మన తెలుగు నూతన సంవత్సర దినము జరుపుకునే రోజుని ఉగాది పండుగ అని అంటాము. ఈ రోజునే కర్నాటక ప్రజలు యుగాదిగా జరుపుకుంటారు. మహారాష్ట్రీయులేమో గుడి పర్వ దినముగా జరుపుకుంటారు.
ఉగాది పండుగని ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము.
ఉగ అనే పదము యుగము అనే మాట నుండి వచ్చింది. యుగము అంటే ఒక తరము లేదా నాలుగు యుగాల లోని యుగము అయినా అనుకోవచ్చును. కానీ ఉగాది పండుగకు సంబంధించినంత వరకు మన తెలుగు క్యాలెండర్ కాలమానము 60 సంవత్సరాలు ఒక యుగము అనుకోవచ్చును , లేదా అందులోని ప్రతి ఒక్క సంవత్సరము ఉగము అనవచ్చును. ఆ విధంగా చూస్తే 60 సంవత్సరముల చక్రములో మొదటి రోజు కానీ, ప్రతీ సంవత్సరము యొక్క మొదటి రోజు కానీ ఉగాది అవుతుంది.
మన క్యాలెండర్ 60 సంవత్సరాలలో ప్రతీ దానికి ఒక్కొక్క పేరు ఉంది. 60 ఏళ్ళు పూర్తి అయితే మళ్ళీ అవే పేర్లు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఈ విధంగా చూసినట్లు అయితే ఒక అరవై ఏళ్ల కాలంలో ప్రతీ సంవత్సరము పేరు ఒక్క సారి మాత్రమే వస్తోంది. అంటేప్రతీ అరవై ఏళ్ళకి ఒకే పేరు ఉండే సంవత్సరాన్ని మనము పండుగ లాగా జరుపుకుని ఆనందిస్తున్నాము కనుక అరవై రకాల ఉగాదులు మనము జరుపుకుంటున్నట్లు అవుతోంది ఒక కాలమానములో. అందుకనే ఈ పండుగలని ఉగాది పండుగ అని పిలుచుకుంటున్నాము.
ఈ ఉగాది రోజున శుభ్రముగా తల అంటుకుని స్నానము చేసి మంచి బట్టలు (కొత్తవి కానీ, ఉతికి ఆరేసుకున్నవి కానీ కట్టుకుని పూజ చేసుకుంటాము. ఇల్లు, వాకిలీ స్నానానికి ముందుగానే శుభ్రము చేసుకుని ముగ్గులతోను తోరణాలతోను అలంకరించుకుంటాము. వీధి గుమ్మాలకి మామిడాకులు, పూలదండలు కట్టుకుంటాము. దేవుని పూజా స్థలాన్ని కూడా ముగ్గులతో, తోరణాలతో అలంకరించు కోవచ్చును .
ఈ పండుగ విశేషము ఏమిటంటే మనము ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకుని దేవునికి ఆరగింపు పెట్టి ముందుగా ఆ పచ్చడిని తిన్న తరువాతనే ఇంక ఏమైనా తినాలి.
పచ్చడి తయారు చేసుకుని పూజ చేసుకుంటాము. పూజ జరిగేటప్పుడు ఇంటిల్లిపాదీ కూర్చుని చేసుకుంటే బాగుంటుంది. ఆ తరువాత ఉగాది పచ్చడి ఆరగింపు పెట్టాలి. దానితో పాటు ఇంకా ఏవైనా పదార్థములు (పులిహోర, పాయసము, అరటిపళ్ళు వంటివి) ఆరగింపు పెట్టుకోవచ్చును ఓపికను బట్టి. అప్పుడు తీర్థ ప్రసాదములు గ్రహించాలి.
రోజంతా సరదాగా గడుపుకుని, గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్లి వస్తారు. అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణము కూడా ఉంటుంది సాయంత్రం పూట. ఆ ఏడాది లోని గ్రహదశలు, లాభనష్టాలు వంటివి తెలియజేస్తారు.
ఉగాది పచ్చడి - ఆరు రుచులు - ఆరు మానసిక ఉద్వేగాలు
మన జీవితములో మనము అనుభవించే మానసిక పరిస్థితులు ముఖ్యంగా ఆరు రకాలుగా ఉంటాయి. అవి సంతోషము, దుఃఖము, కోపము, భయము, ఆశ్చర్యము, చికాకు లేదా అసహ్యము.
ఈ ఆరు మానసిక పరిస్థితులని బట్టి ఆరు రకాల రుచులు ఉంటాయి. అవే తీపి, కారము, చేదు, ఉప్పదనము, వగరు, పులుపు అనేవి.
ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు
- వేప పువ్వు (చేదు, దుఃఖము)
- మామిడికాయ (వగరు, ఆశ్చర్యము)
- బెల్లము (తీపి, సంతోషము)
- చింతపండు (పులుపు, సంఘర్షణలు)
- పచ్చి మిరపకాయ (కారము, కోపము)
- ఉప్పు (ఉప్పదనము, భయము)
ఉగాది పచ్చడి తయారుచేయు విధానము
- ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న పాత్రలో ఒక కప్పుడు నీళ్ళల్లో 25, 30 గ్రాముల చింతపండు వెయ్యాలి. 15, 20 నిమిషాలు నానబెట్టి, బాగా నలిపి పిప్పి తీసేసి ఉంచుకోవాలి.
- వేపపువ్వు రెమ్మల నుండి విడదీసి పెట్టుకోవాలి. ఈ పని రాత్రి పడుకునే ముందు చేసుకుని ఫ్రిడ్జిలో పెట్టుకుంటే సులువుగా ఉంటుంది. నలుగురు తినాలంటే ఒక చిన్న గరిటెడు పువ్వులు కలుపుకోవచ్చును.
- బెల్లము కోరేసుకుని ఒక చుక్క నీళ్ళల్లో నానబెడితే మంచిగా కలపడానికి వస్తుంది. మనకి కావాల్సిన తీపిని బట్టి ఇది కలపాలి.
- మామిడికాయ మధ్యరకం సైజుది తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి.
- పచ్చిమిరపకాయ ఒకటి చాలు. చాలా సన్నగా ముక్కలు చేసుకోవాలి.
- ఇప్పుడు పైన రెడీ చేసుకున్న సామాన్లు అన్నీ ఇంకో పాత్రలో మంచిగా కలిసేట్లా కలుపుకోవాలి.
- ఉప్పు అర స్పూన్ కానీ, ఇంకా తక్కువ కానీ వేసుకోవచ్చును.
- అన్ని వస్తువులు చక్కగా కలిసేట్లా అవసరమైతే కొన్ని నీళ్లు పోసి కలపాలి.
ఇప్పుడు మీ ఉగాది పచ్చడి రెడీ అయింది. దేవునికి ఆరగింపు పెట్టి చక్కగా అన్ని రుచులూ అనుభవిస్తూ సేవించండి.
ఇలా అన్ని రుచులూ సంవత్సరము మొదటి రోజున అనుభవిస్తే ఆ ఏడాదిలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ అవలీలగా ఎదుర్కోగలుగుతారు అని మన పెద్దల నమ్మకము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి