వరలక్ష్మి అంటే వరముల నొసగే లక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి వరముల నొసగే తల్లి ఆమె.
సాధారణముగా ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మన అలవాటు. శుక్రవారం ఆ తల్లికి ప్రియమైన రోజు అని ఒక నమ్మకము. మరి శ్రావణ మాసం అంటే లక్ష్మిదేవికి ఇంకా చాలా ఇష్టమైన దన్నమాట.
అందుకే శ్రావణ మాసంలో ఇంకా చాలా భక్తి శ్రద్ధలతో అందరూ పూజిస్తున్నారు.
ఆడ, మగ అందరమూ శుక్రవారాల్లో ఆమెను చాలా ఇష్టంగా పూజిస్తున్నాము. కానీ శుక్రవారం నాడు ప్రత్యేకంగా స్త్రీలు లక్ష్మీదేవిని చాల శ్రద్ధతో వ్రతంలాగా జరుపుకుంటుంటారు.
శ్రావణ మాసం మాత్రం చాల ప్రత్యేకంగా తల్లులు, కూతుళ్ళూ కూడ ప్రతీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటే వారికి అన్ని సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయని ప్రతీతి.
శ్రావణ మాసంలో 4 కాని 5 కాని శుక్రవారాలుంటాయి. వాటిలో రెండవ శుక్రవారం నాడు ఈ వ్రతం తప్పకుండా అతి ప్రాధాన్యంతో జరుపుకుంటే మొత్తం వారి కుటుంబం సుఖ, సంతోషాలతో ఉండడమే కాకుండా వారు కోరిన కోర్కెలన్నీ ఆ తల్లి తీరుస్తుందని పెద్ద నమ్మకంతో ఉంటారు. అందుకే వరలక్ష్మి వ్రతానికి అంత ప్రాధాన్యత ఇస్తారు.
వరలక్ష్మీ వ్రతము చేయు విధానము
సాధారణంగా ఈ వ్రతాన్ని స్త్రీలంతా సాయంత్రము జరుపుకుంటుంటారు. ఎందుకంటే పగలంతా కూడ పనులతో, ఇంకా ఆఫీసు కెళ్లే వారైతే ఆఫీస్ పనిలో మునిగి ఉంటారు. కాబట్టి పొద్దున్నే పూజ చేసుకుంటూ కూర్చుంటే గడవదు. అందుకని సాయంత్రం చేసుకుంటారు. అంతే కాని ఈ వ్రతాన్ని సాయంత్రమే చెయ్యాలని ఏం రూలు లేదు. పొద్దుట కూడ తాపీగా కూర్చుని చక్కగా చేసుకోవచ్చును.
ఇది కాక సాయంత్రం పూట దీపాలు వెలిగించే వేళ లక్ష్మిదేవి ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఎవరెవరు దీపాలు వెలిగించుకుని ఆమెను తలుచుకుంటారో వారి వారి ఇంటికెళ్లి వాళ్ళని ఆశీర్వదిస్తుందని మనందరి నమ్మకం.
ఇప్పుడు వరలక్ష్మి పూజకి తయారీలు
- పూజకి ముందు రోజుగా చుట్టుపక్కల వారిని బొట్టు పెట్టి పూజ,పేరంటాలకు ఆహ్వానిస్తారు. అంతే కాక శెనగలు నీళ్లలో నానబెట్టి ఉంచుకుంటారు. ఆ శెనగలని కూడా నైవేద్యంతో పాటు లక్ష్మీదేవికి పెట్టి అందరికీ పూజానంతరం ప్రసాదంగా పంచి పెడతారు.
- పూజ రోజున పొద్దుటే తలంటు స్నానము చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని తయారు కావాలి.
- ఇల్లు శుభ్రం చేసుకుని పెట్టుకుని స్నానం చేస్తే మంచిది.
- పూజామందిరం లేదా పూజ చేసుకునే స్థలం కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి.
- ఇంటి గడపలకి పసుపు రాసి, కుంకం బొట్లు పెట్టుకుని, అప్పుడు తోరణాలు, మామిడాకులు కట్టుకోవాలి.
- అలాగే పూజాస్థలంలో దేవుణ్ణి పెట్టే చోట కూడ కాస్త తడిబట్టతో తుడిచి పసుపు, కుంకం పెట్టుకోవచ్చును. అలా శుభ్రమైన స్థలంలో దేవుణ్ణి పెట్టుకుని పూజించుకోవాలి.
- స్త్రీలు కూడా పాదాలకి పసుపు రాసుకుని, శుభ్రంగా బొట్టు పెట్టుకుని, గాజులు ధరించి, తలలో పువ్వులు పెట్టుకుని పూజ చేసుకోవాలి.
- దేవునికి అలంకరణగా మామిడాకులు, పూల దండలు కట్టుకోవచ్చును.
- విగ్రహమైతే కాస్త స్నానం చేయించి లక్ష్మీదేవికి పసుపు రాసి, బొట్టు పెట్టి, మిగతా దేవుళ్ళకి కూడా బొట్టు పెట్టి పూజించుకోవాలి.
పూజా విధానము
- సాయంత్రం పూట పూజ చేసే మాటైతే లైట్లు వేసుకుని అప్పుడు పూజ చేసుకోవాలి. లైట్లు వేసే ముందు వీధి తలుపు తెరిచి ఉంచి లైట్ వెయ్యాలి. కనీసం కొన్ని నిముషాలు అలా తెరిచి పెట్టుకోవాలి.
- కాస్త మంచిగా తృప్తిగా పూజ చేసుకోవాలంటే అప్పుడు పసుపు ముద్దతో ఒక లక్ష్మీవిగ్రహం లాగా, ఏదో కాస్త ఎలావచ్చినా ఫర్వాలేదు. ఆవిడ ఆ మూర్తిలో ఉందనే భావన పెట్టుకుంటే చాలు. ఆ మూర్తిని కూడా విగ్రహం, లేదా ఫొటోతో పాటు, పూజ చేసుకుంటామన్నమాట. అది ఎక్కువ తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది.
- దీపాలు వెలిగించి, లక్ష్మీదేవికి ఆహ్వానముగా చేతి మీద కొన్ని నీటిబొట్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత పాదాలకి నీటి బొట్లు కాళ్ళు కడిగినట్లుగా వెయ్యాలి.
- మూడు సార్లు దేవికి ఆచమనం ఇవ్వాలి.
- ఇప్పుడు పూజ మొదలెట్టాలి.
- కొన్ని స్త్రోత్రాలు చదివి, అష్టోత్తర శతనామ స్తోత్రం చదవాలి.
- అష్టోత్తరంలో ముందుగా దేవి కీర్తన, ప్రపత్తి ఉంటుంది "భగవన్నారాయణాభి మతానురూప ..." అని. ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పమని అడిగినట్లుగా ఉంటుంది. స్తోత్ర మహిమ శివుడు వివరిస్తాడు. ఆ తర్వాత శతనామ స్తోత్రం మొదలవుతుంది. ఆఖరిని స్త్రోత్రం చదివితే పొందే లాభాలు ఉంటాయి.
- పూజలో మనం మాటిమాటికి పసుపు, కుంకుమ, పూలు జల్లుతూ ఉండచ్చును.
- శతనామ స్తోత్రం కాకుండా శతనామావళి కూడా చదువుతూ ఇవ్వన్నీ జల్లుతూ పూజ చేసుకోవచ్చును ప్రతీ నామం తర్వాత.
- మీ ఓపికని బట్టి ఎంతైనా, సహస్రనామాలు చదువుతూ కూడా పూజించుకోవచ్చును.
- పూజ అయ్యాక అగరవత్తులు ధూపం చూపించి, అటుపిమ్మట దీపం చూపించాలి.
- అప్పుడు మూడు సార్లు ఆచమనం ఇచ్చి నైవేద్యం సమర్పించాలి.
- నైవేద్యం పెట్టేటప్పుడు అన్నింటి మీద కాసిని నీటిబొట్లు జల్లి అప్పుడు సమర్పించాలి. పాయసము, పులిహార లాంటి తినుబండారాలు, పళ్ళు, నానబెట్టిన శెనగలు, అన్ని కూడ ఆరగింపు పెట్టాక ఏవైనా లోపాలుంటే క్షమించమని వేడుకోవచ్చును.
- ఆ తర్వాత చేతులు, మూతి కడిగినట్లుగా నీటి బొట్లు సమర్పించి, మళ్లీ మూడు సార్లు ఆచమనం ఇవ్వాలి.
- ఇప్పుడు కర్పూర హారతి, దీపము తిప్పుతూ మంగళ హారతి ఇస్తూ, మంగళహారతులు పాడాలి. వచ్చిన ముత్తైదువులు కూడా హారతి పట్టుకోవచ్చును. చదవడం కూడా చెయ్యచ్చును.
- ఇప్పుడు పూజ పూర్తి అయ్యింది. ప్రసాదం గ్రహించి, అందరికి పంచిపెట్టాలి.
- ముత్తైదువులందరికీ శెనగల వాయనం పంచిపెట్టాలి. శెనగలతో పాటు, ఏదైనా పండు, తమలపాకులు, పసుపు కుంకుమలు కూడా పంచిపెట్టాలి.
- ఈ విధంగా ముత్తైదువల ఆశీర్వాదాలు, లక్ష్మిదేవి దీవెనలు పొందడం జరుగుతుంది.
ఈ వరలక్ష్మీవ్రతం నిశ్చలమైన మనస్సుతో భక్తిగా ఆచరించిన వారి కుటుంబానికంతటికీ సుఖ సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి.