వేమన పద్యాలు కనీసం ఒకటో, రెండో మనము చిన్నప్పుడు స్కూళ్లల్లో చదువుకునే ఉంటాము. అందులో "ఉప్పు కప్పురంబు..." అన్నది చాలా ముఖ్యమైనది.
వేమన పద్యాలను కొన్నింటిని (కనీసము ఒక డజను పద్యాలను) అర్థములతో సహా నేను వివరిస్తాను. అంతకు ముందు కొద్దిగా వేమన గురించి, ఆ పద్యాలు ఏ సందర్భములో రాయబడినవో తెలియజేసి, తదుపరి పద్యాల జోలికి వెళదాము.
లోకానికి ప్రియుడవైన ఓ రాముడా (దేముడా)! ఓ వేమనా, ఇదయ్యా లోకం తీరు అని పద్యాలని రాసుకున్నాడు. శ్రీ రాముని బదులు శివుని ఉద్దేశిస్తున్నట్లుగా కూడ చెప్పుకోవచ్చును.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలనీ , అక్రమాలనీ , మనుష్యుల తత్త్వాలనీ పద్యాల ద్వారా మన కళ్ళకి కనబడేలా వివరించి చెప్పారు వేమన. ప్రతీ చిన్న విషయాన్ని కూడ అతి సూక్ష్మంగా పరిశీలించి మనకి అర్థము అయ్యేలా తెలియజేస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరించారు.
వేమన అసలు పేరు గోన వేమ బుద్ధా రెడ్డి. ఇతను కొండవీడు జమీందారుల వంశజుడు. సమాజం లోని అవినీతిని అక్రమాలను చూసి చాలా విరక్తి చెందిపోయి అన్నీ వదిలేసుకొని, ఒక యోగిలా వీధులలో తిరుగుతూ, పద్యాల ద్వారా అందరినీ పలుకరిస్తున్నట్లూ, హెచ్చరిస్తున్నట్లూ, ఎగతాళి చేస్తున్నట్లుగా అల్లా వాగుతుండేవారుట. వంటి మీద సరైన బట్ట కూడ ఉండేది కాదుట. అప్పుడు అందరూ ఇతనిని పిచ్చివాడిలా చూస్తూ వెంటబడేవారుట.
అతి కొద్దిమంది ఇతని మాటలలో విలువని గ్రహించి గుర్తించేవారుట. ఆ విధంగా ఈయన పద్యాలు గుర్తించబడి అవి వాడుకలోకి వచ్చాయి. చాలా మంది ఈ పద్యాలని సేకరించి పుస్తకరూపంలో ప్రచురించారు. అటువంటి వారిలో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అతి ప్రముఖుడు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ లో పనిచేసే ఒక అధికారి. అప్పట్లో కడప మరియు రాజమండ్రిలో పనిచేస్తూ మన తెలుగు భాషని అభివృద్ధి చేశారు. ఆయన చాలా కష్టపడి మన భాషకోసం పనిచేశారు. వేమన మరియు సుమతీ శతకాల పద్యాలు అన్నీ సేకరించి వాటిని ఇంగ్లీష్ లోకి కూడ అనువదించారు.
వేమన పద్యములు
ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ || (1)
అర్థము :-
ఉప్పు, కర్పూరము కూడ చూడటానికి ఒకేలా ఉంటాయి. అవి తిని చూస్తే కాని వాటికి ఉన్న తేడా తెలియదు. అలాగే మనుషులంతా ఒకేలా ఉంటారు. వాళ్ళతో కొన్ని రోజులు గడిపితే కాని వారిలో మంచి స్వభావము, మంచి గుణములు కలవారు ఎవ్వరో చెడు గుణముల వారు ఎవ్వరో మనకి తెలిసిరాదు.
ప్రతీ పద్యాన్ని "విశ్వదాభిరామ వినురవేమ" అని ముగించాడు వేమన. అంటే తనకు తానే నీతులు, సామెతలు చెప్పుకుంటున్నట్లుగా ఆ పద్యాలని అల్లాడు. అలాగే అందరికీ ప్రియమైన దేవుడు శ్రీ రాముని సంభోదిస్తున్నట్లుగా ఈ పద్యాలను చెప్పుకున్నాడన్నమాట.
ఓ దేముడా, ఇదయ్యా లోకం తీరు అని ప్రతీ పద్యాన్ని అల్లాడు.
అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ || (2)
అర్థము :-
అల్పుడు అంటే ఇక్కడ అజ్ఞాని అని, ఆకతాయి (అల్లరిచిల్లరి వాడు) అని, పొగరుబోతు అని, ఇలాంటివాళ్ళు ఎప్పుడూ గట్టిగా మాట్లాడుతూ తమ మాటే నెగ్గించుకోవడం కోసం చూస్తుంటారు. అదే సజ్జనుడు అంటే తెలివైన వాడు, మంచి స్వభావము కలవాడు చాలా నింపాదిగా అందరికీ నచ్చేవిధంగా మాట్లాడుతాడు. కంచు గిన్నెలు (ఇంగ్లీషులో బ్రాన్జ్) చాల బిగ్గరగా చెవులకి బాధాకరంగా, కర్కశంగా మోగుతాయి. కాని మంచి విలువైన బంగారమేమో చప్పుడు కాకుండా చక్కగా, ఇంపుగా మోగుతుంది. ఈ పద్యములో అల్పుడుని కంచుతో, సజ్జనుడిని బంగారంతో పోల్చాడు వేమన.
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపే కాని తెలుపు కాదు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా
విశ్వదాభిరామ వినుర వేమ || (3)
అర్థము :-
ఎలుక చర్మము నల్లగా ఉంటుంది. దాన్ని తెచ్చి ఒక ఏడాదిపాటు అదే పనిగా ఉతికినా అది నల్లగానే ఉంటుంది. అంతేకాని తెల్లబడదు. ఎందుకంటే దాని స్వభావము స్వతహాగా అలా చేశాడు దేముడు. అలాగే కొయ్యబొమ్మని తెచ్చి మాట్లాడు, మాట్లాడు అని ఎంత కొట్టినా అది పలుకలేదు కదా. ఇక్కడ వేమన మనిషి నైజాన్ని తెలియజేస్తున్నాడు. మనిషిలోని జీన్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి అతని స్వభావము ఉంటుంది. అది మారదు అని చెప్తున్నాడు.
మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మది బింక మీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ || (4)
అర్థము :-
మేడిపండు అంటే అంత సరిగ్గా తెలియదు నాకు. బహుశా అత్తిపండు అయినా అవచ్చు లేదా రేగి, నేరేడు పళ్ళలాంటివి అవచ్చును. వీటిలో ఏ పండైనా సరే అవి చూడటానికి బలే చక్కగా నున్నగా ఇంపుగా మెరుస్తూ ఉంటాయి. గబగబా తీసుకుని నోట్లో పడేసుకుందాము అనిపిస్తాయి. కానీ జాగ్రత్త ! అందులో పురుగులుంటాయి. చూసుకుని తినాలి విరగకొట్టి.
ఈ పద్యంలో వేమన మేడిపండుని పిరికివాడిని పోల్చి చెబుతున్నాడు. పిరికి వాడు మేడిపండు లాంటివాడని. పైనుంచి చూడటానికి పిరికివాడు, ధైర్యవంతుడు ఒకేలా ఉంటారు. కాబట్టి పరీక్షిస్తే కానీ తేడా తెలియదని. పిరికివానితో జాగ్రత్తగా ఉండాలని. అలాంటివాళ్ళు ఆఖరిక్షణంలో సాయానికి రారని. నా ఉద్దేశ్యము ఇక్కడ వేమన ఇంకోటి కూడ చెబుతున్నాడేమో! పిరికివాళ్ళు కుత్సితులు కూడ ఉండవచ్చునేమో అందుకని వేమన మనని హెచ్చరిస్తున్నాడేమో!
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ || (5)
అర్థము :-
గంగిగోవు పాలు అంటే మంచి శ్రేష్టమైన ఆవుపాలు ఒక గరిటెడు తాగినా చాలునని. ఖరము అంటే గాడిద. గాడిద పాలు ఒక కుండనిండా ఉన్నా అవి ఎందుకూ పనికిరావు. వాటిని తాగలేము, ఎందుకూ ఉపయోగించుకోలేము అని చెబుతున్నాడు వేమన. అదే విధముగా మంచి భక్తి, ప్రేమలతో పెట్టిన అన్నము ఒక ముద్ద తిన్నా చాలా తృప్తిగా ఉంటుంది. తిట్టుకుంటూ, అయిష్టంగా పెట్టే తిండి తినలేము కదా. తిన్నా అది సహించదు, అరగదు కూడ.
అనువు గాని చోట అధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల కొదవ కాదు
కొండ అద్దమందు కొంచెమై ఉండదా
విశ్వదాభిరామ వినుర వేమ || (6)
అర్థము :-
ఈ పద్యములో వేమన సమయ, సందర్భాలని బట్టి మసలుకోవాలి అని చెబుతున్నాడు. కొత్త ప్రదేశములో కెళ్ళి నేను గొప్పవాడినని చెప్పుకోకూడదు. అక్కడి మనుషులు ఎటువంటివారో, వారిలో ఎవరైనా గొప్పవాళ్ళు ఉండవచ్చును కూడ. అంతేకాక ఎవరో కొత్తవాడు వచ్చి నేను గొప్ప అంటే వాళ్లకి ఇష్టముండకపోవచ్చును. చితకబాది తరిమేయవచ్చును. అందుకని జాగ్రత్తగా తక్కువ వాడిలాగానే ప్రవర్తించాలి. తరువాత వాళ్లే గుర్తించి ప్రశంశిస్తారు. కొండ చాలా పెద్దది అయినప్పటికీ ఒక చిన్న అద్దములో దాని బొమ్మని చూస్తే ఎంత చిన్నదిగా కనిపిస్తోందో చూస్తున్నారు కదా. అలాగే నన్నమాట.
కొండ ఏంటో పెద్దదని మనకి తెలుసు. అలాగే కొత్త ప్రదేశంలో వాళ్ళు నీ గొప్పతనాన్ని మెల్లిగా గుర్తిస్తారు. నిజం నింపాదిగా తెలుస్తుంది.
పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులము కన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమ || (7)
అర్థము :-
పూజ కంటే బుద్ధి ముఖ్యమైనది. ఇక్కడ పూజ అంటే దేవుని పూజ అయినా కావచ్చు లేదా మనిషి పై గౌరవమైనా కావచ్చును. ఒట్టినే పుజించేసి లోలోపల నిజమైన భక్తి గౌరవాలు లేకుంటే లాభం లేదు. అలాగే పైపైన మంచిగా మాట్లాడుతూ ఆ మాటల పైన నిలకడ లేకపోతె ఆ మాటలకి ఎటువంటి విలువ ఉండదు. అదేవిధంగా గొప్ప కులములో పుట్టడము కంటే మంచి గుణాలతో ఉన్నవాడే గొప్పవాడు అని వేమన ఈ పద్యం ద్వారా చెబుతున్నాడు.
అంటే మనము మనుషులు చూపించే గౌరవము కంటే వారి బుధ్హికి, వాళ్ళ మాటల కంటే వారి మనస్సు యొక్క దృఢత్వానికి, వారి కులము కంటే వారి గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు
బయట కుక్కచేత భంగ పడును
స్థానబలము కాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ || (8)
అర్థము :-
నీటిలో ఉండే మొసలి ఏనుగునైనా పట్టుకుని పీడించగలదు. అదే మొసలి బయటికొస్తే కుక్కలతో కూడ గెలవలేదు. ఇక్కడ స్థానబలము యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు వేమన.
ఇంకో విధంగా ఆలోచిస్తే ఎవరైనా తమ ఇంట్లో ఉండి ప్రగల్భాలు (అంటే గొప్పలు) చెప్పుకోవచ్చును. వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు బయటికొస్తే వాళ్ళ అసలు విలువేంటో తెలిసొస్తుంది.
అన్ని దానములను అన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ || (9)
అర్థము :-
దానములన్నింటిలోకీ అన్నదానమే గొప్పది. కన్నతల్లి కంటే ఎక్కువ ఎవరూ కారు. అదేవిధంగా గురువు కంటే ఎవరూ ఎక్కువ కారు అని వేమన చెబుతున్నాడు ఈ పద్యము ద్వారా. ఎవరైనా ఆకలితో వచ్చి అన్నము అడిగితే పెట్టాలి. అంట కంటే గొప్ప పుణ్యము దేనితోనూ రాదు. నవమాసాలు నానా యాతనలను పడుతూ మోసి కని, ఆ తర్వాత కూడా తన కష్టాలు దిగమింగి ఎంతో ప్రేమతో పెంచే తల్లి కంటే ఎవ్వరూ గొప్ప కారు. చదువు చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి మనని గొప్పవాళ్లుగా చేసే గురువు కూడ ఎంతో పూజనీయుడు.
ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పులేని వాడె అధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినుర వేమ || (10)
అర్థము :-
ఈ పద్యములో కాస్త తికమకగా చెప్పాడు వేమన. మొదటి రెండు పనికిరానివని చెప్పాడు. మూడో వాక్యములో నేమో లేని వాడు గొప్పవాడు అంటున్నాడు.
ఉప్పులేని కూరకి రుచి ఉండదు. అది పనికిరాదు. పప్పు లేకుండా తినే తిండి వలన ఎటువంటి ప్రయోజనము లేదు. శరీరానికి బలము రాదు. ఈ రెండూ కూడ పనికిరావని చెప్పాడు. ఆ తర్వాతేమో అప్పు లేనివాడు అందరికంటే గొప్ప ధనవంతుడు అని అన్నాడు వేమన. ఇది అక్షరాల నిజము. ధనవంతుడై ఉండి అప్పులుంటే అతడు ఏనాటికైనా అప్పులలో ములిగిపోతాడు. అంతకన్నా అప్పు లేనివాడు తన సంపాదనతో బతుకుతూ ఎంతో హాయిగా ఉంటాడు.
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ || (11)
అర్థము :-
ఈ పద్యము మనకి ప్రేరేపణ కలిగించేది. ఏదైనా ఒక రాగం నేర్చుకునేటప్పుడు దాన్ని అదే పనిగా మళ్ళీ మళ్ళీ పాడుతూ సాధన చేస్తే మంచిగా పాడగలుగుతాము. ఇక పొతే వేప ఆకు కానీ పుల్లని కానీ పదే పదే తింటూ ఉంటె అది అలవాటయి ఇంకా చేదు అనిపించదు. తియ్యగా ఉంటుంది.
ఇదే విధముగా మనము ఏ పనినైనా అలా సాధనతో చేస్తూ పొతే అవి మంచిగా చేసుకోగలుగుతాము అని చెబుతున్నాడు వేమన.
తప్పులెన్నువారు తండోపతండము
ఉర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ || (12)
అర్థము :-
ఇక్కడ వేమన ఇతరులలో తప్పులు వెదికి వారిని అవమానపరిచే వారి గురించి చెప్తున్నాడు.
తప్పులు లెక్కపెట్టేవాళ్ళు తండోపతండములుగా ఉంటారు. అంటే వందలు, వేలకొద్ది ఉంటారు అని. ఇకపోతే తప్పులు లేని అంటే తప్పు చేయని వాళ్ళం ఎవరమూ ఉండము. ఏదో ఒక సమయంలో అందరమూ తప్పులు చేసే ఉంటాము అని వేమన అంటున్నాడు. కాని తప్పులు లెక్క పెట్టేవారికి వాళ్ళ తప్పులు కనిపించవు అని. వాళ్లంతా గొప్పవాళ్ళము అనుకుంటారు. అటువంటి వారికి దూరంగా ఉండడమే మంచిది.
ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరికూర్చ వచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ || (13)
అర్థము :-
ఈ పద్యములో మనస్సుని గాయ పరిచే వాళ్ళ గురించి తెలియజేయడం జరిగింది.
వేమన చెప్పేది ఏమిటంటే ఇనుప సామాను విరిగి రెండేసి మూడేసి ముక్కలైపోయినా వాటిని మళ్ళీ అతికించి సరిచేసేయ్యవచ్చునని. ఆ ముక్కలని కాస్తంత కాచి వేడి చేస్తే కొద్దిగా కరిగి అతుక్కుంటాయి. చల్లారాక మామూలుగా గట్టిగా అయిపోతాయి. కానీ మనస్సు విరిగితే అది మళ్ళీ అతికించడం చాలా కష్టము. అనకూడని మాటలతో కాని, చెయ్యకూడని చేష్టలతో కాని ఎవరి మనస్సునైనా విరక్కొడితే అది ఇంక అతకదు. అందుచేత ఎవరినీ నొప్పించకుండా ఉండాలని సందేశము ఇస్తున్నాడు వేమన. (సంసార జీవితంలో వేమన చాలా ఇబ్బందులు పడ్డాడు భార్యతోను, ఇంకా అయినవాళ్లతోను కూడ. అతని మనస్సు విరిగిపోయి సన్యాసిలా తిరిగాడు అని చెప్పుకుంటారు.)
చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ,
కంటి నలుసు, కాలి ముల్లు,
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ || (14)
అర్థము :-
ఈ పద్యము కూడ వేమన జీవిత అనుభవము లోని సత్యాన్ని చెప్పేది.
చెప్పులో రాయి దూరితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, చెవిలో జోరీగ అంటే పెద్ద ఈగలు (జుయ్ మని చప్పుడు చేస్తూ ఎగురుతుంటాయి. కందిరీగలు లాంటివి) వాటితో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో , కాంతిలో నలక పడితే ఎంత కష్టంగా ఉంటుందో, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసు కదా. ఇంటిలో పోరు కూడా అలాంటిదే అస్సలు భరించలేము అని చెబుతున్నాడు వేమన. ఇల్లు ఎప్పుడూ కూడ సుఖమయంగా ఉండేట్లా చూసుకోవాలి.
ఈ పద్యాలన్నీ కూడ మనకి రోజూ ఉపయోగపడే మంచి సందేశాలని ఇస్తున్నాయి. మనము ఈ ప్రపంచములో ఏ విధముగా మసలుకోవాలో వేమన తన జీవితానుభావాల ద్వారా తెలియజేసి ఎంతో మంచి చేశాడు.
ఇవన్నీ మనము మన పిల్లలకి కూడ తెలియజేస్తే వారికీ మార్గదర్శనము చేసినవారము అవుతాము.
గమనిక :-
ఆంగ్లభాష లోకి ఈ పద్యాలను, మరియు సుమతీ శతకము లోని కొన్ని పద్యాలను అనువదించి నేను ఇంకో వెబ్సైటు పై ఒక పోస్ట్ పబ్లిష్ చేశాను విదేశీయులు చదవడం కోసమని. అది చదవాలనుకుంటే మీరు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చూడవచ్చును.
Inspirational Poetry by Two Telugu Poets