెను. సీతాదేవి ఎక్కడుందో ఆంజనేయుని ద్వారానే కనుక్కోగలిగారు. మొత్తము రామాయణములో అతనిది ఒక ముఖ్య పాత్ర. అటువంటి ఆ మహాభక్తుడైన ఆ ఆంజనేయుని ఈ పన్నెండు నామాలతో ఘనముగా కీర్తించడము జరిగింది. 

ఈ ద్వాదశ నామాలను ఒక రాగములో కీర్తిస్తూ చదువుకోవాలి. 

ఆంజనేయస్వామి ద్వాదశ నామావళి  

హనూమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః 
రామేష్ఠ ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః 
ఉదధిక్రమణ శ్చైవ సీతాశోక వినాశకః 
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవశ్శ దర్పహా || (1)

ద్వాదశైతాని నామాని కపీన్ద్రశ్చ మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః | 
తస్య మృత్యుహ్ భయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్ |  
తస్య మృత్యుహ్ భయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్ || (2)

బుధ్ధిర్ బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా 
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ ||  

శ్రీరామ జయరామ జయజయ రామ 
జయరామ జానకిరామ 
శ్రీరామ జయరామ జయజయ రామ|| 

ఓం తత్సత్ | లోకాః సమస్తా సుఖినో భవంతు || 

అర్థములు:

మొదటి శ్లోకములో ఆయన ద్వాదశ నామాలు, రెండవ శ్లోకములో ఆ నామకీర్తన చెయ్యడము వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు చెప్పబడినవి.  

12 పేర్లు ఈ విధముగా చెప్పబడినవి:-
 
  1. హనుమా ( ఆంజనేయుని దవుడలు వజ్రాయుధముతో గాయము చెంది వంకరగా అయిపోయినవి. అందుకని హనూమన్ అన్న పేరు వచ్చింది) హను అంటే దవుడ, మాన్ అంటే వంకరపోయినవి.
  2. అంజనాదేవి కుమారుడు (సూనుః అంటే కుమారుడా అని అర్థము)
  3. వాయుపుత్రుడు 
  4. మహాబలుడు 
  5. రామునికి ప్రీతిపాత్రుడు 
  6. అర్జునుడి స్నేహితుడు (అర్జుని రథానికి కట్టిన జెండాలో తను ఉన్నాడు)
  7. పింగాక్షుడు అంటే గోధుమరంగు కన్నులవాడు 
  8. అమిత అంటే ఎల్లలు లేని, అవధులు లేని పరాక్రమ వంతుడు. 
  9. ఉదధి అంటే సముద్రము, క్రమణము అంటే దాటుట. సముద్రము దాటినవాడు. 
  10. సీతాశోకమును పోగొట్టినవాడు 
  11. లక్ష్మణుడికి ప్రాణము తీసుకొచ్చినవాడు 
  12. దశగ్రీవుడు అంటే 10 తలలు కలవాడు. అట్టి రావణాసురుని గర్వభంగము చేశాడు. 
 ఇలా పన్నెండు పేర్లలో మొత్తము రామాయణము లోని ఆంజనేయుని పాత్ర వర్ణించబడినది. అందుకని ఈ శ్లోకము చాలా శక్తివంతమైనది.

ఫలశ్రుతి 

కపీన్ద్రుని అంటే ఆంజనేయుని పన్నెండు నామాలను ఎవరైతే చదువుతారో వారికి ఈ క్రింద చెప్పబడిన విధములుగా ఫలితములు దక్కుతాయి. హనుమంతుని మహాన్ ఆత్మ అంటే గొప్పదైన, దైవీక ఆత్మ అని పేర్కొనడము జరిగింది.
  •  స్వాపకాలము అంటే రాత్రి పూట అని కానీ, తెల్లవారు ఝామునే కానీ ప్రతీ రోజూ చదివే వారికి, మరియు యాత్రలు, ప్రయాణములు చేయునప్పుడు చదివిన వారికీ కూడ మృత్యువు భయము ఉండదు. ఎల్లా వేళలా అన్ని చోట్లా విజయమే చేకూరుతుంది. 
  • హనుమంతుని స్మరణ చేసే వారికి బుద్ధి వికాసము, బలము, యశస్సు, ధైర్యము పెంపొందును. 
  • ఎటువంటి భయములు ఉండవు. రోగాలు కూడ ఉండవు. అజాడ్యము అంటే సోమరితనము ఉండదు. వాక్కు పటుత్వము పెరుగును. 
ఓం తత్ సత్ అంటే ఇది నిజము. కాబట్టి మనము ఈ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే మంచి జరుగుతుంది అని నాకు కూడ నమ్మకము ఉంది.   

12, అక్టోబర్ 2025, ఆదివారం

నిత్యకృత్యములకు చదివే శ్లోకములు - Slokas: Wakeup to Bed

 మనము పొద్దుట నిద్ర నుండి లేస్తూ భగవంతుడి పేరు తలుచుకుంటూ లేస్తే ఆ రోజంతా మంచిగా ఉంటుందని చెబుతూంటారు. లేస్తూనే ఓం నమశ్శివాయ అనో, ఓం నమో నారాయణాయ అనో, లేదా నమో లక్ష్మీమాత అంటూనో, గౌరీమాత అంటూనో , మీకిష్టమైన దేవుణ్ణి తలుచుకుంటూ లేవచ్చును. 


My Mother's Painting

  ఆ పిమ్మట ముందుగా అమ్మ ముఖము చూసి, కాల్యకృత్యములు నిర్వహించడము మొదలిడ వచ్చును. లేదా తల్లితండ్రుల ఫోటో అయినా చూసుకోవచ్చును. 

నిత్యకృత్యాలు చేసుకునేటప్పుడు చదవటానికి వీలుగా కూడా  మన   పెద్దలు కొన్ని శ్లోకాలను తయారుచేశారు. ఈ విధంగా ప్రతీ పనీ కూడా దేవుణ్ణి తలుచుకుంటూ చేస్తున్నట్లుగా అవుతుంది. వీటివల్ల మనస్సుకి ఎంతో ప్రశాంతత , స్థిరత్వము కలుగుతుంది. చీకుచింతలు, చికాకులు, ఆందోళన లాంటివి ఉండవు.

 

ఇప్పుడు నేను కొన్ని శ్లోకములను వివరిస్తున్నాను.  

ఉదయం లేవగానే 

అరచేతులు కళ్ళకు అద్దుకుంటూ :

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే 
సహస్ర పాదాక్షి శిరోరు బాహవే
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే 
సహస్రకోటి యుగధారిణే నమః || 

అర్థము :-

మహావిష్ణువు (శ్రీమన్నారాయణుడు) ని తలుచుకుంటున్నాము పక్కమీద లేచి కూర్చుని ఆయన విశ్వరూపాన్ని ఊహించుకుంటూ. ఆయన ఎలా ఉన్నారంటే అంతులేని ఆకారంలో ఉన్నారు. వెయ్యి రూపాలతో కనిపిస్తున్నారు.  వెయ్యి అన్నది ఒట్టినే ఎనలేని (అంటే లెక్క పెట్టలేనన్ని) అనే అర్థములో వాడుతున్నాము ఇక్కడ. లెక్క లేనన్ని పాదములు, కనులు, శిరస్సులు, మొండెములు, బాహువులతో ఉన్నారు. అనంతములైన పేర్లు ఉన్నవి ఆయనకు. శాశ్వతముగా (ఆది, అంతములు లేనివారు) ఉండే పురుషుడు ఆయన. పురుషుడు అన్నది కూడ మన ఊహ మాత్రమే. పరమాత్మ అనుకోవాలి. అటువంటి పరమాత్ముడు, అనంతకోటి యుగములను ధరించువాడు అయిన ఆ పరంధాముడికి నమస్సులు సమర్పించుకుంటున్నాము. 

ఇంకొక  శ్లోకము కూడా చదువుకోవచ్చును. (పై శ్లోకము చదువుకో లేక పొతే దీన్నే చదువుకో వచ్చును.)

కరాగ్రే వసతి లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, 
కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనమ్ || 

కర మూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనమ్ ||

అర్థము :- 

అరచేతులలో దేవీ దేవతలను చూసుకుంటూ  స్మరిస్తున్నాము. 
అరచేయి ముందు భాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీ దేవి, చిట్టచివర గౌరీ దేవి నివసించునట్టి చేతి దర్శనము వేకువ ఝామున చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆ దేవీదేవతలకు నమస్కరించుకోవడము జరుగుతోంది. 


ఇదే విధముగా పడక నుండి లేచి భూమి మీద కాలు పెట్టునప్పుడు భూదేవి, లక్ష్మీదేవులను స్మరించుకుంటూ కాలు మోపుతున్నాను, క్షమించుమంటూ నిలబడాలి. 


స్నానము చేయునప్పుడు 

గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ 
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిమ్ కురు || 

అర్థము :- 

పైన ఏడు పుణ్యనదుల పేర్లు పేర్కొనబడ్డాయి. గంగ, యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు నది, కావేరీ నదులను స్మరించుకుంటూ - ఓ నదీదేవతలారా, మీ యొక్క పవిత్ర జలములను నాకు ప్రసాదించండి స్నానానికి అని వేడుకుంటున్నాము. 
ఈ విధంగా శ్లోకము చదువుకుని స్నానం చేస్తే ఆ నదులలో స్నానము చేసిన ఫలితము దక్కుతుంది. 

బొట్టు పెట్టుకునేటప్పుడు 

కుంకుమం శోభనం దివ్యమ్ 
సర్వదా మంగళప్రదమ్ 
ధారణేన అస్య శుభప్రదమ్ 
సౌభాగ్యదాం శాంతిదాం సదామమ ||

అర్థము :-

నేను ధరించే ఈ కుంకుమ బొట్టు/తిలకము దివ్యమైనది, నాకు శోభను, తేజస్సును ప్రసాదించేది. అన్నివేళలా నాకు మంగళప్రదమైనది (అంటే పవిత్రత కలిగించేది). ఇది ధరిస్తే శుభాన్ని, మంచిని సూచించేది. సర్వదా నాకు భాగ్యమును, శాంతిని ప్రసాదించునది,
దీర్గాయుష్షు నిచ్చేది. అటువంటి తిలకమును నేను ధరిస్తున్నాను. 

భోజనానికి కూర్చున్నప్పుడు 

అన్నపూర్ణే సదాపూర్ణే 
శంకర ప్రాణవల్లభే 
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం 
భిక్షామ్ దేహిచ పార్వతి || 

అర్థము :-

మనము భోజనము చేసేది జ్ఞాన సముపార్జన, కర్తవ్య పాలనముల కోసం కావాల్సిన బలము, శక్తి కలిగించుకోవడానికి మాత్రమే అని తెలుసుకోవాలి. 

అన్నానికి అధిదేవత అన్నపూర్ణాదేవి. ఆమెను వేడుకుంటున్నాము ఇక్కడ. 

ఓ అన్నపూర్ణాదేవీ, శంకరుని ప్రాణేశ్వరీ! నిత్యమూ పూర్ణముగా ఉంటూ, నేను జ్ఞానమునూ, వైరాగ్యమునూ సాధించుకుంటూ ఉండటం కోసము భిక్షను ప్రసాదించు తల్లీ. 
ఇక్కడ వైరాగ్యము అంటే పూర్తిగా పనులన్నీ త్యజించడము కాదు. మనము చేసే పనులన్నీ కూడా ఆసక్తి, కోరికలు లేకుండా చేసుకోవాలని అర్థము. ప్రతీ పనీ ఇతరుల మంచి కోసము, ప్రపంచానికి మంచి జరగాలని చేస్తూండాలి. 

ఆ పిమ్మట "అన్నం పరబ్రహ్మం" అనుకుని ఆ పరమాత్మకు నమస్కరించి నోట్లో రెండు మెతుకులు పెట్టుకుని తినడం మొదలెట్టాలి. 

భోజనము పూర్తి అయ్యాక    

అమృతోపస్తరణ మసి || 

అర్థము :-

తినడము అయ్యాక లేచే ముందు కొన్ని నీటి చుక్కలను తిన్న విస్తరి లేదా కంచము చుట్టూ జల్లుతూ "అమృతోపస్తరణమసి" అని అనుకోవాలి. అపస్తరణము అంటే అంతటా వ్యాప్తి చెందటం. జల్లిన ఆ నీటి చుక్కలు అమృతముగా పని చేస్తూ తిన్న తిండిని అమృతముగా చేసి ఆరోగ్యము, ఆయుస్సు పెంచుగాక అని భగవంతుని వేడుకుంటున్నాము.  

పని మీద బయటికి వెళ్లునప్పుడు 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః 
నిర్విఘ్నమ్ కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా || 

అర్థము :-

ఓ విఘ్నేశ్వరా! వంపులు తిరిగిన తుండము, విశాలమైన శరీరము పొందినవాడవు, కోటి సూర్యుల తేజస్సు కలిగినవాడవు  అయినట్టి నీవు మా అన్ని పనులలో, అన్ని సమయములందునూ ఎటువంటి విఘ్నములూ ఏర్పడకుండా కాపాడుతూ ఉండు దైవమా. 

ఆందోళన, భయము పోగొట్టుకోడానికి 

శ్రీ రామ స్తోత్రమ్:

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం || 



అర్థము :-

ఆపదలను తొలగించుచు, సంపదలను, శుభములను ప్రసాదించునటువంటి లోకులకు ప్రియమైనటువంటి శ్రీ రామచంద్రునికి పదేపదే నమస్కరిస్తున్నాను అని చదువుతూ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడైన ఆ శ్రీరాముని స్మరించుకోవాలి. 

ఆంజనేయ స్తోత్రమ్:
శ్రీ ఆంజనేయం, ప్రసన్నఆంజనేయం, ప్రభాదివ్య కాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, భజేహం పవిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం, భజేహం భజేహం || 



క్లిష్టమైన పనులు చేసేటప్పుడు 

ఆంజనేయుని తలుచుకుంటూ-

త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ 
యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ   

అర్థము :-

హరిసత్తమ అని ఆంజనేయుని ఉద్దేశించి అడుగుతున్నాము. అతను హరిభక్తుడు, మంచి శ్రేష్ఠ స్వభావము కలవాడు. 
ఓ ఆంజనేయా ! నువ్వు కార్యములు సాధించడములో మంచి నేర్పరివి, సఫలత్వమునకు నువ్వే ప్రమాణము. దయచేసి నా పనులలో అడ్డంకులను, బాధలను తొలగించుచు పని విజయవంతము అయ్యేట్లా చెయ్యవా? ఈ విధముగా లంకలో సీతాదేవి ఆంజనేయుడిని అడిగింది, ఆంజనేయస్వామి లంకను దాటి, రాక్షసులను వధించి, లంకను దహించిన తరువాత. 

కాబట్టి మనము కూడా ఇలా అడిగితె ఆయన పలుకుతాడు.  

ప్రయాణము చేసేటప్పుడు 

యత్ర యోగేశ్వర కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధరః 
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతి మమః || 

అర్థము :-

ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్బాణములు ధరించిన పార్థుడు (అర్జునుడు) ఉంటారో, అక్కడ తప్పనిసరిగా శ్రేయస్సు, విజయము ఉంటాయని నమ్మకము (ఇది సంజయుడు ధృతరాష్రునికి చెప్పాడు). మనము కూడా ఈ నమ్మకము పెట్టుకుని దైవాన్ని స్మరించుకుంటూ ప్రయాణము మొదలుపెడితే అది సఫలము అవుతుంది. 

రాత్రి పడుకునే ముందు 

రామస్కంధం, హనూమంతం, వైనతేయం, వృకోదరమ్ 
శయనే యస్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి ||    

అర్థము :-

పడుకునేటప్పుడు శ్రీ రాముని, హనుమంతుడిని, గరుత్మంతుడిని, భీముడిని స్మరిస్తూ పడుకుంటే దుఃస్వప్నములు రాకుండా ఉంటాయని ప్రతీతి. 

నేను పడుకునేటప్పుడు శ్రీమన్నారాయణుని తలుచుకుంటూ పడుకుంటాను. 

"ఓం నమో నారాయణాయ" అని. అలాగే లక్ష్మీమాతను, శ్రీ రాముని, శ్రీ కృష్ణుని తలచుకోవడము కూడా చేస్తూంటాను. 

     

17, జూన్ 2025, మంగళవారం

శ్రీ రామ స్తోత్రములు - Sri Rama Stotram Lyrics


శ్రీ రామ పూజా స్తోత్రములు కొన్ని ఇక్కడ అర్థములతో సహా పొందుపరచడం జరుగుతోంది. ఇవి మనము ప్రతిరోజూ పూజా సమయములో ఆ భగవంతుని గుణగణాలను అనుభవిస్తూ చాల సులువుగా చదువుకోవచ్చును. 


శ్రీ రాముడు ఎంతో అందమైన వాడు. అతని అందాన్ని గురించి సీతాదేవి మరీ మరీ వినాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకనే ఆమె లంకలో బంధింపబడి ఉన్నప్పుడు, హనుమంతుడు సముద్రము దాటి సీతాదేవిని కలుసుకున్నప్పుడు ఆమె శ్రీ రాముని వర్ణన చేయమని అడుగుతుంది (ఆంజనేయుడు నిజమైన రామదూత అవునో కాదో పరీక్షించడం కోసము). అప్పుడు ఆంజనేయస్వామి ఎంత అద్భుతంగా రాముని వర్ణన చేస్తాడో వాల్మీకి రామాయణము సుందరాకాండలో ఆ ఘట్టమును చదివిన వారికి మనస్సంతా కూడా ఎంతో  ఆనందంతో పులకితమైపోతుంది. ఆ వర్ణనను నేను వేరే బ్లాగులో తెలియజేశాను. అది ఇంగ్లీషులో ఇక్కడ చదువగలరు 

ప్రస్తుతము నేను ముందుగా శ్రీరామ తారక మంత్రముతో మొదలుపెట్టి ఆ తరువాత స్తోత్రాలని తెలుపుతాను,

రామ తారక మంత్రము 

ఈ శ్రీరామ మంత్రాన్ని పార్వతీదేవి కోరికపై శివుడు ఆమెకు తెలియజేస్తాడు. విష్ణు సహస్రనామాలు చదవలేని వారికోసమై ఏదైనా సులువు మార్గము తెలుపమని ఆమె కోరగా ఇదిగో ఐ మంత్రాన్ని జపిస్తే చాలు సమస్త పుణ్యాలు దక్కుతాయని శివుడు ఇది తెలియజేస్తాడు. 

"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యమ్ రామ నామ వరాననే ". 

అర్థము :-

శ్రీ రామ, రామ, రామ, అని మూడు సార్లు రామ నామము జపిస్తే చాలు మొత్తము వెయ్యి నామములు చదివిన పుణ్య ఫలము దక్కుతుంది అని చెప్పాడు. 

(రమే రామే మనోరమే అంటే ఓ రమా ! రాముని మనస్సులో అనుభవిస్తూ జపించాలి అని అర్థము). 

శ్రీరామ స్తోత్రములు     

ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్ 

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం || (1)

అర్థము :-

ఆపదలను (అపహరించేసి) తొలగించేసి, మరియు సర్వ సంపదలను ప్రసాదించేటి, లోకులందరికీ అభిమతముగా ఉంటూ ప్రియమైనట్టి ఆ శ్రీ రామునికి నేను పదే పదే నమస్కరించుచున్నాను. 

 

శ్రీ రాఘవమ్ దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిమ్ రఘుకులాన్వయ రత్నదీపం |  
ఆజానుబాహుమ్ అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరమ్ నమామి || (2) 

అర్థము :-

రఘుకుల వంశజుడు, దశరథునికి ఆత్మజుడు (ప్రియుడు), కుమారుడు, సాటి లేనివాడు, సీతాదేవికి పతి, రఘుకులము అంతటికీ రత్నదీపము వంటి వాడు, మోకాలిని తాకు చేతులు కలవాడు, కలువపువ్వు రేకుల వంటి కన్నులు కలవాడు, చీకట్లో తిరుగాడే రాక్షసులను నశింపజేయునట్టి శ్రీ రామునికి వందనములు.  


మర్త్యావతారే మనుజాకృతిం హరిమ్  
రామాభిధేయం రమణీయ దేహినమ్ | 
ధనుర్ధరం పద్మవిశాల లోచినమ్
భజామి నిత్యం న పరానృజిష్యే || (3)

అర్థము :-

భౌతిక అవతారము ఎత్తి మనుష్య రూపము దాల్చిన శ్రీ హరిని, రామ అను నామము దాల్చిన వానిని, కన్నులకు ఇంపైన అందమైన దేహములో ఉన్నవానిని, ధనుస్సు ధరించిన వాడు, విశాలముగా వికసించిన పద్మముల వంటి కన్నులు కలవాడు, అటువంటి శ్రీ రాముని రోజూ భజిస్తాను (పూజిస్తాను నేను) ఇంకెవ్వరిని కాదు.    


రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహమ్
మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్ | 
పాలకం జనతారకం భవహారకం రిపుమారకమ్ 
త్వామ్ భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్ || (4)

అర్థము :-

రాఘవుని (అంటే రాముని), కరుణాకరుడు అంటే జాలి, దయ కలిగినవాడు, సంసార బంధములను తొలగించు వాడు, ఆపదలను పోగొట్టువాడు, మాధవుడు అంటే అమ్మ (లక్ష్మీ రూపమైన సీతను ధరించిన వాడు, జనులను ఉద్ధరించే వాడు, భయములను తొలగించు వాడు, శత్రువులను చంపే వాడు, అయినటువంటి నిన్ను జగదీశ్వరుడువి, మనిషి రూపుడివి అయినట్టి రఘు కుల కుమారుడివైన శ్రీ రాముని నేను కొలిచెదను, భజన చేసెదను.    

27, మే 2025, మంగళవారం

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి - Goddess Saraswati Worship With 108 Names


సరస్వతీదేవి చదువుల తల్లి, బ్రహ్మదేవుని సహచారిణి. 

ఆమె చేతులలో రుద్రాక్ష మాల, ఒక చిలుక, తెల్లని పద్మము, పుస్తకము ఉంటాయి.  

సరస్వతీ పూజ ప్రత్యేకముగా చేసుకునేటప్పుడు మనము ఈ "సరస్వతీ అష్టోత్తర శతనామావళి" చదువుతూ పూజించుకోవచ్చును. 

సాధారణముగా పిల్లలకు అక్షరాభ్యాసము చేసేటప్పుడు సరస్వతీదేవిని పూజించి చేసుకుంటాము. అలాగే ఏడాదికి ఒకసారి పండుగలా సరస్వతి పుట్టినరోజు జరుపుకునేటప్పుడు కూడ ఆమెను మనము తృప్తిగా పూజించుకోవాలని అనుకుంటాము. ఇటువంటి సందర్భాలలో చక్కగా పువ్వులు, పసుపు, కుంకుమలతో సరస్వతీదేవిని పూజించుకోవచ్చును. ఒక్కొక్క పేరు చదువుతూ పసుపు కాని, కుంకుమ కాని, పుష్పము గాని ఆమెకు సమర్పించుకుంటూ తృప్తి, సంతోషములు పొందవచ్చును. 

ఇప్పుడు 108 నామములు తెలియజేస్తూ కొన్ని క్లిష్టమైన పేర్లకు మాత్రము అర్థములు తెలియజేస్తున్నాను. 
 
ఓం సరస్వత్యై నమః 
ఓం మహా భద్రాయై నమః 
ఓం మహా మాయాయై నమః 
ఓం వరప్రదాయై నమః 
ఓం శ్రీ ప్రదాయై నమః (శ్రీ అంటే యశస్సు, సంపద)
ఓం పద్మ నిలయాయై నమః 
ఓం పద్మాక్ష్యై నమః 
ఓం పద్మవక్త్రాయై నమః (పద్మముఖి)
ఓం శివానుజాయై నమః (శివుని సోదరి) || 9 ||

ఓం పుస్తక భృతే నమః 
ఓం జ్ఞానముద్రాయై నమః 
ఓం రమాయై నమః (రమ అంటే ఆహ్లాదము)
ఓం పరాయై నమః ( ఊహకు అందని పరమాత్మిని )
ఓం కామరూపాయై నమః (రూపము మార్చుకోగలది)
ఓం మహావిద్యాయై నమః 
ఓం మహాపాతక నాశిన్యై నమః 
ఓం మహాశ్రయాయై నమః 
ఓం మాలిన్యై నమః (మాలిని అంటే హారము ధరించినది)
(మాలిని అంటే కాపాడునది అని కూడ) ||18 ||

ఓం మహాభోగాయై నమః 
ఓం మహాభుజాయై నమః 
ఓం మహాభాగాయై నమః (సూక్ష్మరూపురాలు )
(లేదా భాగ్యము కలిగించునది)
ఓం మహోత్సాహాయై నమః 
ఓం దివ్యాంగాయై నమః 
ఓం సురవందితాయై నమః 
ఓం మహాకాల్యై నమః (కాలదేవత, లేదా మృత్యుదేవతల అంశము)
ఓం మహాపాశాయై నమః (పాశముతో వశము చేసుకునేది)
ఓం మహాకారాయై నమః (విశాల రూపము కలది) || 27 ||

ఓం మహాంకుశాయై నమః 
ఓం పీతాయై నమః (పీతాయై అంటే పట్టు బట్టలు ధరించినది)  
ఓం విమలాయై నమః (పవిత్రురాలు)
ఓం విశ్వాయై నమః 
ఓం విద్యున్మాలాయై నమః (తేజస్సునే మాలగా ధరించినది)
ఓం వైష్ణవ్యై నమః (విష్ణువు యొక్క శక్తి స్వరూపిణి)
ఓం చంద్రికాయై నమః (మెరుపుతీగ వంటిది)
ఓం చంద్రవదనాయై నమః 
ఓం చంద్రలేఖా విభూషితాయై నమః (చంద్రకిరణములు దాల్చినది) || 36 ||

ఓం సావిత్ర్యై నమః (సావిత్రీదేవి, సూర్యతేజస్సు కలది)
ఓం సురసాయై నమః (దేవతల ప్రీతిపాత్రురాలు)
(సురస అంటే దివ్యజ్ఞానము, ఉత్తమ కళల యొక్క సారము అందించేది) 
ఓం దేవ్యై నమః 
ఓం దివ్యాలంకార భూషితాయై నమః 
ఓం వాగ్దేవ్యై నమః 
ఓం వసుధాయై నమః 
ఓం తీవ్రాయై నమః (మేటి అయిన దిట్ట) 
ఓం మహాభద్రాయై నమః (భద్రాదేవి అని చండశాసనముగా ఉండేది)
ఓం మహా బలాయై నమః || 45 ||

ఓం భోగదాయై నమః (భోగములను ప్రసాదించునది)
ఓం భారత్యై నమః (మరో పేరు భారతీదేవి)
ఓం భామాయై నమః (ఆకర్షణ, మక్కువ కలది)
ఓం గోవిందాయై నమః (ఇంద్రియముల రక్షకురాలు)
ఓం గోమత్యై నమః (జ్ఞానేంద్రియమైన దేవి)
ఓం శివాయై నమః (ఆనందము, తన్మయము)
ఓం జటిలాయై నమః ( జటిల అంటే అంతు చిక్కనిది)
ఓం వింధ్య వాసాయై నమః (వింధ్యప్రదేశములో వసించునది)
ఓం వింధ్యాచల విరాజితాయై నమః  (వింధ్య పర్వతముపై వెలసిన దేవి)
(అష్టభుజ గుడి లో వెలసిన దేవి) || 54 ||

ఓం చండికాయై నమః (సరస్వతి చండిక లేదా దుర్గాదేవి అంశములో కూడ ఉంది)
ఓం వైష్ణవ్యై నమః (వైష్ణవీదేవిలోని శక్తిస్వరూపిణి అయిన సరస్వతి)
ఓం బ్రాహ్మ్యై నమః (బ్రహ్మదేవుని పత్ని)
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః (బ్రహ్మజ్ఞానానికి ఏకమాత్ర సాధనము)
ఓం సౌదామిన్యై నమః (సౌదామిని అంటే మెరుపు లేదా తేజస్సు)
ఓం సుధామూర్త్యై నమః (అమృత మూర్తి)
ఓం సుభద్రాయై నమః 
ఓం సురపూజితాయై నమః 
ఓం సువాసిన్యై నమః (జగత్తుని మంగళమయము చేయునది) || 63 ||

ఓం సునాసాయై నమః ( చక్కని ముక్కు కలది)
ఓం వినిద్రాయై నమః (సర్వదా చేతనశక్తి కలది)
ఓం పద్మలోచనాయై నమః 
ఓం విద్యారూపాయై నమః 
ఓం విశాలాక్ష్యై నమః 
ఓం బ్రహ్మజాయాయై నమః (బ్రహ్మ శరీరములో నుండి పుట్టినది)
ఓం మహాఫలాయై నమః (గొప్ప ఫలములు అందించునది)
ఓం త్రయీమూర్త్యై నమః  (ముగ్గురమ్మల దేవి)
ఓం త్రికాలజ్ఞాయై నమః (మూడు కాలము తెలిసినది) || 72 ||

ఓం త్రిగుణాయై నమః 
ఓం శాస్త్ర రూపిణ్యై నమః 
ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః (శుంభాసురుని చంపినది)
ఓం శుభదాయై నమః 
ఓం స్వరాత్మికాయై నమః (స్వరములో ఉండే ఆత్మ)
ఓం రక్తబీజ నిహన్త్ర్యై నమః (రక్తబీజుని కూడ చంపినది)
ఓం చాముండాయై నమః (చండకాసురుని వధించినది)
ఓం అంబికాయై నమః 
ఓం ముండకాయ ప్రహరణాయై నమః (ముండక రాక్షసుని చంపినది) || 81 ||

ఓం ధూమ్రలోచన మర్దనాయై నమః (ధూమ్రలోచన రాక్షసుని చంపినది)
ఓం సర్వదేవస్తుతాయై నమః 
ఓం సౌమ్యాయై నమః 
ఓం సురాసుర నమస్కృతాయై నమః 
ఓం కాలరాత్ర్యై నమః (కాలరాత్రి అంటే కాళికలో అంశము)
ఓం కళాధారాయై నమః (సమస్త కళలకు ఆధారము)
ఓం రూపసౌభాగ్య దాయిన్యై నమః 
ఓం వాగ్దేవ్యై నమః (వాక్కుకి దేవి)
ఓం వరారోహాయై నమః (ఎడతెరిపిగా విద్యలను అందించేది) || 90 ||

ఓం వారాహ్యై నమః ( జీవము పోయునది)
ఓం వారిజాసనాయై నమః (వారిజము అంటే తామరపూవు)
ఓం చిత్రాంబరాయై నమః (చిత్ర విచిత్రములైన, అంటే ఆకర్షణీయమైన దుస్తులు దాల్చినది)
ఓం చిత్రగంధాయై నమః 
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః 
ఓం కాంతాయై నమః (కాంత అంటే దివ్యకాంతులతో అందంగా, పుష్టికరముగా ఉన్నది)
ఓం కామప్రదాయై నమః 
ఓం వంద్యాయై నమః (నమస్కరింప తగినది)
ఓం విద్యాధర సుపూజితాయై నమః || 99 ||

ఓం శ్వేతాననాయై నమః 
ఓం నీలభుజాయై నమః 
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః (ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఇచ్చునది)
ఓం చతురానన సామ్రాజ్ఞ్యాయై నమః (బ్రహ్మదేవుని సతీమణి)
ఓం రక్తమధ్యాయై నమః (రక్త మధ్యము అంటే శక్తి, లేదా ప్రాణము)
ఓం నిరంజనాయై నమః (పవిత్రమైనది లేదా వికారములు లేనిది)
ఓం హంసాసనాయై నమః 
ఓం నీల జంఘాయై నమః 
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః (బ్రహ్మ, విష్ణువు, శివులకు ప్రీతికరమైనది) || 108 ||

ఓం ఇతిః శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్ || 

18, మే 2025, ఆదివారం

సరస్వతీ వందనము శ్లోకములు - Sage Agastya's Saraswati Stotrams



సరస్వతీ స్తోత్రములను అగస్త్య మహాముని ప్రవచించినట్లుగా చెప్పుకుంటారు. ఈయన సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం జన్మించి ఉంటారని అంచనా. 

అగస్త్యముని సప్తఋషులలో ఒకరైన పులస్త్య మహాఋషి కొడుకుగా భావింపబడుతున్నారు పురాణముల ద్వారా. ఒకప్పుడు వరుణుడు, మిత్రుడు (అంటే సూర్యుడని అంటారు) ఆ ఇద్దరు దేవతలూ యజ్ఞము చేయు సమయములో వారికి ఎదురుగా ఊర్వశి ఎగురుతూ కనిపించింది. ఆమె అందానికి వారు పరవశులై పోగా వారిద్దరి వీర్యము ఒక కుండలో (యజ్ఞ పాత్రలో) పడి జీవము పోసుకుని అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించారని చెప్పుకుంటారు. ఆ విధముగా దైవీ శక్తి ద్వారా జన్మించి ఇద్దరూ కూడ గొప్ప ఋషులు అయ్యారు. 

అట్టి మహానుభావుడైన అగస్త్య మహాముని సరస్వతీదేవి కటాక్షమును పొంది అందుకు కృతజ్ఞతగా ఆ దేవిని ప్రార్ధిస్తూ అనేకములైన స్తోత్రములు కృతి చేశారు అని ఎరుక. వాటిలోని ఒక భాగమే ఇక్కడ పొందుపరుస్తున్న స్తోత్రములు. 

నేను 2,3 స్తోత్రాలు విడిచి పెట్టి మిగతా వాటినే ఇక్కడ తెలియజేస్తున్నాను. "విద్యారంభం కరిష్యామి" అన్న శ్లోకము, "యా కున్దేన్దు తుషారహారాధవళా" అన్న స్తోత్రాన్ని నేను వేరే పోస్టులో ఇంతకూ ముందే తెలియజేసేశాను. ఆ రెండూ ఇక్కడ ఇస్తున్న వాటితో జత కూడటం లేదని వాటిని ఇవ్వడము లేదు. 

సరస్వతీ స్తోత్రములు 


సరస్వతీ నమస్తుభ్యమ్ సర్వదేవి నమో నమః | 

శాంతరూపే శశిధరే, సర్వయోగే నమో నమః || (1)

అర్థము :-

ఓ మాతా సరస్వతీ, నీకివే నా వందనములు. అందరికీ దేవివైన నీకు వందనములు. శాంతమే రూపముగా కలిగి, చంద్రుని నీ ముఖము చుట్టూ దేదీప్యముగా దాల్చినావు. యోగులందరికీ యోగినివైన నీకు నా నమస్సులు. 


నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః | 

విద్యాధరే విశాలాక్షి శుద్ధ జ్ఞానే నమో నమః || (2)

అర్థము :-

ఎల్లవేళల ఆనందముగా ఉంటూ, ఆధారము అంటూ ఏదీ అవసరము లేనిదానవు. ఎటువంటి దోషము, మచ్చలు లేనిదానవైన నీకు నా నమస్సులు. విద్యను ధరించిన విద్యాదేవతవు నీవు. విశాలములైన కన్నులు కలదానవు. పరిపూర్ణమైన దివ్యజ్ఞానము మూర్తీభవించిన నీకు నా నమస్సులు. 


శుద్ధ స్ఫటిక రూపాయై సూక్ష్మ రూపే నమో నమః | 

శబ్ద బ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధియై నమో నమః || (3)

అర్థము :-

స్వచ్ఛమైన స్ఫటిక వంటి రూపమును కలిగినదానవు, జ్ఞానము అనే సూక్ష్మ రూపురాలివైన నీకు నా నమస్సులు. నువ్వు శబ్దమనే బ్రహ్మీ దేవతవు. నాలుగు చేతులు కలిగి, సర్వ సిద్ధులతో వెలుగొందే తల్లీ ! నీకివే నా వందనములు.  


ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః | 

మూలమంత్ర స్వరూపాయై మూల శక్త్యై నమో నమః || (4)

అర్థము :-

ముత్యములతో అలంకరింపబడిన సర్వాంగివి నీవు, మూలాధార చక్రము నీవు. అన్నింటికీ ఆధార భూతురాలివైన నీకు నమస్సులు. మూలమంత్రము అంటే ఓంకార మంత్రము. అట్టి ఓంకార స్వరూపురాలివి, (మంత్రములకు, సకల విద్యలకు మూలాధారము) నీవు, అన్నింటికీ మూలశక్తివి నీవు. అట్టి నీకు నా వందనములు.   


మనోన్మని మహాయోగే వాగీశ్వరి నమో నమః | 

వాఙ్మ్యయై వరదహస్తాయై వరదాయై నమో నమః || (5)

అర్థము :-

మనస్సు లోపలి మనస్సువై (ఆత్మవై), మహా యోగినివి, మరియు వాక్కునకు దేవతవు అయిన నీకు నమస్సులు. వాఙ్మయము (శబ్దము) అంతా నీ ఉనికిపట్టు. అట్టి వాఙ్మయివైన నీకు, నీ వరములొసగు చేతికి, స్వయముగా నీవే ఒక వరము అయినట్టి నీకు ఇవే నా వందనములు.    


వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః | 

గుణ దోష వివర్జిన్యై గుణ దీప్యై నమో నమః || (6) 

అర్థము :-

వేదము నువ్వే, వేదరూపురాలివి నువ్వు (వేదాలకు ఒక ఆకృతి కల్పన చేసుకుంటే ఆ ఆకృతి సరస్వతిది), నువ్వే వేదాంతము, వేదాంతసారము. అట్టి నీకు నా నమస్సులు. మాలోని గుణ దోషములను తొలగించుచు మంచి గుణముల వైపు తీసుకెళ్లే జ్ఞాన దీపానివి నువ్వు. అట్టి నీకు ఇవే నా వందనములు. 


సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః | 

సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః || (7)

అర్థము :-

సకల జ్ఞానము నీవే అయి, నిరంతరమూ ఆనందముతో ఉంటూ మమ్మల్ని కూడా జ్ఞానమనే ఆనందము అనుభవింపజేస్తూ ఉండే అన్ని రూపములలో ఆంతటా వ్యాపించి ఉండే నీకు నా నమస్సులు. నీవు మాకందరికీ ఒక పెన్నిధి వంటి దానవై, సదా కుమారివిగా ఉంటూ (అంటే చిరంజీవియై ఉండటము), అన్నీ తెలిసినదానివై (సమస్త జ్ఞానము, కాలములను కూడ) ఉండే ఓ సరస్వతీ మాతా, నీకివే నా వందనములు.  


యోగానార్య రమాదేవ్యై యోగానందే నమో నమః | 

దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || (8)

అర్ధము :-

యోగులకే ఆచార్యురాలివి నీవు. అందరినీ ఆహ్లాదపరచు రమాదేవివి నీవు. యోగములో మునిగితేలుతూ ఆనందించు దేవీ నీకు నా నమస్సులు. 

దివ్యజ్ఞానివి, త్రినేత్రములు కలదానివి, దివ్యమైన రూపము కలదానివి అయినట్టి నీకు ఇవే నా వందనములు.  


అర్థచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః | 

చంద్రాదిత్య జటాధారి చంద్రభూషే నమో నమః || (9)

అర్థము :-

అర్థచంద్రుని నీ శిఖలో ధరించి చంద్రబింబము వలె శోభిల్లే నీకు నమస్సులు.  చంద్రుని, ఆదిత్యుని (సూర్యుని) కూడ సమానముగా నీ జటలలో దాల్చి, స్వయంగా చంద్రుడే నీకు ఒక అభూషణముగా ఉన్నటువంటి తల్లీ నీకివే నా వందనములు. 


అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః | 

అణిమాద్యష్ట సిద్ధాయై ఆనందాయై నమో నమః || (10)

అర్థము :-

ఒక సూక్ష్మమైన అణు రూపములోను, పెద్దదైన బృహత్ రూపములోను ఉంటూ విశ్వరూపము కూడ దాల్చు నీకు నా నమస్సులు. అంతేకాక అణిమ మొదలగు అష్టసిద్ధులు నీవే అయి ఆనందమును అనుభవించుచూ అందరికీ పంచి పెడుతుండే నీకివే నా వందనములు. 


జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః | 

నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || (11)

అర్థము :-

జ్ఞానము, విజ్ఞానము అని రెండు విధాలుగా చదువు, తెలివితేటలను విభజించారు. ఒకటి ఏమో కళలకు, తత్త్వానికి సంబంధించినది. రెండవది భౌతిక, రసాయన, ఖగోళ విద్యలకు సంబంధించినది. ఈ రెండింటి రూపము సరస్వతివే. అలాగే ఆమె జ్ఞానమూర్తి కూడ. అన్ని విద్యలు, జ్ఞానము రూపము దాల్చితే అవి సరస్వతే. అట్టి నీకు నా నమస్సులు. 

ఈ విధముగా నానా శాస్త్ర స్వరూపురాలివై, అనేక రూపములు దాల్చే ఓ తల్లీ, సరస్వతీ ! నీకివే నా వందనములు.     


పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః | 

పరమేష్ఠ్యై పరామూర్త్యై పాపనాశిన్యై నమో నమః || (12)

అర్థము :-

పద్మములో పుట్టి, పద్మ వంశానికి చెందినదానివై, పద్మరూపములో ఉన్న తల్లీ నీకు నా నమస్సులు. అందరికీ అధిదేవతవై, సకల ప్రాణులన్నిటి కంటె అపరము అయిన దానివై, దైవీ శక్తితో కూడిన దైవీ మూర్తివైనట్టి నీకివే నా వందనములు.  


మహాదేవ్యై మహా కాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః | 

బ్రహ్మవిష్ణు శివాఖ్యాయై చ బ్రహ్మనార్యై నమో నమః || (13)

అర్థము :-

మహాదేవి అంటే ఇక్కడ పార్వతీదేవి అనుకోవాలి. పార్వతి, మహాలక్ష్మి, కాళీ మాత అన్నీ నీవే అయిన తల్లీ, నీకు నా నమస్సులు. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన అధిదేవత లందరిచేత పొగడబడుతుండు ఆ బ్రహ్మ దేవుని సతివైన నీకివే నా వందనములు. 


కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః | 

కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || (14)

అర్థము :-

కమలము వంటి చేతులతో పుష్మము వంటి దానివై, కోరిన రూపముల దాల్చుచుండే కామరూపిణీ, నీకు నా నమస్సులు. కపాలి అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మ చేసే పనులకు, వ్రాతలకు దీపము వంటిదానివై, అవి అన్ని సఫలములు అగునట్లు చేసేదానివైన తల్లీ, నీకివే నా వందనములు. 


ఇత్థం సరస్వతీ స్తోత్రమ్ అగస్త్యముని వాచకమ్ | 

సర్వసిద్ధి కరం న్రూణాం సర్వపాప ప్రణాశనమ్ || (15)      

అర్థము :- 

ఇక్కడితో అగస్త్యముని చెప్పిన సరస్వతీ స్తోత్రము పూర్తి అయినది. ఇది ప్రతిదినము పఠించేవారికి అన్ని సిద్ధులు, సర్వ శక్తులు కలిగి, వారి పాపములన్నీ నశించిపోతాయి.   

16, మే 2025, శుక్రవారం

సరస్వతి పూజా స్తోత్రములు - Goddess Saraswati Prayers


సరస్వతీ దేవి విద్యాదేవత. అంతేకాదు ఆవిడ సకల కళలకు అధిదేవత. అందుచేత పిల్లలకు అక్షరాభ్యాసము చేసేటప్పుడు, మరియు ఏవైనా కళలలో శిక్షణ ఆరంభించే ముందు, ముందుగా సరస్వతీ పూజ చేసుకుని ఆమె ప్రసన్నతను, ఆశీర్వాదములను పొంది ఆయా విద్యలలో శిక్షణ ఆరంభించాలి. సంగీతమైనా సరే, సాహిత్యమైనా సరే, చిత్రకళ అయినా సరే, అన్నింటికీ ఆవిడ అనుగ్రహము పొందాలి. 

అందుకనే సంగీతము లేదా నాట్యము యొక్క శిక్షణలు, మరియు ప్రదర్శనలు కూడ సరస్వతీ స్తుతి తోనే మొదలు పెట్టడము జరుగుతుంటుంది.  కావ్య రచనలు చేసే గొప్ప గొప్ప కవులు, రచయితలూ కూడా సరస్వతీ స్తుతి తోనే మొదలు పెడుతారు.  

పిల్లల్ని బడిలో జేర్పించేముందు సరస్వతీదేవి పూజ చేసి, అక్షింతలు జల్లుకుని, ప్రసాదము గ్రహించిన తరువాతనే ఇంటి నుండి స్కూలుకి బయలుదేరాలి. అప్పుడు బిడ్డల చదువు రాణిస్తుంది. మంచి తెలివితేటలతో చదువుకుని, గొప్పవారు అవుతారు. 

ఇప్పుడు నేను ఆ సరస్వతీ తల్లి పూజా స్తోత్రములు కొన్ని నాకు తెలిసినవి, బాగున్నవి అర్థములతో సహా పొందుపరుస్తున్నాను. 

సరస్వతీ స్తోత్రము  


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || (1)

అర్థము :-

ఇక్కడ కామరూపిణి అంటే కోరికలన్నీ ఒక మూర్తిగా భావించుకుంటే ఆ మూర్తి సరస్వతీదేవిది అన్నమాట. కామము అంటే కోరిక. 

కామరూపిణివైన ఓ సరస్వతీ మాతా! నీకు నమస్సులు సమర్పించుకుంటున్నాను. నేను విద్యను ఆరంభించబోతున్నాను. ఓ తల్లీ, సదా నా ప్రయత్నములు సఫలము అవుతూ నేను సిద్ధిని పొందేట్లా ఆశీర్వదించుమా (వరమును ప్రసాదించుము). 


సరస్వతీ మహాభాగే, విద్యే, కమల లోచనే,
విద్యారూపే, విశాలాక్షి, విద్యామ్  దేహి, నమోస్తుతే !! (2) 

అర్థము :-

ఓ మాతా సరస్వతీ ! నీవు మా మహాభాగ్యము (మాకు అదృష్ట దేవతవి), నీవే విద్యవు (సమస్త జ్ఞానము నీవే), విద్యలు లేదా జ్ఞానము యొక్క రూపము నువ్వు, జ్ఞానసరస్వతివి, ఓ విశాలములైన కన్నులు కలదానా ! మాకు విద్యను ప్రసాదించు దేవీ, నీకు వందనములు సమర్పించు కుంటున్నాను.  


యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా 
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా | 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్ దేవై సదా వందితా 
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా || (3)

అర్థము :-

ఓ మాతా ! నీ మోము మంచు తుంపరల వంటి తెల్లటి మెరుపులతో మెరుస్తుండగా, అందమైన మల్లెపూల హారములను దాల్చి, తెల్లని, శుభ్రమైన వస్త్రములతో నీ శరీరము అలంకరింపబడగా, చేతులలో వీణ మరియు వరములిచ్చే దండమును దాల్చి, తెల్లని పద్మము నందు నీవు ఆసీనురాలివై ఉన్నావు. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మున్నగు దేవతలంతా నిన్ను సదా గౌరవించుతూ, ఆదరిస్తూ ఉంటారు. అంతటి మహనీయురాలవైన ఓ మాతా సరస్వతీ ! భగవతీ, నిన్నే నేను శరణు వేడి కొలుస్తుంటాను, మా అంధకారములు, అజ్ఞానములు, బాధలను పూర్తిగా తొలగించుము తల్లీ !   


సురాసురైస్సేవిత పాదపంకజా, కరే విరాజత్కమనీయ పుస్తకా |  
విరించిపత్నీ, కమలాసనస్థితా సరస్వతీ, నృత్యతు వాచిమే సదా || (4)

అర్థము :-

దేవతలు, దానవులచే సేవింపబడు కమలములు పోలిన పాదములు కలిగి, చేతిలో చక్కని పుస్తకమును ధరించి, బ్రహ్మదేవుని పత్నివై యుండి పద్మములో నివసించునటువంటి ఓ సరస్వతీ మా నాలుక మీద సదా నృత్యము చేస్తూ ఉండు తల్లీ ! (అంటే మంచి వాక్కు, జ్ఞానము కలిగించుమని వేడుకుంటున్నాము)


సరస్వతీ, సరసిజ కేసరప్రభా, తపస్వినీ, సితకమలాసన ప్రియా | 
ఘనస్తనీ కమలవిలోల లోచనా, మనస్వినీ, భవతు వరప్రసాదినీ || (5)

అర్థము :-  

ఓ మాతా సరస్వతీ ! తామరపూవు వంటి కేసరీ వర్ణము యొక్క తేజస్సుతో ప్రకాశించుదానా, ఓ తపస్వినీ, కమలములో ఆసీనురాలివై ఉండుట యందు ఆసక్తి కలిగినదానా, బలిష్టమైన స్తనములు కలిగిన తల్లీ, కదులాడుతూ అందరినీ ఆకర్షించు కమలదళముల వంటి కనులు కలదానా, మంచి మనస్సు కల తల్లీ, వరములను ప్రసాదించు మాతా ! (సదా వరముల నొసగుతుందువు గాక). 

మామూలుగా రోజూ సరస్వతి పూజ చేసుకోడానికి ఇన్ని స్తోత్రములు చాలును. 

ప్రత్యేక పూజలు చేసుకునేటప్పుడు ఇంకా మంచిగా ఆ తల్లిని పూజించుకుని తృప్తి పడుటకోసమని నేను ఇంకో రెండు పోస్టులలో ఒకటి అగస్త్య మహాముని చెప్పిన సరస్వతీ స్తోత్రము, ఇంకోటి సరస్వతీదేవి అష్టోత్తర శతనామ పారాయణ గురించి దీని తదుపరి పోస్టులలో తెలియజేస్తాను.           

 

6, మే 2025, మంగళవారం

ప్రాణాయామము - ప్రాణము యొక్క ఐదు అంశములు - How to Do Pranayama

pranayamam


ప్రాణాయామము అంటే ఏమిటి 

 ప్రాణాయామము అంటే ప్రాణము లేదా ప్రాణశక్తిని నియంత్రించుకోవడము.  మనము పీల్చుకునే గాలిని నియంత్రించుకుంటూ శరీరమంతటా ప్రసరింప జేసుకుంటూ అది మనకు అన్ని విధములుగా ఉపయోగపడునట్లు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము ఈ ప్రక్రియ ద్వారా. 

ప్రాణము అనేది ఐదు విధములుగా వ్యక్తము అవుతుంటుంది. అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, మరియు సమాన వాయువులు. 

  1. ప్రాణ వాయువు అనేది శ్వాస ప్రక్రియ అవుతుంది. ఇది మనము లోపలకు పీల్చుకునే గాలి, నీరు, ఆహారముల కలయిక అవుతుంది.
  2. అపానము అనేది మనము బయటకు వదిలే గాలి, విసర్జనలు అవుతాయి. 
  3. వ్యానము అనేది రక్త ప్రసరణ ద్వారా శరీరములోని అవయవాలకూ, కణాలకూ అందింపబడునది. 
  4. ఉదాన వాయువు అంటే ఎక్కిళ్ళు, డోకులు, వాంతులు ద్వారా మరియు మరణ సమయములో బయటకు వెలువడే ద్రవాలు, వాయువు. భౌతిక శరీరాన్నే కాకుండా సూక్ష్మ శరీరాన్ని కూడా కదిలించే శక్తి ఇది. ప్రాణము బయటకు పోయే ప్రక్రియ. 
  5. సమానము అంటే జీర్ణ ప్రక్రియకు తోడుపడుతూ మొత్తము జీర్ణ రసమును శరీరమంతటా సమానముగా పంచిపెట్టుటకు సహకరించేది. 

ప్రాణాయామము చేయు విధానము 

  • తిన్నగా నేలపై కూర్చోవాలి. 
  • శిరస్సు, మెడ, వెన్నెముక ఒకే సరళ రేఖలో ఉండేలా మఠము వేసుకుని కూర్చోవాలి. 
  • ఇప్పుడు లోపల ఉన్న గాలినంతా రెండు ముక్కు రంధ్రాల ద్వారా గట్టిగా బయటకు వదిలెయ్యండి. కొన్ని సెకన్లు గాలి పీల్చకుండా ఆగాలి. 
  • ఇప్పుడు ముక్కు యొక్క ఎడమ రంధ్రాన్ని ఎడమ చేతి బొటన వేలితో కప్పి  కుడి రంధ్రము ద్వారా గట్టిగా గాలి పీల్చండి. 
  • శ్వాసను వదలకుండా పట్టుకోండి కొన్ని సెకన్ల దాకా. 
  • ఇప్పుడు శ్వాసను మెల్లగా ఎడమ రంధ్రము ద్వారా వదలండి. 
  • పై ప్రక్రియ అనులోమ ప్రాణాయామము అయ్యింది. 
  • ఇప్పుడు విలోమ ప్రాణాయామము లో మళ్లీ శ్వాసను పట్టుకోండి. అంటే గాలి పీల్చడము కానీ వదలడము కానీ చేయకూడదు కొన్ని సెకన్ల దాకా. 
  • ముక్కు యొక్క కుడి రంధ్రమును కుడి చేతి బొటన వేలితో నొక్కి పట్టుకుని ఎడమ రంధ్రము ద్వారా గాలి పీల్చండి.
  • శ్వాసను పట్టుకోండి కొన్ని సెకన్ల దాకా. 
  • ఇప్పుడు శ్వాసను మెల్లగా కుడి రంధ్రము ద్వారా బయటకు వదలండి. 
  • కొన్ని సెకన్లు మళ్ళి శ్వాసను పట్టుకోండి. అంటే గాలి పీల్చడము, వదలడము చెయ్యకుండా ఉండాలి. 
  • ఇది విలోమ ప్రక్రియ అయ్యింది. 
పైన చెప్పబడిన విధముగా అనులోమ, విలోమ ప్రక్రియలు రెంటినీ కలిపి ప్రాణాయామము అంటారు. 

ఈ ప్రకారము మీరు ఒక 5 సార్లు కానీ 10, 11 సార్లు కానీ మీ తాహతును బట్టి ప్రతీ పూట, లేదా రోజుకి ఒక్క సారైనా చేస్తుంటే ఆరోగ్యము మానసికము గాను శారీరకము గాను అభివృద్ధి చెందుతుంది.     

30, ఏప్రిల్ 2025, బుధవారం

గాయత్రీ మంత్రము అర్థములతో సహా - Gayatri Mantra Full Meanings


గాయత్రీ మంత్రము ఋగ్వేదము లోని ఒక సూక్తము (3.62. 10). 3వ మండలము, 62వ సూక్తము లోని 10వ శ్లోకము (మంత్రము) ఇది. 
    
ఇది చాలా పవిత్రమైన మంత్రము. పేరుకి ఒక గాయత్రీ మంత్రమే అనుకుంటాము కానీ మొత్తం బ్రహ్మాండానికే బీజ మంత్రము లాంటిది ఇది. ప్రణవనాదముతో మొదలయి పూర్తి సృష్టి రహస్యాన్ని కొన్ని శబ్దములు, నామముల ద్వారా కీర్తిచే మంత్రము ఇది.  

సృష్టికర్త ఆ పరంధాముడు శ్రీమన్నారాయణ. ఆయనను శ్రీలక్ష్మీ సమేతముగా సూర్యనారాయణ లోని కేంద్ర బిందువు రూపములో ధ్యానిస్తూ ఈ మంత్ర పారాయణము చెయ్యాలి మనము. జపము 10 సార్లు చేయాలి అంటారు. నేను 11 సార్లు చేస్తున్నాను. మామూలుగా పూజ చేసుకునే ముందు ఈ గాయత్రీ జపము గావించి అప్పుడు పూజ చేసుకుంటున్నాను నేను. 

గాయత్రీ మంత్రము మరియు అర్థములు 


ఓం భూర్భువః  స్వః | 
ఓం తత్సవితుర్వరేణ్యం | 
భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ ||

ఓం = ఇది ప్రణవ నాదము, సమస్త సృష్టికి మూలాధారము. సృష్టి, స్థితి, లయలను సూచించు శక్తి యొక్క సంక్షిప్త రూపము. 

భూ: = భూ లోకము, భూ తత్త్వం, ప్రకృతి స్వరూపము, ప్రపంచము. 

భువః = భువర్లోకము, భూమికి స్వర్గానికి మధ్య లోకము.  భౌతికతకి, ఆధ్యాత్మతకి సంబంధము చేకూర్చే శక్తి. 

స్వః అంటే సువః = స్వర్గ లోకము, దివ్యలోకము, పరమత్వము. 

తత్ = అది, ఆ యొక్క, ఆ పరమాత్మ యొక్క రూపము.  

సవితు = సూర్యుని తేజస్సు, దివ్య రూపము. 

వరేణ్యం = ఉత్తమమైనది, పూజనీయమైనది. 

భర్గః  = పవిత్రమైనది, దివ్యజ్ఞానమయము. 

దేవస్య = ఆ దేవుని, ఆ పరమాత్మను.  

ధీమహి = ధ్యానించుదాము 

ధియహ్ = జ్ఞానములు, దివ్య జ్ఞానములు. 

యః = ఆయన, ఆ పరమాత్మ. 

నః = నాకు 

ప్రచోదయాత్ = ప్రేరేపించును, అనుగ్రహించు గాక. 


పై మంత్రము యొక్క సంపూర్ణ భావము;

ముల్లోకములకు తన దివ్య తేజస్సుతో ప్రకాశమును, వెలుగును ప్రసాదించు ఆ సూర్య దేవుని యొక్క ( ఇక్కడ మనము పరమాత్మ అని భావించుకోవాలి) దివ్య స్వరూపము ఉత్తమమైనది, పవిత్రమైనది, జ్ఞానవంతమైనది. ఆ పరమాత్మను మనము ధ్యానిస్తే ఆయన మనకు మంచి బుద్ధి, దివ్యజ్ఞానము ప్రసాదించి, మనలను ఉత్తమ మార్గము వైపు ప్రేరేపించుచు మనలను అనుగ్రహించును. 

మనము సూర్యుని వైపు ముఖముగా కూర్చుని కానీ నిలబడి కానీ ఈ గాయత్రీమంత్ర పారాయణము చేస్తూ సూర్యుని తేజస్సు లోపల కేంద్రబిందువు అయిన ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ధ్యానించాలి.           
  


గాయత్రీమంత్ర జపము సంధ్యావందనము లోని ఒక ముఖ్యమైన అంశము. 

సంధ్యావందనము అంటే సూర్య నమస్కారము, ప్రాణాయామము, మరియు గాయత్రీ జపములతో కూడిన ఒక విస్తారమైన ప్రక్రియ. 

ఉపనయనము అయిన ప్రతీ పురుషుడు, ముఖ్యముగా బ్రాహ్మణులు ప్రతిరోజూ పాటించాల్సిన కార్యక్రమము ఇది. ఇందులో 11 విధులు (అంటే stages) ఉన్నాయి. 

ఈ సంధ్యావందనము ఏ విధముగా చెయ్యాలో విస్తారముగా తెలుసుకోవాలంటే ఈ లింకును క్లిక్ చేసి చదువుకోగలరు. ఇది ఇంగ్లీష్ భాషలో ఉన్నది. 

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము - Lakshmi Ashtottara Shatanaama Stotram Lyrics With Meanings


శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము  అన్నది శివ పరమాత్మ పార్వతిదేవికి తెలియజేస్తున్నట్లుగా మన పురాణముల ప్రకారము తెలుస్తోంది. 

లక్ష్మీదేవిని కీర్తిస్తూ 108 నామాల స్తోత్రములతో పూజించిన వారికి అన్ని శుభాలు కలుగజేయడం కోసమని పార్వతీదేవి ఆ శివపరమాత్మ ద్వారా మనకు ఈ వరాన్ని ప్రసాదించింది.   

పార్వతీదేవి చాలా దయామయురాలు. ఆమె తన భక్తులకు ఎప్పుడు ఏ విధముగా సాయపడుతూ ఉందామా అని తపన పడుతూ ఉంటుంది. 

ఒకసారి భక్తులు అష్ట కష్టాలూ పడుతూ పరితపించి పోతుంటే ఆమె తట్టుకోలేక శివుని జేరి తన భక్తుల కష్టాలు తీరి, సుఖ సౌభాగ్యాలతో బతికి మోక్షము పొందటానికి ఏదైనా సులువైన మంత్రము చెప్పమని శివుని అడిగింది. 

కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా వెయ్యి నామాలు భక్తులు ఎలా చదవగలుగుతారు. కాస్త సులువైన మార్గం చెప్పమని కోరితే, అప్పుడు శివ పరమాత్మ రామతారక మంత్రాన్ని తెలియజేశాడు. 

"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ... " అంటూ మూడు సార్లు రామ నామాన్ని జపిస్తే చాలు సహస్రనామాలు చదివిన పుణ్యం దక్కి భక్తులు మోక్షం పొందుతారు అని శివుడు వరమిచ్చెను. 

అల్లాగే ఈ సారి మనమంతా సుఖ, సౌభాగ్యాలతో ఉండటం కోసమని లక్ష్మీదేవి కటాక్షము పొందటానికి "శ్రీ లక్ష్మీ శతనామ స్తోత్రము" తెలియజేయమని కోరుతుంది. అప్పుడు శివుడు ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పార్వతీదేవికి ఫలశృతి తో సహా తెలియజేస్తాడు.    

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము 


లక్ష్మీదేవి వందనం, ప్రపత్తి 

శ్రీ భగవన్నారాయణాభి  మతానురూప, స్వరూప రూప, గుణవిభవ, ఐశ్వర్య, శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ గణాం, పద్మ వనాలయాం, భగవతీమ్, శ్రియం దేవీమ్, నిత్యానుపాయినీమ్, నిరవద్యామ్, దేవదేవ దివ్య మహిషీమ్, అఖిల జగన్మాతరం, అస్మన్ మాతరం, అశరణ్య శరణ్యామ్, అనన్య శరణః, శరణ మహం ప్రపద్యే ||        

అర్థము:-

శ్రీమన్నారాయణ అభిరుచులకు సరితూగు విధముగా స్వరూపము, అందమైన రూపము, సకల గుణ సంపదలు, ఐశ్వర్యము, శీలము మొదలగు అనేకములైన, మిక్కిలి సంపన్నమైన అత్యధిక కళ్యాణ గుణములు కలిగి, పద్మములో నివాసముండు భగవతి శ్రీ లక్ష్మీదేవీ! నిత్యమూ సేవించతగిన తల్లి (లేదా నిత్యమూ మహావిష్ణువుకు సేవ చేయునది), ఎటువంటి దోషములు లేనిది, ఆ దేవదేవునికి పట్టపు రాణి, అఖిల జగములకు తల్లి, నాకు తల్లివి, శరణు కోరని వారికి కూడా శరణము ఇచ్చే దేవీ, నాకు వేరెవ్వరు దిక్కు కారు, నీవే నాకు దిక్కు. తల్లీ! నిన్నే శరణు వేడుకుంటున్నాను. 

ఉపోద్ఘాతము 

దేవి ఉవాచ (పార్వతీదేవి అంటోంది)

దేవదేవ మహాదేవ, త్రికాలఙ్ఞ, మహేశ్వర, కరుణాకర, దేవేశ, భక్తానుగ్రహ కారక ! 
అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || 

అర్థము:-

దేవుళ్ళకే దేవుడవు, మహాదేవుడవు, అయినటువంటి ఓ మహేశ్వరా! ఓ కరుణామయా, భక్తులకు అనుగ్రహము పొందటానికి కారకుడవైన ఓ దేవేశ్వరా! శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ కీర్తన తత్త్వార్థములతో సహా వినాలని ఉంది. 


ఈశ్వర ఉవాచ ( అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు)

దేవి! సాధు ! మహాభాగే! మహాభాగ్య ప్రదాయకం, సర్వైశ్వర్య కరమ్ పుణ్యమ్ , సర్వ పాప ప్రణాశనమ్ | సర్వ దారిద్య్ర శమనం, శ్రవణాత్ భుక్తి ముక్తిదమ్, రాజవశ్యకరం దివ్యమ్, గుహ్యాత్ 
గుహ్యతరం పరమ్ | దుర్లభం సర్వ దేవానాం, చతుహ్ షష్టి కళాస్పదమ్ ||
పద్మాదీనాం వరాంతానాం, నిధీనాం నిత్య దాయకమ్ | 
సమస్త దేవ సంసేవ్యం, అణిమాద్యష్ట సిద్ధిదమ్ || 
కిమత్ర బహునోక్తేన, దేవీ ప్రత్యక్ష దాయకమ్ | తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహిత మనాః శృణు ||
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా | క్లిమ్ బీజపద మిత్యుక్తమ్ శక్తిస్తు భువనేశ్వరీ || 
అంగన్యాస కరన్యాస స ఇత్యాదిహి ప్రకీర్తితః ||

అర్థము:-

దేవీ, చాలా మంచిది. నా మహాభాగ్యము (లేదా నీవెంతో మహాభాగ్యవంతురాలివి). 

మహాభాగ్యాన్ని ప్రసాదించేది, అన్ని ఐశ్వర్యములలో కెల్లా పుణ్యప్రదమైనది, సకల పాపాలను పోగొట్టేది, సమస్త దరిద్రాలను తొలగించేది, విన్నవారికి భుక్తిని, ముక్తిని ప్రసాదించేది, దివ్యమైన  రాజయోగము కలింగించేది, ఎంతగా ఆరా తీసినా అంతు చిక్కనిది, సకల దేవతలకు కూడ లభ్యమయ్యేది కానిది, 64 కళలను రూపొందించేది, అంతులేని సిరులు, వరములు, నిధులను ప్రసాదించేది, సమస్త దేవతల చేత సేవింపబడుతూ ఉంటూ అణిమ మొదలగు అష్ట సిద్ధులను ఒసగేది, కాస్తంత స్మరిస్తే చాలు వెంటనే ప్రత్యక్షమై కాపాడు ఆ తల్లిని నీ హృదయంలో ప్రేమతో నిలుపుకుని  ధ్యానపూర్వకంగా వినుము.
 
ఇప్పుడే నేను చెప్పబోయే ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాలని క్లిమ్ హ్రిమ్ శ్రిమ్ మున్నగు బీజపదములతో కూడిన శక్తి రూపురాలైన ఆ భువనేశ్వరీదేవిని అంగన్యాసము, కరన్యాసములతో సహా కీర్తించబోతున్నాము సుమా !     

లక్ష్మీ స్తుతి 


వందే పద్మకరాం ప్రసన్న వదనాం, సౌభాగ్యదాం, భాగ్యదామ్ 
హస్తాభ్యాం అభయప్రదాం, మణి గణైః నానావిధైహ్ భూషితామ్ | 
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం 
పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిః యుక్తామ్ సదా శక్తిభిః || 
సరసిజ నయనే, సరోజ హస్తే, ధవళతరాంశుక గంధమాల్యశోభే !
భగవతి, హరివల్లభే, మనోజ్ఞే ! త్రిభువన భూతికరి ! ప్రసీదమహ్యమ్ || 

అర్థము:-

చేతిలో పద్మాన్ని ధరించి, ప్రసన్న వదనము కలిగి, సౌభాగ్యము, భాగ్యములు అందిస్తూ, చేతితో అభయాన్ని ప్రసాదిస్తూ అనేక విధములైన మణులతో పొదగబడిన ఆభూషణములతో అలంకరింపబడిన దానివై, భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సేవింపబడుతూ, శంఖ చక్రములు పద్మము బంగారుకాసులతో నిండిన బిందెలు ధరించి, శక్తి స్వరూపిణి వైన నీకు నా వందనములు. 
ఓ కలువ రేకుల వంటి కన్నులదానా! పద్మములవంటి చేతులు కలదానా! తెల్లని మంచు బిందువులతో కూడిన సుగంధ పుష్ప మాలలతో అలంకరింప బడిన దానా! ఓ భగవతీదేవి, విష్ణువుకి ప్రియసఖీ! మా అందరి మనస్సులను ఎరిగినదానా ! ముల్లోకముల ప్రాణులకు పియ్రమైన తల్లీ ! నన్ను అన్నివేళలా కాపాడుమా !        

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము


ఇందులో 14 శ్లోకముల ద్వారా మొత్తం 108 నామాల కీర్తన చేయబడినది. 
ముందుగా శ్లోకాలను అన్నింటినీ తెలియజేసి, అటు పిమ్మట ఒక్కొక్క శ్లోకం లోని నామార్థములను తెలియజేస్తాను.  

ఓమ్ 

ప్రకృతిం వికృతిం విద్యామ్ సర్వభూత హితప్రదామ్ | 
శ్రద్దాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ || (1)

వాచం పద్మాలయాం పద్మామ్ శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
ధన్యాం హిరణ్మయీమ్ లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ || (2)

అదితిం చ దితిం దీప్తామ్ వసుధామ్ వసుధారిణీమ్ | 
నమామి కమలాం కాంతామ్ క్షమాం క్షీరోద సంభవామ్ || (3)

అనుగ్రహప్రదాం, బుద్ధిం, అనఘాం హరివల్లభామ్ | 
అశోకామ్ అమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్ || (4)

నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరమ్ | 
పద్మ ప్రియాం పద్మ హస్తాం పద్మాక్ష్మీం పద్మ సుందరీమ్ || (5)

పద్మోద్భవామ్ పద్మ ముఖీమ్ పద్మనాభ ప్రియాం రమామ్ | 
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మ గంధినీమ్ || (6)

పుణ్య గంధామ్ సుప్రసన్నాం ప్రసాదాభిముఖీమ్ ప్రభామ్ | 
నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీమ్ || (7)

చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామ్ ఇందుశీతలామ్ | 
ఆహ్లాద జననీం పుష్టిం శివామ్ శివకరీం సతీమ్ || (8)

విమలాం విశ్వజననీం తుష్టిమ్ దారిద్య్ర నాశినీమ్ | 
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్ల మాల్యామ్బరామ్ శ్రియమ్ || (9)

భాస్కరీం బిల్వ నిలయాం వరారోహాం యశస్వినీమ్ | 
వసుంధరాం ఉదారాంగామ్ హరిణీం హేమ మాలినీమ్ || (10)

ధన ధాన్య కరీం సిద్ధిమ్ స్త్రైణసౌమ్యాం శుభ ప్రదామ్ | 
నృపవేశ్మ గతానందాం వరలక్ష్మీమ్ వసు ప్రదామ్ || (11)

శుభామ్ హిరణ్య ప్రాకారామ్ సముద్రతనయాం జయామ్ | 
నమామి మంగళామ్ దేవీమ్ విష్ణు వక్షస్థల స్థితామ్ || (12)

విష్ణుపత్నీం ప్రసన్నాక్షీమ్ నారాయణ సమాశ్రితామ్ | 
దారిద్య్ర ధ్వంసినీమ్ దేవీం సర్వోపద్రవ వారిణీమ్ || (13) 

నవదుర్గామ్, మహాకాళీమ్, బ్రహ్మవిష్ణు శివాత్మికామ్ | 
త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్ || (14)


అర్థములు:- 

మొదటి శ్లోకము: 
 లక్ష్మీదేవి సహజమైన ప్రకృతి స్వరూపిణి , (అనేక రంగుల రూపముల మార్పులతో  గోచరమగు) కల్పిత జగత్తు రూపిణి , విద్యారూపిణి, సర్వ ప్రాణుల మంచి కోరే దేవి, శ్రద్ధా స్వరూపిణి, సర్వవ్యాపిని, దేవతా దేవి, అందరి ఆత్మలందు నివసించు ఆ దేవికి వందనములు. 

రెండవ శ్లోకము:
తీయని పలుకుల (ప్రసాదించే) దేవి, పద్మములో నివసించునది, పద్మము వంటిది, శుచి (పవిత్ర) స్వరూపమైనది, ముల్లోకములకు శుభాలు కలిగించునది, అశుభములు తొలగించునది, అమృత రూపిణి, ధన్యురాలు, బంగారు వన్నెల అందచందములు కలిగినది, సిరిసంపదల తల్లి, సర్వదా బలపుష్టితో వర్ధిల్లునది, తేజస్సుతో ప్రకాశించునది. 

మూడవ శ్లోకము:
ఎటువంటి సరిహద్దులు లేనిది (సర్వత్రా ఉండునది), తన హద్దులలోనే ఉండే దేవి, సర్వత్రా వెలుగొందే జ్యోతి రూపిణి, భూ దేవి, భూమిని ధరించే దేవి, నమస్సులు ఓ తల్లీ, కమలము వంటిదానా, విష్ణుమూర్తి భాగస్వామిని, క్షమాగుణ స్వరూపిణీ, పాలకడలి నుండి పుట్టిన తల్లీ !

నాలుగవ శ్లోకము:
అందరినీ అనుగ్రహించునది, బుద్ధి స్వరూపిణి, దోషములు, మచ్చలు లేనిది, శ్రీహరి ప్రియసఖి, శోకములు లేనిది, అమృతమయి, అందరికీ దీపము వంటిది (వెలుగుల తల్లి), లోకముల లోని శోకములను నిర్మూలించునది. 

ఐదవ శ్లోకము:
ఓ ధర్మానికి ఉనికి పట్టువైన దేవీ ! నీకు నా నమస్సులు. 
కరుణామయి, లోకాలకు తల్లి, పద్మములంటే మక్కువ కలిగినది, పద్మాన్ని తన చేతిలో దాల్చినది, పద్మముల వంటి కన్నులు కలది, పద్మము వలె అందమైన దేవి.  

ఆరవ శ్లోకము:
పద్మమునుండి పుట్టిన దేవి, పద్మములాంటి ముఖారవిందము కలది, పద్మనాభుడైన విష్ణుమూర్తి ప్రియసఖి, రమాదేవి (విష్ణుమూర్తిని రమించునది), పద్మముల మాలలు ధరించినది, పద్మినీ దేవి (పద్మమువలె అందము, సుకుమారత్వము కలది), పద్మగంధములతో అలరించే లక్ష్మీదేవి. 

ఏడవ శ్లోకము:
పుణ్యములు వెదజల్లునది (ఆవిడ ఉన్నచోట అంతా పుణ్యమే పుణ్యము), ఇంపైన ప్రసన్నత నిచ్చు దేవి, ప్రసాదములు అంటే ఇంపైన వరములను ప్రసాదించు దేవి, జ్యోతి స్వరూపిణి. చంద్ర వదనము కల తల్లి, చంద్రుని వంటి చల్లని, వెన్నెలా దేవి, చంద్రునికి సోదరి (లక్ష్మీదేవి లాగే చంద్రుడు కూడ సముద్రము నుండి పుట్టాడు).  

ఎనిమిదవ శ్లోకము:
చతుర్భుజములు (నాలుగు చేతులు) కలది, చంద్ర రూపిణి, ఇందిర అంటే ప్రకాశము (తేజస్సు, దేదీప్యమాన అందచందములతో వెలుగొందే దేవి), ఇందు శీతల అంటే చల్లని వెలుగుల తల్లి, ఆహ్లాదము కలిగించునది, పుష్టి అంటే ఆరోగ్య ప్రదాయిని, శివమ్ అంటే బ్రహ్మానందము కలిగించునది, శివకరి అంటే మంచి ఆనందకరమైన హాయిని ప్రసాదించునది, సతి అంటే స్త్రీలలో అందరి కంటె ఉత్తమురాలు.

తొమ్మిదవ శ్లోకము:
విమల అంటే శుచి అయిన పవిత్రతా దేవి, సమస్త సృష్టి కి తల్లి, తుష్టి అంటే సంతృప్తి ప్రసాదించునది, దారిద్య్రము పోగొట్టు దేవి, ప్రీతికి ఒక పుష్కరిణి లాంటిది, శాంతి స్వరూపిణి, తెల్లని మాలలు, బట్టలు ధరించునది, ఆమె శ్రీని కలిగించు లక్ష్మీదేవి. 

పదవ శ్లోకము:
భాస్కరి అంటే తేజస్సు ప్రసాదించునది, బిల్వ వృక్షము క్రింద కానీ బిల్వ పత్రమందు కానీ నివసించునది, అపారమైన వరములను ఇచ్చే దేవి, యశస్సు కలిగించునది, వసుంధర అంటే భూమికి తల్లి, ఉదార హృదయము కలది, హరిణి అంటే మన హృదయాన్ని ఆకర్షించునది, బంగారు ఆభరణములు ధరించునది. 

పదునొకండవ శ్లోకము:
ధనధాన్యములను ఇచ్చునది, అష్ట సిద్ధులను ప్రసాదించునది, స్త్రీలపట్ల మెత్తని స్వభావము, దయ కలిగినది, శుభములను ప్రసాదించునది, భవ్య భవనములలో చరిస్తూ ఆనందముతో ఉండునది (నృప అంటే రాచరికం, వేశ్వము అంటే గూడు లేదా నివాస స్థలము), వరముల నొసగే తల్లి, (వసు)ఐశ్వర్యముల నొసగే దేవి.    

పన్నెండవ శ్లోకము:
శుభము కలిగించునది, బంగారు ప్రాకారములతో గూడిన నివాసము కలది, సముద్రుని పుత్రిక, జయముల నొసగునది, మంగళము కలిగించునది, దేవతలకే దేవేరి, విష్ణువు యొక్క వక్షస్థలములో నివసించునది.

పదమూడవ శ్లోకము:
విష్ణుపత్ని, ప్రసన్నమైన కనులు కలిగి ప్రసన్నత నిచ్చునది, నారాయణుని (విష్ణుమూర్తిని) ఆశ్రయించిన దేవి, దారిద్య్రం నశింపజేయు దేవి, సమస్త ఉపద్రవములు ఆపదలను తొలగించునది. 

పద్నాల్గవ శ్లోకము:
నవదుర్గ అంటే తొమ్మిది విధములైన దుర్గాదేవుల రూపములు గలది, మహంకాళి, బ్రహ్మ, విష్ణువు, మరియు శివుల ఆత్మలందు ఉండేది, త్రికాలముల జ్ఞానము క్షుణ్ణముగా ఎరిగినది, అటువంటి ఓ  భువనేశ్వరీదేవీ! నీకు నా నమస్సులు. 


ఇక్కడితో 108 నామముల లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు పూర్తి అయ్యాయి. దీని తరువాత రెండు స్తోత్రాలు ప్రతీ రోజూ చదువుకో దగినవి ఉన్నాయి. అవి చదివి, ఆ తరువాత ఫలశ్రుతి చదవాలి. 

రెండు లక్ష్మీ స్తోత్రములు 


లక్ష్మీమ్, క్షీరసముద్ర రాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం 
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్ 
శ్రీమన్ మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం 
త్వామ్ త్రైలోక్య కుటుంబినీమ్, సరసిజాం, వన్డే ముకుందప్రియామ్ || 

మాతర్నమామి, కమలే ! కమలాయతాక్షీ !
శ్రీవిష్ణు హృత్కమల వాసిని, విశ్వమాతా !
క్షీరోదజే ! కమల కోమల గర్భగౌరి !
లక్ష్మీ ! ప్రసీద సతతం, నమతాం శరణ్యే !

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర ఫలశ్రుతి 


త్రికాలం యో జపేత్ విద్వాన్, షణ్మాసం, విజితేంద్రియ,
దారిద్య్ర ధ్వంసనం కృత్వా సర్వ మాప్నోత్య యత్నతః || 

అర్థము:

మూడు కాలాలు (అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము) ప్రతిరోజూ 6 నెలల పాటు శ్రద్దతోను, ఇంద్రియాలను కట్టడిలో ఉంచుకుని కనుక చదివితే దారిద్య్రము నశించి, ఏ కార్యము చేపట్టినా చక్కగా సాధించుకో గలుగుతారు. 


దేవీనామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతమ్ 
యేన శ్రియ మవాప్నోతి కోటి జన్మ దరిద్రతః || 
     
అర్థము:

దేవీ నామాలలో సహస్రనామాలన్నింటి కంటే ఈ 108 నామాలు పుణ్యప్రదమైనవి. వీటి ద్వారా కోటి జన్మల దరిద్రత కూడా తీరిపోయి ధనవంతులు అవుతారు. 


భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సర మాత్రకమ్ 
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలః || 

అర్థము:

భృగు వారము అంటే శుక్రవారము. ప్రతి శుక్రవారమూ ధీమాగా పట్టుదలగా మొత్తం ఏడాది అంతా నిష్టగా చదివితే అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఈ భూమిలోనే కుబేరులు అవుతారు. 

ఎనిమిది రకముల ఐశ్వర్యములు: ధనము, సంతోషము, సౌభాగ్యము, ఆరోగ్యము, సంతానము, పారివారిక సుఖము, మిత్ర సుఖము, విద్య ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. 


దారిద్య్ర మోచనం నామ స్తోత్రం అంబాపరం శతమ్ 
యేన శ్రియ మవాప్నోతి కోటి జన్మ దరిద్రతః || 

అర్థము:

లక్ష్మీమాత యొక్క ఈ శతనామములు దారిద్రత నుండి విమోచన పొందటానికి కనుక చదివితే కోటి జన్మల దరిద్రతా తీరిపోయి భాగ్యవంతులు అవుతారు. శ్రేయస్సును కూడ పొందుతారు. 


భుక్త్వాతు విపులాన్ భోగా నంతే సాయుజ్య మాప్నుయాత్ 
ప్రాతః కాలే పఠేత్ నిత్యం సర్వదుఃఖోప శాంతయే || 

అర్థము:

హాయిగా జీవించినంత కాలము భోగాలను అనుభవించి, అంత్య కాలములో మోక్షాన్ని పొందుతారు. ప్రతిదినము తెల్లవారు ఝామునే చదువుతూ ఉంటే అన్ని దుఃఖములు సమసిపోయి హాయిగా బతుకుతారు. 


పఠంస్తు చింతయేత్ దేవీమ్ సర్వాభరణ భూషితామ్ ||  

కాబట్టి మనము ఆ సర్వాభరణములతో అలంకరింపబడిన లక్ష్మీదేవిని స్మరిద్దాము, పఠనము చేస్తూ పూజించుకుందాము.