29, మార్చి 2025, శనివారం

ఉగాది పండుగ - సంవత్సరాది విశేషతలు మరియు ఉగాది పచ్చడి చేయు విధానము


మన తెలుగు నూతన సంవత్సర దినము జరుపుకునే రోజుని ఉగాది పండుగ అని అంటాము. ఈ రోజునే కర్నాటక ప్రజలు యుగాదిగా జరుపుకుంటారు. మహారాష్ట్రీయులేమో గుడి పర్వ దినముగా జరుపుకుంటారు. 

ఉగాది పండుగని ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము.

ఉగ అనే పదము యుగము అనే మాట నుండి వచ్చింది. యుగము అంటే ఒక తరము లేదా నాలుగు యుగాల లోని యుగము అయినా అనుకోవచ్చును. కానీ ఉగాది పండుగకు సంబంధించినంత వరకు మన తెలుగు క్యాలెండర్ కాలమానము 60 సంవత్సరాలు ఒక యుగము అనుకోవచ్చును , లేదా అందులోని ప్రతి ఒక్క సంవత్సరము ఉగము అనవచ్చును. ఆ విధంగా చూస్తే 60 సంవత్సరముల చక్రములో మొదటి రోజు కానీ, ప్రతీ సంవత్సరము యొక్క మొదటి రోజు కానీ ఉగాది అవుతుంది. 

మన క్యాలెండర్ 60 సంవత్సరాలలో ప్రతీ దానికి ఒక్కొక్క పేరు ఉంది. 60 ఏళ్ళు పూర్తి అయితే మళ్ళీ అవే పేర్లు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఈ విధంగా చూసినట్లు అయితే ఒక అరవై ఏళ్ల కాలంలో ప్రతీ సంవత్సరము పేరు ఒక్క సారి మాత్రమే వస్తోంది. అంటేప్రతీ అరవై ఏళ్ళకి ఒకే పేరు ఉండే  సంవత్సరాన్ని మనము పండుగ లాగా జరుపుకుని ఆనందిస్తున్నాము కనుక అరవై రకాల ఉగాదులు మనము జరుపుకుంటున్నట్లు అవుతోంది ఒక కాలమానములో. అందుకనే ఈ పండుగలని ఉగాది పండుగ అని పిలుచుకుంటున్నాము.

ఈ ఉగాది రోజున శుభ్రముగా తల అంటుకుని స్నానము చేసి మంచి బట్టలు (కొత్తవి కానీ, ఉతికి ఆరేసుకున్నవి కానీ కట్టుకుని పూజ చేసుకుంటాము. ఇల్లు, వాకిలీ స్నానానికి ముందుగానే శుభ్రము చేసుకుని ముగ్గులతోను తోరణాలతోను అలంకరించుకుంటాము. వీధి గుమ్మాలకి మామిడాకులు, పూలదండలు కట్టుకుంటాము. దేవుని పూజా స్థలాన్ని కూడా ముగ్గులతో, తోరణాలతో అలంకరించు కోవచ్చును . 

ఈ పండుగ విశేషము ఏమిటంటే మనము ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకుని దేవునికి ఆరగింపు పెట్టి ముందుగా ఆ పచ్చడిని తిన్న తరువాతనే ఇంక ఏమైనా తినాలి.

పచ్చడి తయారు చేసుకుని పూజ చేసుకుంటాము. పూజ జరిగేటప్పుడు ఇంటిల్లిపాదీ కూర్చుని చేసుకుంటే బాగుంటుంది. ఆ తరువాత ఉగాది పచ్చడి ఆరగింపు పెట్టాలి. దానితో పాటు ఇంకా ఏవైనా పదార్థములు (పులిహోర, పాయసము, అరటిపళ్ళు వంటివి) ఆరగింపు పెట్టుకోవచ్చును ఓపికను బట్టి. అప్పుడు తీర్థ ప్రసాదములు గ్రహించాలి. 

రోజంతా సరదాగా గడుపుకుని, గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్లి వస్తారు. అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణము కూడా ఉంటుంది సాయంత్రం పూట. ఆ ఏడాది లోని గ్రహదశలు, లాభనష్టాలు వంటివి తెలియజేస్తారు.    

ఉగాది పచ్చడి - ఆరు రుచులు - ఆరు మానసిక ఉద్వేగాలు 

మన జీవితములో మనము అనుభవించే మానసిక పరిస్థితులు ముఖ్యంగా ఆరు రకాలుగా ఉంటాయి. అవి సంతోషము, దుఃఖము, కోపము, భయము, ఆశ్చర్యము, చికాకు లేదా అసహ్యము. 
ఈ ఆరు మానసిక పరిస్థితులని బట్టి ఆరు రకాల రుచులు ఉంటాయి. అవే తీపి, కారము, చేదు, ఉప్పదనము, వగరు, పులుపు అనేవి.

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు 

  1. వేప పువ్వు (చేదు, దుఃఖము)
  2. మామిడికాయ (వగరు, ఆశ్చర్యము)
  3. బెల్లము (తీపి, సంతోషము)
  4. చింతపండు (పులుపు, సంఘర్షణలు)
  5. పచ్చి మిరపకాయ (కారము, కోపము)
  6. ఉప్పు (ఉప్పదనము, భయము)

ఉగాది పచ్చడి తయారుచేయు విధానము 


  • ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న పాత్రలో ఒక కప్పుడు నీళ్ళల్లో 25, 30 గ్రాముల చింతపండు వెయ్యాలి. 15, 20 నిమిషాలు నానబెట్టి, బాగా నలిపి పిప్పి తీసేసి ఉంచుకోవాలి. 
  • వేపపువ్వు రెమ్మల నుండి విడదీసి పెట్టుకోవాలి. ఈ పని రాత్రి పడుకునే ముందు చేసుకుని ఫ్రిడ్జిలో పెట్టుకుంటే సులువుగా ఉంటుంది. నలుగురు తినాలంటే ఒక చిన్న గరిటెడు పువ్వులు కలుపుకోవచ్చును.
  • బెల్లము కోరేసుకుని ఒక చుక్క నీళ్ళల్లో నానబెడితే మంచిగా కలపడానికి వస్తుంది. మనకి కావాల్సిన తీపిని బట్టి ఇది కలపాలి. 
  • మామిడికాయ మధ్యరకం సైజుది తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి.
  • పచ్చిమిరపకాయ ఒకటి చాలు. చాలా సన్నగా ముక్కలు చేసుకోవాలి. 
  • ఇప్పుడు పైన రెడీ చేసుకున్న సామాన్లు అన్నీ ఇంకో పాత్రలో మంచిగా కలిసేట్లా కలుపుకోవాలి. 
  • ఉప్పు అర స్పూన్ కానీ, ఇంకా తక్కువ కానీ వేసుకోవచ్చును. 
  • అన్ని వస్తువులు చక్కగా కలిసేట్లా అవసరమైతే కొన్ని నీళ్లు పోసి కలపాలి.
    
ఇప్పుడు మీ ఉగాది పచ్చడి రెడీ అయింది. దేవునికి ఆరగింపు పెట్టి చక్కగా అన్ని రుచులూ అనుభవిస్తూ సేవించండి. 

ఇలా అన్ని రుచులూ సంవత్సరము మొదటి రోజున అనుభవిస్తే ఆ ఏడాదిలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ అవలీలగా ఎదుర్కోగలుగుతారు అని మన పెద్దల నమ్మకము. 
     

25, ఫిబ్రవరి 2025, మంగళవారం

శివ పూజా స్తోత్రములు - లింగాష్టకము - Lord Shiva Worship

"బ్రహ్మ మురారి సురార్చిత లింగమ్"  అని ఒక అష్టకము (అంటే ఎనిమిది కీర్తనలు) పరమ పావనుడైన శివపరమాత్మను కీర్తిస్తూ ఆయన భక్తుడు, పరమ పూజ్యులు అయిన ఆది శంకరాచార్యుల వారు మనకు అందించారు. 


ఆ కీర్తించిన స్తోత్రములే లింగాష్టకము. ఈ అష్టకములో రావణాసురుడి గర్వభంగము, దక్ష ప్రజాపతి యజ్ఞ ధ్వంస మగుట లాంటి ఘటనలను కూడా పేర్కొంటూ శివుని కీర్తన చెయ్యడం జరిగింది. 

రావణుడు కైలాసము పెకిలించి తన లంకకు పట్టుకుపోదామని పెకిలిస్తూంటే శివుడు తన కాలితో పర్వతాన్ని గట్టిగా నొక్కుతే దాని కింద రావణుడి చేతులు ఇఱుక్కుపోయి, నిస్సహాయుడై శివతాండవ కీర్తన చేసి, చేతులను పొందటమే కాక శివలింగాన్ని కూడ పొందుతాడు. 

అలాగే దక్షుడు యజ్ఞము చేస్తూ శివుని పిలువక పార్వతిని మాత్రమే పిలుస్తాడు. ఆమె ఎదురుగా శివుణ్ణి అవమానిస్తుంటే పార్వతి అగ్నిలో దూకి దేహము చాలించింది. అప్పుడు కోపముతో శివుని నంది ఆ యజ్ఞ స్థలాన్ని ధ్వంసము చేసింది.    

ఆ లింగాష్టకమునే నేను ఇక్కడ అర్థములతో సహా పొందుపరచటానికి ప్రయత్నిస్తున్నాను.

 

లింగాష్టకము 


బ్రహ్మమురారి సురార్చిత లింగం 
నిర్మల భాసిత శోభిత లింగం 
జన్మజ దుఃఖ వినాశక లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (1)

అర్థము :-

బ్రహ్మదేవుడు, మురారి (విష్ణుమూర్తి), మరియు దేవతల చేత అర్చింపబడునట్టిదియు, నిర్మల జ్యోతులను వెదజల్లుతూ సదా ప్రకాశించుచుండు నట్టిదియు, పుట్టుకతో వచ్చిన దుఃఖములను సైతము నశింపజేయు నట్టిదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నా నమస్సులు సమర్పిస్తున్నాను.   


దేవముని ప్రవరార్చిత లింగం 
కామదహన కరుణాకర లింగం 
రావణ దర్ప వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (2)

అర్థము :-

దేవతలు, మునులు, బ్రాహ్మణులు, పండితులు (ప్రవరులు అంటే బ్రాహ్మణులు, పండితులు, శ్రేష్ఠులు అనే అర్థములు వస్తాయి) వీరందరిచే పూజింపబడునదియు; కామాన్ని, కోరికలను దహించునట్టిదియు, కరుణ, దయలకు ప్రతీకము అయినట్టిదియు; రావణుని గర్వమును నశించజేసినట్టిదియు నైన ఆ సదాశివ లింగమునకు నా ప్రణామములు సమర్పిస్తున్నాను.  


సర్వ సుగంధి సులేపిత లింగం 
బుద్ధి వివర్ధన కారణ లింగం 
సిద్ధ సురాసుర వందిత లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (3)

అర్థము :-

సకల సుగంధములతో మంచిగా అలకబడినదియు, బుద్ధి వికాసము పెరుగుదలకు కారణమైనట్టిదియు, సిద్ధులు, సురులు (దేవతలు), రాక్షసులు (అసురులు) అందరిచేత నమస్కరింప బడునట్టిదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నా ప్రణామములు సమర్పిస్తున్నాను.  


కనక మహామణి భూషిత లింగం 
ఫణిపరివేష్టిత శోభిత లింగం 
దక్షసు యజ్ఞ వినాశన లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (4)

అర్థము :-

బంగారము, మణులతో అలంకరింపబడినదియు, సర్పరాజైన వాసుకి (ఫణి అంటే పడగ కలిగినది, పాము. ఫణిపరివేష్టిత అంటే చుట్టూ పాముతో అల్లుకోబడినది) దాని చుట్టూ అల్లుకోవడము వలన అందముగా ప్రకాశిస్తున్నట్టిదియు, దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞమును ధ్వంసము చేసినట్టిదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను. 


కుంకుమ చందన లేపిత లింగం 
పంకజ హార సుశోభిత లింగం 
సంచిత పాప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (5)

అర్థము :- 

కుంకుమ మరియు చందనము చక్కగా పూయబడినదియు, కమలములు, తామర పుష్పముల హారములతో చక్కగా అలంకరింపబడి, ఎంతో మనోహరముగా ప్రకాశిస్తున్నట్టిదియు, జన్మ జన్మల నుండి కూడగట్టుకున్న పాపములను అన్నింటినీ పోగొట్టునట్టిదియు అయిన ఆ సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను.  


దేవ గణార్చిత సేవిత లింగం 
భావైర్ భక్తి భిరేవచ లింగం 
దినకర కోటి ప్రభాకర లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (6)

అర్థము :-

దేవతల చేతను, సకల గణముల చేతను నిరంతరమూ అర్చింపబడుతూ, సేవింపబడుతూ ఉండి, భక్తి భావనలను, శ్రద్ధను ఉత్పన్నము చేయునట్టిదియు, కోటి సూర్యుల తేజస్సుతో ప్రజ్జ్వలముగా ప్రకాశించునట్టిదియు అయిన ఆ సదాశివ లింగమునకు నేను ప్రణామములు సమర్పిస్తున్నాను.  


అష్టదళో పరివేష్టిత లింగం 
సర్వ సముద్భవ కారణ లింగం 
అష్టదరిద్ర వినాశన లింగం 
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (7)

అర్థము :-

అష్టదళో పరివేష్టిత అంటే అష్ట దిక్పాలకులు చుట్టూ సేవిస్తున్నారు అని ఒక అర్థము చెప్పుకోవచ్చును, లేదా అష్టదళములు (ఎనిమిది రేకులు) ఉన్న పుష్పాలతో అలంకరింపబడినది ఆ లింగము అని అనవచ్చును. అంతేకాక సకల సృష్టికి కారణభూతమైనదియు, అష్టదరిద్రములను నశింపజేయునట్టిదియు అయిన ఆ సదాశివ లింగమునకు నేను ప్రణామములు సమర్పించుకుంటున్నాను.
 
అష్టదరిద్రములు ఈ ప్రకరమైనవి:

అన్న దరిద్రత, వస్త్ర దరిద్రత, ఇల్లు/నివాసం లేకపోవుట, సంతానము లేకపోవుట, మిత్రులు లేదా బంధువులు లేకపోవుట,  భూమి దరిద్రత, సంపత్తి దరిద్రత, విద్య లేకపోవుట.
లింగపూజ చేస్తే ఈ దరిద్రాలనుండి విముక్తి లభిస్తుందని చెప్పబడుతోంది.  


సురగురు సురవర పూజిత లింగం 
సురవన పుష్ప సదార్చిత లింగం 
పరమపదం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్ || (8)  

అర్థము :-

దేవతల గురువులు, దేవతల్లో శ్రేష్ఠులు, ఎల్లవేళలా పూజిస్తూ ఉండే లింగము, దేవలోకపు ఉద్యానవనము (తోట) లోని పుష్పములతో ఎడతెరిపి లేకుండా అర్చన చేయబడుతూ ఉండునట్టిదియు, పరమపదము అయినదియు, పరమాత్మ అయినదియు అయినటువంటి ఆ సదాశివ లింగమునకు నేను ఎల్లవేళలా ప్రణామములు సమర్పించుకుంటూ ఉంటాను. 


ఫలశ్రుతి 

లింగాష్టక మిదం పుణ్యం; యహ్ పఠేత్ శివ సన్నిధౌ 
శివలోక మవాప్నోతి, శివేన సహమోదతే ||| 

అర్థము :-

ఈ లింగాష్టకము పుణ్యప్రదమైనది. అంటే పుణ్యము కలిగించునది. దీనిని ఎవరయితే శివుని సన్నిధిలో పఠిస్తారో వారికి శివలోకము లభిస్తుంది. శివుని జేరి ఆనందాన్ని అనుభవిస్తారు. 

ఓమ్ తత్ సత్ 
ఇది నిజము    

19, ఫిబ్రవరి 2025, బుధవారం

శివపార్వతుల స్తుతి - త్రియంబకమ్ - Worship Hymns of Parvati and Shiva



శివపార్వతుల స్తుతి స్తోత్రములు ప్రతి రోజు పూజా సమయములో టూకీగా చదువుకోడానికి ఇక్కడ తెలియజేస్తున్నాను. అర్థములు కూడా పొందుపరుస్తున్నాను. 

ముందుగా పరమేశ్వరుని స్తోత్రము అటుపిమ్మట పార్వతీదేవి స్తోత్రములు ఇస్తున్నాను. 

"త్రయంబకమ్" అన్న పదము శివునికి వర్తించాలని కొంత మంది అభిప్రాయము. కాని అది సరైనది కాదని నా నమ్మకము. 

త్రి అంటే మూడు లేదా ముగ్గురు అని అర్థము. అంబ అంటే అమ్మ. త్రియంబకమ్ అంటే ముగ్గురమ్మల తల్లి. ఆవిడ పరమేశ్వరి.



 

ముందుగా గణేశ స్తుతి 

సర్వ విఘ్న హరమ్ దేవం 
సర్వ విఘ్న వివర్జితమ్ 
సర్వ సిద్ధి ప్రదాతారం 
వందేహం గణ నాయకమ్ || 

అర్థము :-

సమస్త విఘ్నములను, అడ్డంకులను రూపు మాపే (పోగొట్టే) దైవము; అన్ని విఘ్నములను తొలగించుచు అన్ని సిద్ధులను ప్రసాదించు (కోరికలను తీర్చు ) దైవము అయినట్టి గణనాయకునికి నా వందనములు సమర్పించుచున్నాను. 

శివ స్తుతి


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ  || (1)

అర్థము :-

వాక్కు (శబ్దము) లకు సంబంధము కలిగించి, ఆ ధ్వనులకు ఒక అర్థమును ప్రతిపాదించు, సర్వ జగత్తుకి తండ్రి అయిన పార్వతీపరమేశ్వరునికి నా యొక్క నమస్సులు (వందనములు). 
ఓంకారము సమస్త ధ్వనులకు మూలాధారం. ఆ ఓంకారము ద్వారా ధ్వనులను సృష్టిస్తూ ఆ ధ్వనులను వాక్కులుగా మారుస్తూ, ఆ వాక్కులకు అర్థము సృష్టిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు.   


అంగికం భువనం యస్య వాచికమ్ సర్వ వాఙ్మయమ్ 
ఆహార్యం చంద్ర తారాది తమ్ నుమ సాత్త్వికమ్ శివమ్ || (2) 

అర్థము :-

ఈ భువనమునే తన వస్త్రముగా దాల్చినవాడు, తన వాచికమే (అంటే తన పలుకే) సమస్త వాఙ్మయము (సకల విజ్ఞానము) అయినవాడు, తనకు ఆహారముగా చంద్రుడు, నక్షత్రములు పొందినవాడు ( అనగా చంద్రుడు, నక్షత్రములు మొదలగునవన్నీ అతనిలోనే ఇమిడి ఉన్నాయి అని అర్థము). అటువంటి సాత్విక గుణ సంపన్నుడును అయిన శివ పరమాత్మునికి నా వందనములు సమర్పిస్తున్నాను. 
  

మృత్యుంజయాయ రుద్రాయ 
నీలకంఠాయ శంభవే 
అమృతేశాయ శర్వాయ 
శ్రీ మహాదేవతే నమః || (3)

అర్థము :- 

మృత్యుంజయుడు, రుద్రుడు, నీలకంఠుడు, శంభవుడు అన్నవి శివుని నామములు. మృత్యువును జయించిన వాడు, మృత్యుదేవతని తన అధీనములో ఉంచుకున్నవాడు. రుద్రుడు ప్రళయ దేవత. చాలా భయంకరముగా, రుద్రముగా ఉండి సమస్త బ్రహ్మాండము వణకిపోయెలా చేయువాడు. 
నీలకంఠుడు అంటే సముద్ర మథనములో విషపానము చేసి, తన కంఠములో దాచుకుని దేవతలను రక్షించినవాడు. శంభవుడు అంటే పవిత్రతకు, పరమానందము, ఆత్మోల్లాసము మొదలైన వాటికి నిలయమైనవాడు. 
అంతేకాక శివుడు అమృత దేవత, శర్వాయ అంటే అంతటా అన్నిచోట్లా వ్యాపించిన దేవత. 
అటువంటి శ్రీ మహాదేవత అయిన శివపరమాత్మకు నేను వందనములు సమర్పించుచున్నాను.    

పార్వతీ స్తుతి 


ఓం త్రియంబకమ్ యజామహే సుగంధిమ్ పుష్టి వర్ధనమ్ 
ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ || (1)

అర్థము :-

ఓ ముగ్గురమ్మల తల్లీ! లోక మాతా! జగమంతటికీ కళ్యాణము కలిగించే సుగంధముల విరజల్లుతూ, పుష్టి, పటుత్వములను ప్రసాదించు తల్లీ, మిమ్ములను భక్తి, శ్రద్ధలతో వేడుకుంటున్నాము. 
ఒక పండు ఎలాగైతే మొక్క నుండి తెగిపోయి స్వేఛ్ఛని పొందుతుందో అలాగే మాకు మృత్యువు (అంటే సంసార బంధనముల) నుండి సంబంధమును తెంచి అమృతము పోలిన ముక్తిని ప్రసాదించుము తల్లీ !   


మహాకాళీ మహాలక్ష్మీ మహా సారస్వతీ ప్రభా 
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీ ర్విశ్వ మంగళమ్ || (2)

అర్థము :-

అమ్మా ! మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ ! ఈ ముగ్గురమ్మల ప్రభని కలిగిన తల్లీ ! మా కోరిక తీరుస్తూ విశ్వమంగళము ప్రసాదించుము. సకల ప్రాణులు మంగళకరమైన జీవనము పొందునటుల కటాక్షించుము.  


షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ 
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్ || (3)

అర్థము :-

పదహారు కళలతో ఉట్టిపడుతున్న చంద్ర కాంతి వెదజల్లుతూ, మరియు మల్లె పూవు, అర్జున పుష్పముల వంటి అందముతో కూడిన దేహము కలిగిన దేవీ ! ఓ తల్లీ ! మా కోరికలు తీరుస్తూ ఈ జగత్తును రోగాల బారి నుండి రక్షించుమా !


జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా 
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ లోకం సద్భుద్ది సుందరమ్ || (4)

అర్థము :-

జగత్తును బాధ్యతతో భరిస్తూ, లోకాలను నేత్రము వలె కనిపెట్టుకుని కాపాడుతూ ఉంటూ,  అమృతాన్ని కంటికి కాటుకలాగా దాల్చిన సుందర వదనము కలిగిన తల్లీ ! మా కోరికలను తీరుస్తూ లోకులకు సద్బుద్ధి కలిగించి అందమైన లోకాన్ని ప్రసాదించుమా ! 


పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా 
ఇష్ట కామేశ్వరీ దద్యాత్ మాంగళ్యానంద జీవనమ్ || (5)

అర్థము :- 

పరమేశ్వరునితో పొందిన దివ్య సౌభాగ్యముతో ప్రకాశిస్తూ మాకు అందరికీ కూడ మంగళకరమైన ఆనందముతో కూడిన జీవితాన్ని ప్రసాదించుమా తల్లీ !
   

10, ఫిబ్రవరి 2025, సోమవారం

పంచాయుధ స్తోత్రములు - విష్ణు పూజ

పంచాయుధ స్తోత్రములు అనగా విష్ణువు యొక్క ముఖ్యమైన ఐదు ఆయుధములను కీర్తిస్తూ చదివే స్తోత్రములు. ఇవి చక్రము, శంఖము, గద, ఖడ్గము, మరియు ధనుర్బాణములు. 



ఈ పంచాయుధ స్తోత్ర పారాయణము చేసి మనము విష్ణుమూర్తిని, మరియు ఆ ఆయుధముల ద్వారా కూడ మనకు రక్షణ కల్పించమని వేడుకోవడము జరుగుతోంది. 

ఈ పంచాయుధములు మనల్ని శత్రువులు, అరిషడ్వర్గములు, మున్నగువాటి నుండి రక్షించడమే కాక మనకి అనేక విధాల లాభదాయకములు అయినవి. అందుచేత ఈ స్తోత్రముల పారాయణ ప్రతిరోజు చేయడము మంచిది.

 

చక్రాయుధము తేజస్సు, జ్యోతి, మరియు ఆత్మశక్తి , చేతనా శక్తి ప్రదాయిని. దీని ద్వారా ఆత్మజ్ఞానము పెరుగుతుంది.   

శంఖము వాక్కును, వినికిడి శక్తిని పెంపొందింప జేస్తుంది. 

గదాయుధము శరీర బలము, కండబలము, శక్తి పెంపొందుతుంది. 

ఖడ్గము మరియు బాణములు/ధనుస్సు ఈ రెండు ఆయుధముల స్తోత్రము వలన మన మెదడు, దృష్టి, మనస్సు, సకల అవయవములను సంయమనం చేసుకుని, మన గమ్యము, కార్యములను సఫలము చేసుకోవడానికి తోడ్పడుతాయి. 

అంటే మనము ఈ పంచాయుధ స్తోత్ర పారాయణము ద్వారా ఇవన్నీ మనకు సమర్పించమని, అంతేకాక ఎల్లవేళలా మనని కనిపెట్టుకుని కాపాడుతూ ఉండమని భగవంతుని ప్రార్ధిస్తున్నాము అనే ఒక గట్టి నమ్మకముతో ఈ స్తోత్రాలను చదువుకుంటే మంచి జరుగుతుంది అని నా నమ్మకము.  

ఇప్పుడు ఈ స్తోత్రాలను వాటి అర్థములతో కూడా తెలియజేస్తున్నాను. 

పంచాయుధ స్తోత్రములు 


స్ఫుర త్సహస్రార శిఖాతి తీవ్రమ్ 
సుదర్శనం భాస్కరకోటి తుల్యమ్ 
సురద్విషామ్ ప్రాణ వినాశి విష్ణోహ్ 
చక్రం సదాహం శరణం ప్రపద్యే || ( 1 )

అర్థము :-

చురుకైన వేలకొలది (లేదా వేయి మండుతున్న భాస్వర కణములు) వలె అగ్నిశిఖల కంటే తీవ్రమైన సుదర్శన చక్రము ఏదయితే కోటి సూర్యులతో సమానమైనదో మరియు రాక్షసుల ప్రాణములను అవలీలగా హరిస్తుందో అటువంటి సుదర్శన చక్రాయుధమునే నేను శరణు వేడుతున్నాను.  


విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య
యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా 
తం పాంచజన్యం శశికోటి శుభ్రమ్ 
శంఖం సదాహం శరణం ప్రపద్యే || ( 2 )

అర్థము :-

విష్ణువు ముఖమునుండి వెలువడిన వాయువు ద్వారా పూరించబడి (ఊదబడి) వెలువడిన ధ్వని దానవుల గర్వాన్ని హరించి హడలగొట్టే పాంచజన్యము కోటి చంద్రుల కాంతి కన్నా గొప్పది. అటువంటి పాంచజన్య శంఖమును నేను సర్వదా శరణు వేడుతున్నాను.   


హిరణ్మయీమ్ మేరు సమాన సారామ్ 
కౌమోదకీమ్ దైత్యకులైక హంత్రీమ్ 
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టామ్ 
గదాం సదాహం శరణం ప్రపద్యే || ( 3 )

అర్థము :-

బంగారు మయము (పూర్తిగా బంగారముతో చేయబడినది), మేరు పర్వతము వంటిది, కౌమోదకీ అన్న పేరు కలిగినదీ, దైత్య కులాన్ని నాశనము చేయునది, వైకుంఠనాథుడు అయిన విష్ణుమూర్తికి ఎడమచేతి అలంకారము అయినటువంటి ఆ గదాయుధమును నేను సదా శరణు వేడుతున్నాను.     

రక్షో సురాణామ్ కఠినోగ్ర కంఠ 
చ్ఛేదక్షర చ్చోణిత దిగ్ద ధారమ్
తం నందకం నామ హరే ప్రదీప్తమ్ 
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే || ( 4 )

అర్థము :-

దేవతల రక్షణము చేయు సమయమందు రాక్షసుల కఠినాతి కఠిన మైన కంఠములను కూడ చేదించి ఎడతెరిపిగా కారిపోవుతున్న రక్తపు ధారలతో తడిసిన నందకము అనే పేరు కలిగిన ఆయుధము, శ్రీహరి చెంత ఉండే ఖడ్గాన్ని నేను సర్వవేళల శరణు వేడుతున్నాను.  


యజ్ఞా నినాద శ్రవణాత్ సురాణామ్ 
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః 
భవంతి దైత్యాశని బాణ వర్షి 
శార్ఙ్గమ్ సదాహం శరణం ప్రపద్యే || ( 5 ) 

అర్థము :-

ధనుస్సు యొక్క ధ్వని విన్న వెంటనే రాక్షసులు భయముతో వణికిపోయేట్లా చేసి, జనులందరి భయములను పోగొట్టుటకై ఆ రాక్షసులందరిపై బాణవర్షము కురిపించునటువంటి ఆ శార్ఙ్గమనే ధనుస్సుని నేను శరణు వేడుతున్నాను.   


ఫల శ్రుతి 

ఇమమ్ హరే పంచ మహాయుధానాం 
స్తవం పఠేత్ యోను దినమ్ ప్రభాతే 
సమస్త దుఃఖాని భయాని సద్యః 
పాపాని నశ్యంతి సుఖాని సన్తి  

అర్థము :-

ఇవి అయిదును శ్రీహరి యొక్క పంచ మహాయుధములు. వీటి కీర్తన ప్రతిదినము ప్రభాత కాలములో చదివితే సకల దుఃఖములు సమసి పోయి, పాపములు నశించి, సుఖములను పొందెదరు. 

 
వనే, రణే, శత్రు, జలాగ్ని మధ్యే 
యదృచ్ఛ యాపత్సు మహా భయేషు 
ఇదమ్ పఠన్ స్తోత్ర మవాకులాత్మా
సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షహ 

అర్థము :-

అడవులలోను, యుద్ద భూములందును, శత్రువుల మధ్యలోను, నీటి ప్రమాదము, అగ్ని ప్రమాదము  లోను, ఇంకా అనుకోకుండా వచ్చే ఆపదల సమయము లందును, భయము వేసినప్పుడల్లా భీతి చెందకుండా, చిత్తశుద్ధితో ఈ స్తోత్రాలను చదివితే మిమ్మల్ని ఇవి అన్నివేళలా రక్షిస్తూ సుఖముగా ఉంటారు. 
   

స శంఖ చక్రమ్ స గదాసి శార్ఙ్గమ్ 
పీతాంబరమ్ కౌస్తుభ వత్స చిహ్నమ్ 
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగమ్ 
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే || 

అర్థము :-

శంఖ చక్రముల తోనూ, గద, ఖడ్గము, ధనుస్సుల తోనూ, పీతాంబరము, కౌస్తుభమణి, శ్రీవత్స చిహ్నముల తోనూ, లక్ష్మీదేవితోను కూడి ఉండి దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ విష్ణుమూర్తిని నేను ఎల్లవేళలా శరణు వేడుతున్నాను.  


జలే రక్షతు వారాహః 
స్థలే రక్షతు వామనః 
ఆటవ్యామ్ నారసింహశ్చ 
సర్వత పాతుహు కేశవః || 

అర్థము :-

నీటి ప్రమాదముల నుండి వరాహ స్వామి రక్షించును. భూమి పైన ప్రమాదముల నుండి వామనుడు రక్షించును. అడవిలో వచ్చే ప్రమాదముల నుండి నరసింహ స్వామి రక్షించును. అన్నిచోట్లా, అన్ని సమయములలో కలిగే ఆపదలనుండి కేశవుడు (అంటే శ్రీమన్నారాయణుడు) రక్షించును.                 

7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

శివ పంచాక్షరీ స్తోత్రములు

శివ పంచాక్షరీ స్తోత్రము అంటే శివ నామ జపము లోని ఐదు అక్షరములతో అల్లిన ఐదు స్తోత్రములతో తయారు చేయబడిన సంపుటి. 




"ఓం నమశ్శివాయ" లోని 'ఓం' కాకుండా ఇంకో ఐదు అక్షరములు ఉన్నాయి కదా! ఆ అక్షరములు ఎవి అంటే న, మ, శి, వ, య. 

ఈ ఐదు అక్షరాలతో మొదలు పెడుతూ, ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకము చొప్పున 5 శ్లోకాలు/స్తోత్రాలు ఉన్నాయి. వీటినే శివ పంచాక్షరీ స్తోత్రము అంటారు. 

శివ పరమాత్మను స్మరిస్తూ ఈ ఐదు స్తోత్రాలు చదివి, వాటితో పాటు ఇంకో ముగింపు శ్లోకము కూడ చదువుకుని ఆయనకు పార్వతీదేవితో సహా నమస్కరించు కోవాలి. 

ముందుగా నేను ఆ శ్లోకాలను అర్థములతో సహా వివరిస్తున్నాను. ఆ తరువాత ఈ ఐదు అక్షరముల వెనుక దాగిన అసలు రహస్యము తెలియజేస్తాను.  


శివ పంచాక్షరీ స్తోత్రములు 


నాగేంద్ర హారాయ త్రిలోచనాయ 
భస్మాన్గ రాగాయ మహేశ్వరాయ | 
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ 
తస్మై నకారాయ నమశ్శివాయ || ( 1 )  

అర్థము :-

సర్పముల రాజైన వాసుకిని హారముగా ధరించినవాడును, మూడు నేత్రములు కలిగి ముక్కంటి అయినవాడును, భస్మమును (అంటే బూడిదను) వంటి నిండా పూసుకోవడం పట్ల మక్కువ కలిగిన వాడును, దైవాలలో కెల్ల గొప్పవాడైన మహేశ్వరుడు అయినవాడు, నిత్యుడు అంటే ఆది, అంతములు లేనివాడును, శుద్ధుడు అనగా ఎటువంటి దోషములు, మచ్చలు లేని పరమ పావనుడు, దిక్కులనే తన వస్త్రములుగా దాల్చినవాడును, అయినటువంటి నకారుడవైన ఓ శివా, నీకు నమస్సులు సమర్పిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను. 


మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ 
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ 
తస్మై మకారాయ నమశ్శివాయ || ( 2 )

అర్థము :- 

మందాకినీ నదీజలము తో నూరబడిన చందనము నుదుట దిద్దుకున్నవాడు, నందీశ్వరుడు మొదలగు ప్రమథ గణముల నాయకుడు అయి ఉండి మహేశ్వరునిగా కొలువబడు వాడును, మందారము ముఖ్య పుష్పముగా ఉండే అనేకములైన పుష్పముల జేత కన్నుల విందుగా పూజింపబడుతున్న ఓ మకారుడవైన శివ పరమాత్మా, నీకు నమస్సులు సమర్పిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను.  


శివాయ గౌరీ వదనార వింద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ 
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ 
తస్మై శికారాయ నమశ్శివాయ || ( 3 )

అర్థము :-

సచ్చిదానంద శివా, గౌరీ మాత ముఖానికి అరవింద పుష్పములా ప్రసన్నతను కలిగించువాడా ! సూర్యుని వంటి తేజస్సు కలిగి దక్ష యఙ్ఞమును ధ్వంసము గావించిన ప్రచండ మూర్తీ ! విషమును సేవించుటచే (నల్లని) నీలంగా మారిపోయిన కంఠము కలవాడా! ఎద్దు చిహ్నము కలిగిన జెండా దాల్చినవాడా!  నీకు నమస్సులు సమర్పిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను.    


వశిష్ట కుంభోధ్భవ గౌతమాది  
మునీంద్ర దేవార్చిత శేఖరాయ 
చంద్రార్క వైశ్వానర లోచనాయ 
తస్మై వకారాయ నమశ్శివాయ || ( 4 )

అర్థము :-

వశిష్ఠుడు, అగస్త్యుడు ( ఈ మహర్షి కుంభము నుండి జన్మించుట వలన కుంభోద్భవుడు అని కూడ పేరు పొందెను), గౌతముడు మొదలగు మునిశ్రేష్టుల చేత, మరియు దేవతలందరి చేతను పూజింపబడు ఓ సర్వ శ్రేష్టుడా! చంద్రుని శిఖలో ధరించి, వైశ్వానరుని నేత్రములు కలిగినవాడవు (అగ్ని వలె ఉజ్జ్వలంగా ప్రకాశించు ఆత్మజ్యోతి నేత్రములు ఉన్నవాడు) అయిన ఓ శివపరమాత్మా ! వకారుడవైన నిన్ను నమస్కరిస్తూ శరణు వేడుతున్నాను.     


యక్షస్వరూపాయ జటాధరాయ 
పినాక హస్తాయ సనాతనాయ 
సుదివ్య దేహాయ దిగంబరాయ 
తస్మై యకారాయ నమశ్శివాయ || ( 5 )

అర్థము :-

యక్షుని స్వరూపము కలిగి ఉండి, జటలను దాల్చి, చేతిలో పినాకమును పట్టుకుని, అత్యంత సనాతనుడవు, మిక్కిలి దివ్యమైన దేహము పొంది, నాలుగు దిక్కులనే నీ దుస్తులుగా ధరించిన ఓ యకారుడవైన శివపరమాత్మా ! నీకు నమస్కరిస్తూ నిన్నే శరణు వేడుతున్నాను.   


ముగింపు శ్లోకము (ఫలశ్రుతి)

ఓం పంచాక్షర మిదమ్ పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే || 

అర్థము :-

ఎవరైతే పుణ్య ప్రదమైన ఈ పంచాక్షరీ స్తోత్రములను శివుని సన్నిధిలో చదువుతారో వారు ఆ పరమాత్ముడైన శివుని ప్రేమకు పాత్రులయి శివ లోకాన్ని పొందుతారు గాక!  

ఓం నమో శివాయ నమః!
ఓం నమో శ్రీ పార్వతీ మాతాయై నమః!
ఓం నమో శ్రీ పార్వతీ, పరమేశ్వరాయ నమః ||  

నమశ్శివాయ ఐదు అక్షరముల మహిమ        


శివ మంత్రములో ఐదు అక్షరాలు ఉన్నాయి కదా! అవి "న", "మ", "శి", "వ", "య" అనునవి.  
ఇందులోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పంచతత్త్వమును సూచించుచున్నది. 

"న" అన్న అక్షరము భూ తత్త్వము 
"మ" అన్న అక్షరము జలతత్త్వము 
"శి " అన్న అక్షరము అగ్నితత్త్వము 
"వ " అన్న అక్షరము వాయుతత్త్వము 
"య" అన్న అక్షరము ఆకాశతత్త్వము (శూన్యత)   

ఈ పంచ తత్త్వములు కలిసి ప్రకృతిని, సృష్టిని, పరమాత్మని సంభోదిస్తున్నవి. ఈ సమస్త సృష్టి , సమస్త ప్రపంచము, అన్ని లోకములు, సమస్త విశ్వమూ పరమాత్మ మయము అని బోధించుచున్నది ఈ శివనామ స్మరణ ద్వారా. 

అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు. అన్నీ పరమాత్మ లోనే ఇమిడి ఉన్నాయి అని సూచించడం జరుగుతోంది. 

అంతే కాకుండా ఈ శివనామము లోని అక్షరములు మన శరీరములోని చక్రములను కూడా సూచించుచున్నవి. శివనామ స్మరణ ద్వారా మనలోని ప్రాణ చక్రములు జాగృతము చేసుకోవడము జరుగుతోంది.              

"న" అక్షరము మూలాధార చక్రము జాగృతము చేస్తుంది. ఇది బొడ్డు కింది పొత్తి కడుపు క్రింది భాగములో ఉండి  స్పందనని జాగృతము చేస్తూ మనలోని భావోద్వేగములను, స్పందనలను నియంత్రము చేస్తుంది. భూ తత్త్వము మొదట్లో నిద్రావస్థలో ఉండి జాగృతము అవుతుంది. అప్పుడు మొలకలు, సృష్టి జరుగుతాయి. ప్రేమ, కోపము, భయము, నిద్ర ఇటువంటివి అదుపులో పెట్టుకోవాలంటే ఈ "న" అక్షరము ఉచ్చారణ చేసి ఈ చక్రమును అదుపులోకి తీసుకోవచ్చును. దీని ద్వారా మనస్సు, ఇంద్రియములు అదుపులో ఉండి పనులు సక్రమముగా చేసుకుంటాము.  

"మ" అక్షరము స్వాధిష్ఠాన చక్రమును జాగృతము చేస్తుంది. ఇది బొడ్డు దగ్గిర ఉంటుంది. మన జీర్ణ ప్రక్రియను, కిడ్నీలను అదుపులో ఉంచుతుంది. నీటి సరఫరా, ద్రవములు, రసాలను ఉత్పత్తి చేసే గ్రంథులను నియంత్రణలో ఉంచుకుంటుంది. "మ" అక్షర ఉచ్ఛారణతో జీర్ణ కోశ సమస్యలను సరి చేసుకోవడము జరుగుతుంది. జననేంద్రియములు కూడా అదుపులో సవ్యంగా ఉంటాయి. 


"శి" అన్న అక్షరము అనాహత చక్రమును పైకి లేపుతుంది. ఈ చక్రము మన హృదయములో ఉంటుంది.  ఇది అగ్ని సూచకము. ఈ చక్రము జాగృతము అయితే శక్తి నలువైపులా వ్యాపింపబడుతుంది. మన శరీరములోని గుండె, ఊపిరి తిత్తులు, కాళ్ళు చేతులు సరైన మోతాదులో రక్త ప్రసరణమును, శక్తిని పొంది మంచిగా పని చేస్తాయి. హృదయాన్ని బల పరిచి, మన ఆరోగ్యం బలపడుతుంది. మనలోని ఆత్మ విశ్వాసము పెరిగి అన్ని పనులూ విజయవంతంగా చేసుకుంటాము.  

"వ" అక్షరము వాయువుతో సంబంధము కలిగినది. ఇది విశుద్ధ చక్రాన్ని సూచించుచున్నది. దీని బిందువు గొంతుకలో ఉండి మన భావాలను మాటల ద్వారా వ్యక్త పరిచేందుకు సహకరిస్తూ మంచి నేర్పరితనముతో మాటలాడే శక్తిని ప్రసాదిస్తుంది. మన ఆలోచనలని భావాల ద్వారానూ, మాటలు, సౌజ్ఞలు, రాతల ద్వారానూ వ్యక్త పరిచేందుకు ఈ విశుద్ధ చక్రము జాగృతము చేసుకోవడము చాలా అవసరము. ఇతరుల మాటలు వినుటకు, నలుగురిలో హుందాగా మాట్లాడటానికి సాయము చేస్తూ ఆత్మవిశ్వాసము, ధైర్యము పెంపొందిస్తుంది. 

"య" అక్షరము ఆకాశమును సూచిస్తూ సహస్రార చక్ర ద్యోతకము అవుతోంది. ఇది మన శిరస్సు అగ్రభాగములో ఉండి ఆకాశము వైపు వెలువరుతూ ఉంటుంది. ఈ చక్రము దైవత్వము, ఆత్మలకు చిహ్నము. దీన్ని లేవదీసినచో మనలో జ్ఞానాన్ని, తేజస్సును నింపుతూ ఉంటుంది. విశ్వము, పరమాత్మలతో మన చేతనా శక్తిని కలుపుతూ సాంసారిక మోహాలు, మాయల నుండి మనని తప్పించి దైవ జ్ఞానాన్ని, తెలివితేటలని కలుగజేస్తుంది. 

ఓం నమశ్శివాయ !