29, జూన్ 2024, శనివారం

వినాయక చవితి - పాలవెల్లి తయారీ మరియు ఉండ్రాళ్ళు | Ganesh Chauth With Palavelli & Undrallu

వినాయక చవితి పూజ, ఉండ్రాళ్ళు 

వినాయక చవితి ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు. ఇది హిందువుల ముఖ్య పండుగలలో ముఖ్యమైనది. ప్రతి ఏడాదీ శ్రద్ధతో వినాయకుడుని ఈ పండుగ రోజున పూజిస్తే ఆ ఏడాది అంతా ఎటువంటి విఘ్నాలు, బాధలూ లేకుండా సుఖంగా ఉంటారని నమ్మకం. 

ఈ రోజున శుచి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి విఘ్నేశ్వర ప్రతిమని స్థాపించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. 

ప్రతీ ఏటా కొత్త విగ్రహాన్ని తెచ్చుకుని పూజించటం పరిపాటి. ఆలా చెయ్యలేని వారు ఇంట్లో ఉన్న విగ్రహంతోనే చేసుకోవచ్చును. ప్రతిమకి ఔపచారిక స్నానం చేయించి పసుపు రాసిన పీట మీద ఉంచి, నుదుట బొట్టు పెట్టి ఏదైనా వస్త్రం ధరింపజేసి చేసుకుంటే తృప్తిగా ఉంటుంది. పీట లేకపోతే ఒక ఆకు మీద పెట్టి చేసుకోవచ్చును. రక రకాల పువ్వులతో, ఆకులతో పూజిస్తాము. వీటినే పత్రి అని అంటారు. ఈ పత్రి పండుగ రోజు ఉదయం కానీ, ముందు రోజు సాయంత్రమే కానీ అమ్ముతుంటారు. అవి తాజాగా ఉన్నవి చూసి తెచ్చుకుని పూజ చేసుకోవాలి. పళ్ళు, ఉండ్రాళ్ళు, ఇంకా ఏవైనా నైవేద్యం సమర్పించి చేసుకోవాలి. 

వినాయక చవితి పూజ చేసే విధానము   

  • వినాయక ప్రతిమని శుభ్రమైన స్థలంలో అమర్చుకుని పూజ సరుకులన్నీ దగ్గిర పెట్టుకుని పూజ మొదలెట్టాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. 
  • ముందుగా విఘ్నేశ్వరునికి ఆర్గ్యం ఇవ్వాలి. ఆయన చేతి దగ్గిర నీటి చుక్కలు వదలాలి. 
  • తరువాత పాద్యం సమర్పించాలి. అంటే పాదాల దగ్గిర నీటి చుక్కలు వదలాలి. 
  • ఇప్పుడు స్నానం చేయించాలి. ప్రతిమ చుట్టూ ఉద్ధరిణితో (చెంచాతో) నీళ్లు తిప్పి వదలాలి. 
  • ఏదైనా చిన్న వస్త్రం లాంటిది ఉంటె ఆయనకి చుట్టాలి. లేదా దూది పల్చగా చేసి వంటి మీద పెట్టచ్చు. నుదుటికి బొట్టు పెట్టాలి. 
  • ఇప్పుడు వినాయకునికి ఆచమనం ఇచ్చి పూజ మొదలు పెట్టుకోవాలి. ఉద్ధరిణితో నీళ్లు మూడు సార్లు తీసి ఆయన నోటికి చూపించాలి.
  • ఆహ్వానం పలుకుతూ రెండు పువ్వులు సమర్పించాలి. 
  • ఇంకో సారి అర్ఘ్య, పాద్యములు సమర్పించి ఆచమనం ఇచ్చి పుష్పాలు జల్లి, జంధ్యం తొడిగించాలి. దూదితోనే పొడవుగా చేసి ఆయన భుజం మీద నుండి పొట్ట మీదకి పడేలా వెయ్యాలి. 
  • ఒకటి రెండు స్తోత్రాలు చదివి, 108 నామాలతో పూజించాలి. ప్రతి నామానికి ఒక పుష్పం కానీ పత్రం కానీ సమర్పిస్తూ చెయ్యాలి. 
  • పసుపు, బియ్యం కలిపిన అక్షింతలు, కుంకుమ కూడా జల్లుతూ పూజ చేసుకోవాలి. 
  • ఇదంతా అయ్యాక నైవేద్యం ఆరగింపు పెట్టాలి. ఉండ్రాళ్ళు, పళ్ళు పళ్ళాలలో ఉంచి కాస్త నీళ్లు జల్లి అప్పుడు ఆయనకి తినిపించాలి. 
  • నైవేద్యం అయ్యాక చేతులు, నోరు, పాదాలు కడిగించాలి. అంటే ఉద్ధరిణి తో నోటికి, చేతులకి, పాదాలకి నీళ్లు చూపించి వదలాలి. 
  • మళ్ళీ ఆచమనం ఇచ్చి మంగళ హారతి పట్టాలి. 
  • వెంటనే కథ కూడా చదువుకోవచ్చును. ప్రసాదం తిని చదువుకోవచ్చును. లేదా కథ విడిగా సాయంత్రమైనా చదువుకోవచ్చును. 
  • కథ చెప్పుకోకుండా చంద్రుణ్ణి చూడకూడదు అంటారు. ఒకవేళ మధ్యాన్నం నాలిగింటే చంద్రుడు కనిపించినా కనిపించవచ్చు. అందుచేత త్వరగానే చదువుకుంటే మంచిది. 
  • కథ చదువుకోడాలు, చెప్పుకోడాలు అయ్యాక పూజ చేసిన అక్షింతలని తీసుకుని అందరూ తలపైన జల్లుకోవాలి. అప్పుడు చంద్రుణ్ణి చూసినా ఫర్వాలేదు. 
వినాయక పూజ మరియు కథ ఉన్న పుస్తకాలు అన్ని చోట్ల దొరుకుతాయి. అవి ముందుగా తెప్పించుకు పెట్టుకోవడం మంచిది. నేను కూడ వీలైనంత వరకు నా బ్లాగులలో రాయడానికి ప్రయత్నిస్తాను. 

వినాయక చవితికి పాలవెల్లి 

వినాయక చవితి రోజున పాలవెల్లి కూడా కట్టుకుని పూజ చేసుకోవడం ఆచారము. ఎలాగైతే ఇంటి గుమ్మానికి మామిడాకులు, తోరణాలు కట్టి అలంకరిస్తామో అలాగే వినాయక పూజా స్థానాన్ని కూడా  అలంకరించుకుంటాము.

ఈ పాలవెల్లి చేయడానికి వెదురు బద్దలు, గట్టి దారము, వేలాడదీయడానికి పురికోసు త్రాడు కావాలి. అంతేకాక అలంకరించడానికి పువ్వులు, మామిడాకులు, మొక్కజొన్న పొత్తులు, వగైరా కావాలి.    
 

పాలవెల్లి తయారుచేయు విధానము 

  • పాలవెల్లి అనేది వెదురు బద్దలతో తయారుచేస్తారు. 
  • సన్నగా చీల్చిన వెదురు బద్దలు కనీసం 18 అంగుళాల పొడవు ఉన్నవి ఎనిమిది కావాలి.
  • నాలుగు బద్దలు నిలువుగా, నాలుగు అడ్డంగా రెండేసి అంగుళాల దూరంలో పేర్చి వాటిని గట్టిగా ఉండే పురికోసు దారంతో కట్టుకోవాలి.  
  • అలా తయారు చేసుకున్న పాలవెల్లికి అంతటా తడిపిన పసుపు రాసి వినాయక ప్రతిమ పైన కాస్త ఎత్తుగా ఉండేలా వేలాడదీయాలి. 
  • అప్పుడు దానికి అన్నివైపులా మధ్యలోను కూడా మామిడాకులు అగరవత్తుల పుల్లలతో గుచ్చి అలంకరించుకోవాలి. కావాలంటే పువ్వులు కూడా కట్టచ్చును. 
  • తరువాత నాలుగు రకాల పళ్ళు మొక్కజొన్న పొత్తులు నాల్గు మూలల కట్టి వేలాడదీయాలి.
  • వినాయక ప్రతిమకు అడ్డం రాకుండా ఉండేట్లాను, పూజకి అడ్డం పడకుండా ఉండేలా దారాలతో కట్టి అవన్నీ వేలాడ దీయాలి. 
  • అలా తయారైన పాలవెల్లిని, కాస్త లావుగా ఉండే దారంతో పైన ఏదైనా కొక్కానికి, లేదా కిటికీ కింద పూజ చేసుకునే మాటైతే కిటికీ గొళ్లానికైనా కట్టుకోవచ్చును. 

మార్కెట్లో రెడీగా తయారు చేసిన పాలవెల్లులు అమ్ముతుంటారు. అవైనా కొనుక్కుని అలంకరించుకుని పూజ చేసుకోవచ్చును. 

ఉండ్రాళ్ళు తయారుచేసే విధానము 

ఉండ్రాళ్ళు వినాయకునికి అతి ప్రియమైన వంటకము. వినాయకుని గణాలకు అధిపతి చేసిన రోజున దేవతలందరికీ విందు భోజనానికి వెళ్లి కడుపునిండా ఉండ్రాళ్ళు తింటాడు వినాయకుడు. ఆ తర్వాత ఇంటికొచ్చి తల్లితండ్రులకి వంగి పాదాభివందనము చేయబోతే పొట్ట పగిలి ఉండ్రాలన్నీ దొర్లిపోయాయని చెప్తారు. 

అందుకనే ఈ రోజున ఉండ్రాళ్ళు వండి ఆరగింపు పెడతారు. 

ఉండ్రాళ్ళు చెయ్యడానికి కావాల్సిన వస్తువులు:
  • బియ్యం రవ్వ 
  • కొబ్బరి కోరు 
  • కాస్త సెనగపప్పు 
  • కాసిని పాలు, నెయ్యి, ఉప్పు 
 ముందుగా రవ్వ, సెనగపప్పు కలిపి కుక్కర్లో అన్నం వండుక్కున్నట్లుగా ఉడక పెట్టుకోవాలి. అలా ఉడికిన ముద్దా కాస్త పొడిగా ఉండి ఉండలు చెయ్యడానికి వీలుగా ఉండాలి. 

ఇప్పుడు అందులో కొబ్బరి కోరు, ఉప్పు, నెయ్యి, కొన్ని చుక్కల పాలు కలిపి ఉండలు చేసి పెట్టుకోవాలి. 

ఇడ్లీలు వండుకునే పాత్రలో ఒకటే ఇడ్లీ అర పెట్టి అన్ని ఉండలు అందులో చక్కగా ఉడికేట్లా పేర్చి మూత పెట్టి ఆవిరిలో ఎలాగైతే ఇడ్లి వండుతామో అలాగే వండాలి. 

ఇడ్లీ పాత్ర ఉపయోగించని వారు మామూలు గిన్నె లోనే నాలుగో వంతు నీళ్లు పోసి ఆ పాత్రకి ఒక తెల్లటి బట్ట కట్టి దాని పైన ఈ ఉండ్రాళ్ళ ఉండలు పేర్చి, పై నుండి కాస్త ఎత్తుగా, లోతుగా ఉండే మూత పెట్టి, ఆవిరిలో ఉడికేట్లా చేసుకోవాలి.   

బియ్యం రవ్వ, సెనగపప్పు ముందే చాలా వరకు ఉడికాయి కనుక ఈ ఉండలు ఐదు నిమిషాల్లోనే ఉడికిపోవచ్చును. మంచిగా ఉడికిన  ఉండలు కాస్త విచ్చుకుని పెద్దవిగా అవుతాయి. దాన్నిబట్టి అవి ఉడికినట్లుగా భావించవచ్చును. 

అప్పుడు దింపేసి అన్ని ఉండ్రాళ్ళు ఒక పాత్రలోకైనా, పళ్లెంలోకైనా తీసి పెట్టుకోవాలి. పూజ పూర్తి అయ్యాక ఆ ఉండ్రాళ్ళు వినాయకునికి నైవేద్యం పెట్టి, అప్పుడు ప్రసాదం తినవచ్చును. 

తినేటప్పుడు కావాలంటే ఇంకా నెయ్యి రాసుకుని, ఏదైనా ఊరగాయ, చట్నీతో, లేదా బెల్లంతో తినవచ్చును.  

27, జూన్ 2024, గురువారం

విఘ్నేశ్వర స్తుతి స్తోత్రాలు - Ganesh Puja Hymns


వినాయక చవితి పూజ మొదలు పెట్టునప్పుడు కానీ బుధవారం వినాయకుడి పూజ చేయునప్పుడు కాని, అటువంటప్పుడు ఈ క్రింద చెప్పబడిన శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుని పూజించుకోవచ్చును.

ప్రతీ శ్లోకానికీ అర్ధము ఇవ్వబడింది. ఆ తరువాత ఇంగ్లీష్ భాషలో కూడ శ్లోకాలు, అర్ధములు ఇవ్వడం జరుగుతోంది క్రింది భాగంలో. 

ముందుగా తెలుగులో ఒక్కొక్క శ్లోకము రాసి వాటికి అర్థము చెబుతున్నాను. 

  
శ్రీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః |  
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || (1)



మెలితిరిగిన తొండము, మహా దేహము కలిగి, కోటి సూర్యుల తో సమమైన తేజస్సు కలిగి ఉండే ఓ విఘ్నేశ్వరా, అన్ని పనుల లోను అన్ని సమయముల లోను ఆటంకములు, అవాంతరములు తొలగించు దేవా. 

ఇక్కడ వక్రతుండ అనే పదానికి మనం ఇంకో అర్థం కూడ చెప్పుకోవచ్చును. 
వక్ర అంటే వక్ర స్వభావము , తుండము అంటే తెంపి వేయడం . విఘ్నేశ్వరుడు చెడ్డ స్వభావములని పోగొట్టి మనని కాపాడుతుంటాడు మనం ఆయనని పూజిస్తూ ఉంటె. అంతే కాదు.  చెడు శక్తుల నుండి రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఆయనని రోజూ పూజించుకోవాలి. 
  

శుక్లాంబర ధరమ్ విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || (2)

తెల్లని వస్త్రములు ధరించి, అంతటా వ్యాపించి, చంద్ర కాంతి తో వెలుగొందుచు, నాలుగు భుజములతో కూడి ప్రసన్నమైన ముఖము కలిగిన ఓ దేవా, అన్ని విఘ్నములను తొలగించు స్వామీ! 


తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ 
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్ | 
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ || (3) 

భావార్ధము:
విఘ్నేశ్వరుడు తొండము, ఒక దంతము, విశాలమైన బొజ్జ,ఎడమ చేతిలో బాగుగా చప్పుడు చేసే గజ్జెలు పట్టుకుని, ఒక కొండ చిన్న గుజ్జు రూపములో ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అతను చదువులన్నింటికీ అది దేవత. అటువంటి పార్వతీ పుత్రుడు మఱియును గణములన్నింటికీ అధిపతి అయిన ఓ గణేశ్వరా నీకు మ్రొక్కుచున్నాను స్వామీ, దయ చేసి నాకు విఘ్నములు, ఆపదలు లేకుండా కాపాడు తండ్రీ.


గజవక్త్రం, సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్ | 
పాశాంకుశధరం, దేవం, వందేహం గణనాయకమ్ || (4)

ఏనుగు ముఖము కలిగి, దేవతలందరికీ శ్రేష్ఠుడవై, చామరముల వంటి చెవులు కలిగి, పాశము అంకుశము ధరించి, ఉండే ఓ దేవా, నీకు అభివందనములు గణ నాయకా! 


అగజానన పద్మార్కమ్, గజాననం, అహర్నిశమ్ | 
అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే || (5)

తల్లి గౌరీ మాత  ముఖపద్మము నుండి వెలుగొందే కిరణములతో ప్రకాశించు వదనము కలిగి, రాత్రిబవళ్ళు భక్తులను కటాక్షిస్తూ ఉండే ఏకదంతుడవైన విఘ్నేశ్వరుని శరణు వేడుచున్నాను. 
  

విఘ్నేశ్వరాయ, వరదాయ, సురప్రియాయ, 
లంబోదరాయ, సకలాయ, జగత్ జితాయ,
నాగాననాయ, శ్రుతియజ్ఞ విభూషితాయ,
గౌరీసుతాయ, గణ నాథ, నమో నమస్తే|| (6)

విఘ్నేశ్వరా, వరము లొసగే స్వామీ, దేవతలకు ప్రియుడా, పొడవైన ఉదరము కలవాడా, అన్ని శ్రేష్టతలు కలిగిన వాడా, జగత్తుని గెలిచినా వాడా, నాగము లాంటి తొండముతో ఉన్న వదనము కలిగి, వేదములు, శాస్త్రములు, యజ్ఞములతో అలంకరింపబడిన గౌరీ సుతా, ఓ గణ నాథా! నీకివే నా వందనములు.