![]() |
| శీఘ్రమేవ పుత్ర ప్రాప్తిరస్తు |
ఆశీర్వచనములు లేదా ఆశీర్వాదాలు, దీవెనలు అనేవి అనాది కాలము నుండి మన సంప్రదాయములలో ఒక ప్రముఖ స్థానం చేసుకున్నాయి. పెద్దవారు తమ బిడ్డల మంచిని కోరుకుంటూ ప్రతి రోజూ ఎదో ఒక ఆశీర్వచన పదాన్ని వాడుతూ ఉంటారు. కుంటుంబ సభ్యులకే కాక చుట్టుపక్కల వారికి కూడ ఇవి వాడుతుంటారు. ఇంతే కాదు. అన్ని శుభకార్యాలలో పురోహితులు వీటిని ఆయా కుటుంబ సభ్యులను దీవించడానికి వాడుతుంటారు.
మచ్చుకి ఈ దీవెనలని గమనించండి:
1). పిల్లలు "హాచ్" మని తుమ్మగానే అమ్మ నాన్నలు కాని, తాత నాన్నమ్మలు కాని వెంటనే "చిరంజీవీ భవ" అనో "చిరంజీవ" అనో అనేస్తారు ఒక్క క్షణము కూడా ఆగకుండా.
2). అలాగే అన్నము తింటున్నప్పుడు డెక్కు పట్టుకుంటే (అంటే ఎక్కిళ్ళు పట్టుకుంటే) తలమీద మెల్లిగా కొడుతూ "వాతాపి జీర్ణం" అంటారు. తిన్న తిండి కక్కెయ్యకుండా అరగటము కోసమని అలా చేస్తారు. ఇది కూడ ఒక ఆశీర్వాదము లాంటిదే.
3). అలాగే ఎవరైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు పెద్దలు "క్షేమంగా వెళ్ళి లాభంగా రా" అని దీవిస్తారు.
ఇప్పుడు నేను పైన చెప్పినవి కాకుండా ఇంకొన్ని ముఖ్యమైన, బాగా చలామణిలో ఉన్న ఆశీర్వచనములను, వాటి అర్థములతో సహా తెలియజేస్తున్నాను.
నిత్యమూ వాడుకలో ఉన్న ఆశీర్వచన పదములు
- చిరంజీవీ భవ: రోజూ పిల్లలను, లేదా మనకంటే చిన్నవారిని దీవించుకోడానికి మన తల్లితండ్రులు, పెద్దలు దీన్ని వాడుతుంటారు. ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు పెద్దలకు నమస్కరిస్తే వారు చిరంజీవి భవ అని అంటారు.
- సుఖీభవ: ఇది కూడ చిరంజీవీభవ లాగానే పెద్దలు చిన్నవారిని దీవించడానికి పలుకుతూ ఉంటారు.
- ఆయుష్మాన్ భవ: దీర్గాయుస్సు కలిగి ఉందువు గాక, లేదా చిరకాలము జీవించెదవు గాక అనే అర్థములో ఈ ఆశీర్వచనాన్ని వాడుతారు.
- విజయీభవ: విజయాన్ని పొందుతావు అని దీవించడానికి ఈ ఆశీర్వాదాన్ని వాడుతారు. విజయము అంటే గెలుపు అని కాని, సాధించగలగడం కాని కావచ్చును. ఏదైనా పని మొదలు పెడుతూ పెద్దల ఆశీర్వాదము పొందటానికి ఇది వాడుకుంటున్నాము. పరీక్షలలో ఉత్తీర్ణత పొందటానికి, ఇంటర్వ్యూలో నెగ్గటానికి, ఉద్యోగములో ప్రవేశించే రోజు కాని, వ్యాపారములో గెలుపుకు కాని ఈ ఆశీర్వాదము వాడుతాము.
ఇప్పుడు స్త్రీలకు మాత్రము వాడే ఆశీర్వాదాలని చూద్దాము.
స్త్రీలకు వాడే ఆశీర్వాదములు
- సౌభాగ్యవతీ భవ: సౌభాగ్యము, మంగళకరము అయిన జీవనము గడిపెదవు గాక అని దీవించడము జరుగుతోంది దీని ద్వారా. పెళ్లీడు కొచ్చిన అమ్మాయిని కాని, పెళ్లి అయిపోయిన వారిని కాని వారి పెద్దలు దీవిస్తారు ఈ విధముగా.
- శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు: ఈ ఆశీర్వాదాన్ని ముఖ్యముగా తల్లితండ్రుల కంటే పెద్దలు ఎంతో ముద్దుగా తమ మనుమరాలిని, మేనకోడలుని దీవించడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా పెళ్లి సందర్భములో దీన్ని ఎక్కువగా పురోహితులు వాడటం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భములో ఇది పెళ్లికొడుకుకి, పెళ్ళికూతురికి కూడ వర్తిస్తుంది. ఇద్దరినీ వారి వారి పురోహితులు ఆశీర్వదిస్తారు, మరియు పెళ్లి పీటల మీద కూడా ఆశీర్వదిస్తారు.
- పుత్రవతీ భవ: పెళ్ళి అయిన స్త్రీలను ఆశీర్వదించే సమయములో ఆమెకు పుత్రుడు కలగాలని ఆశీర్వదిస్తారు. ఇది పురోహితుడు కానీ, ఆమె తల్లి కానీ, అత్తగారు కాని, ఇంకా పెద్ద స్త్రీలు కానీ ఉపయోగిస్తారు.
- శీఘ్రమేవ పుత్ర ప్రాప్తిరస్తు: ఈ ఆశీర్వచనం కూడ పుత్రవతీ భవ లాంటిదే. కాకపొతే కాస్త తొందరగా పిల్లలను కంటావు గాక అని ఆశీర్వదించడము జరుగుతోంది. దీన్ని స్త్రీలు, పురుషులు కూడ వాడుతారు. కొత్తగా పెళ్లి అయిన దంపతులకు ఇది తప్పనిసరిగా వాడుతారు. పుత్రవతి అన్న పదము కొడుకు పుట్టాలన్నా, కూతురు పుట్టాలని అయినా ఆశీర్వదిస్తున్నట్లుగా మనము భావించుకోవాలి.
- సుమంగళీభవః: స్త్రీలను ఆశీర్వదించే సమయములో "సౌభాగ్యవతీ భవ, సుమంగళీ భవ" అని ఆశీర్వదించడము చాలా మంచి అలవాటు. అంటే వారు భర్త, పిల్లలతో బాటుగా సుఖముగా ఉండాలని కోరుకుంటున్నాము అన్నమాట.
వివాహములందు పురోహితులు పలికే ఆశీర్వచనము
ఈ ఆశీర్వాదము మంచి పండితులైన పురోహితులు వాడే వారు. మరి ఇప్పుడు ఇలా ఆశీర్వదిస్తున్నారో, లేదో తెలియదు.
రోచనో రోచమానః, శోభనో శోభమానః, కళ్యాణః |
శతమానమ్ భవతి, శతాయుః, పురుషః శతేంద్రియః, ఆయుష్యే-వేంద్రియే ప్రతితిష్టతిః ||
అర్థము:
మంచి పేరు, ప్రతిష్టలతో వెలిగిపోతూ, దివ్య తేజస్సుతోను, ఉన్నతమైన కల్యాణ గుణములతోను ఉందురు గాక!
నూరేళ్ళ దీర్ఘాయుస్సుతో ఉందురు గాక, పురుషునికి నిండు నూరేళ్ళ జీవితము కూడ (శత+ఇంద్రియ) అన్ని ఇంద్రియములు ఆరోగ్యముతో పని చేస్తూ, నిండు నూరేళ్లు చక్కగా జీవించెదరు గాక!
